చౌక.. బేరం!

Jun 16 2021 @ 00:00AM
నరసరావుపేటలో గత సెప్టెంబర్‌ నెలలో స్వాధీనం చేసుకున్న వేలాది బస్తాల బియ్యం నిల్వలు

 బియ్యం వద్దా.. అయితే ఓకే!

 రేషన్‌ మాఫియాకి ఎండీయూల సహకారం

బియ్యానికి బదులుగా కార్డుదారులకు కేజీకి రూ.8 చెల్లింపు

ఆ బియ్యాన్ని మాఫియాకి చేరవేస్తూ కమీషన్లు

భారీ మొత్తంలో బియ్యం పక్కదారి

వాటిని రీసైక్లింగ్‌ చేసి సరిహద్దులు దాటిస్తూ..

ఇంటికే రేషన్‌ పథకం అభాసుపాలు


సైరన్‌ మోగించుకుంటూ వీధిలోకి రేషన్‌ బండి వస్తుంది... అక్కడకు వెళ్లిన లబ్ధిదారుడికి.. మీకు బియ్యం కావాలా..? లేక బదులుగా డబ్బులు కావాలా అనే  ప్రశ్న ఎదురవు తుంది. బియ్యం కావలసినవారు ఉచితంగానే తీసుకుంటు న్నారు. అవసరం లేనివారు.. ఎక్కువైనవారు తమకు డబ్బులే ఇవ్వం డని అడుగుతున్నారు. కేజీకి రూ.8 నుంచి రూ.10 వరకు చెల్లిస్తున్నారు. ఇంటికే రేషన్‌ పథకంలో జరుగుతున్న తంతు ఇది...! రేషన్‌ బండి వద్దకు 50 మంది వస్తే అందులో 30 మంది డబ్బులు తీసుకోవడం గమనార్హం.. ఇలా సేకరిం చిన బియ్యాన్ని నల్లబజారుకు తరలిస్తున్నారు. తలా పాపం తిలా పిడికెడు అన్నట్లుగా రేషన్‌ మాఫియా, డీలర్లు, ఎండీయూ ఆపరేటర్లు ఈ వ్యవహారంలో ఒక్కటయ్యారు.


  ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌, జూన్‌ 16: జిల్లా కేంద్రమైన గుంటూరు నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ రేషన్‌ బియ్యం విక్రయాలు జోరు గా కొనసాగుతున్నాయి. రేషన్‌ మాఫియా కొంత మంది మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్‌ (ఎండీ యూ) ఆపరేటర్లతో అవగాహన కుదు ర్చుకుని ఈ దందాకు పాల్పడుతున్నారు. మే నెల నుంచి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం కోటాలు కలిపి రైస్‌ కార్డులో ఉన్న ప్రతీ కుటుంబ సభ్యుడికి 10 కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేస్తుండటంతో భారీ మోతాదులో పక్కదారి పడుతోంది. నలుగురు సభ్యులున్న కుటుంబానికి నెలకు 40 కేజీల బియ్యం వస్తుండటంతో వారు సగంపైగా ఎండీ యూలకే విక్రయిస్తున్నారు. ఇలా సేకరిస్తున్న బి య్యాన్ని వారు మాఫియాకి సరఫరా చేసి కేజీకి రూ.10కి పైగా కమీ షన్‌ పొందుతున్నారు. ఎండీ యూలే కాకుండా కొంత మంది ప్రజల వద్దకు నేరుగా వెళ్లి వారి వద్ద బియ్యం కొనుగోలు చేసి మాఫియాకి ఇచ్చి లాభం పొందు తున్నారు.


రేషన్‌ సేకరణ ఇలా..

జిల్లావ్యాప్తంగా కొంత మంది ఎండీయూలు అనధికా రికంగా తమ వాహనాలను డీలర్ల కు ఇచ్చేశారు. ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం ఎండీయూనే బియ్యం డోర్‌ డెలివరీ చేస్తున్న ట్లుగా నమోదై ఉంటుంది. క్షేత్రస్థాయిలో మాత్రం ఎండీయూ స్థానంలో రేషన్‌ డీలర్‌ ఆయన ని యమించిన వేరొకరు ఉంటున్నారు. ఈ-పోస్‌ యంత్రంపై ముందుగానే వేలిముద్ర వేయించు కొని డోర్‌ డెలివరీకి వస్తున్నారు. ఒకచోట ఎండీ యూ వాహనాన్ని పార్కింగ్‌ చేసి అక్కడికే అంద రిని రమ్మంటున్నారు. లక్షాధికారులు, కోటీశ్వరు లకు కూడా జిల్లాలో చాలాచోట్ల రేషన్‌కార్డులు న్నాయి. దాంతో వారు బియ్యం, కందిపప్పు తీసు కోవడం లేదు. పంచదార మాత్రమే తీసుకొంటు న్నారు. బియ్యానికి బదులుగా ఎండీయూ ఆప రేటర్‌ నుంచి నగదు తీసుకొని వెళ్లిపోతున్నారు.  అలానే బియ్యం తీసుకొన్న వారి ఇళ్లకు కొంత మంది దళారులు వెళ్లి ఎక్కువ నగదు ఇచ్చి కొను గోలు చేస్తోన్నారు. గతంలో గుట్కా వ్యాపారాలు చేసే వారిపై పోలీసుల నిఘా పెరగడంతో ఇప్పు డు వారంతా ఇందులోకి దిగారు. వీరి అక్రమా లను కొంతమంది అధికారులు చూసి చూడనటు ్లగా వదిలేస్తోన్నారు. ఎండీయూ ద్వారా తమకు 90 శాతం పైగా బియ్యం పంపిణీ జరిగితే చాలు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. 

- తీర ప్రాంతం అయిన రేపల్లె నియోజక వర్గంలో డీలర్లే పేదలకు చెందాల్సిన బియ్యాన్ని  కొనుగోలు చేసి రీసైక్లింగ్‌కుకాకినాడ, రాజమ హేంద్రవరం ప్రాంతాలకు తరలించి సొమ్ము చే సుకుంటున్నారు. పేదల బియ్యాన్ని కర్లపాలెంకు చెందిన ఓ వ్యక్తి, తీరప్రాంతానికి చెం దిన మరో వ్యక్తి రేషన్‌ బియ్యాన్ని కొనుగోలు చేస్తూ కాకినాడకు పంపుతూ గతంలో పలుమార్లు  పట్టుబడ్డారు. లారీలు,  పాల వ్యాన్లు, రొయ్యల వ్యాన్ల ద్వారా జిల్లాల జిల్లాలు దాటిస్తూ లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. గత నెల 30న పెనుమూడి చెక్‌పోస్టు వద్ద పోలీస్‌లు ఽతనిఖీలు నిర్వహించగా ఒక లారీలో 335 గో తాల్లో బియ్యం పట్టుకున్నారు.

- ప్రత్తిపాడును అడ్డాగా చేసుకుని రేషన్‌ బియ్యం మాఫియా పేట్రేగిపోతోంది. కాకుమాను మండలంలో కొందరు రెవెన్యూ అధికారులే దగ్గరుండి మరీ ఈ వ్యాపారాన్ని జరిపిస్తున్నారా అన్నట్టు ఉంది.  అక్రమ వసూళ్లకు ప్రత్యేకంగా ఇక్కడ ఒకరిని ప్రైవేట్‌గా నియమించుకున్నారు. వట్టిచెరుకూరు మండలంలోని చింతపల్లిపాడు వద్ద గల రైస్‌మిల్లులో పెద్ద ఎత్తున బియ్యం నిల్వలను స్వాధీన పరుచుకున్నారు. ఈ నిల్వలు అధికార పార్టీ నేతకు  చెందినవనే సంగతి బహిరంగ రహస్యమే. ముట్లూరులో బియ్యం పంపిణీ వాహనాల నుంచే నేరుగా బియ్యాన్ని డంప్‌ చేస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. 

- తెనాలి ప్రాంతంలో బియ్యం మాఫియా చెలరేగిపోతోంది. మాచర్ల మండలం కంభంపాడు రైసుమిల్లు అడ్డాగా ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది.  పొన్నూరు నియోజకవర్గంలో 10 మంది రేషన్‌ బియ్యం నల్లబజారుకు తరలించే అక్రమ వ్యాపారం చేస్తున్నారు. ఆరు నెలల కాలంలో వేమూరు నియోజకవర్గంలో 14 మం ది డీలర్లపై కేసులు బనా యించారు. అయితే ఎటువంటి చర్యలు లేకుండానే  తిరిగి వారినే నియమించారు. పెదకూరపాడు నియోజకవర్గంలో రేషన్‌ బియ్యాన్ని ప్రభుత్వ వాహనాల్లోనే లబ్ధిదారులకు ఇస్తున్నట్టు బ యోమెట్రిక్‌ ద్వారా సంతకాలను తీసుకొని బియ్యానికి బదులు కేజీకి రూ.10 చొప్పున చెల్లిస్తున్నారు. 

- పల్నాడుప్రాంతంలో పేదలకు అందాల్సిన రేషన్‌బియ్యం యథేచ్ఛగా తరలిస్తున్నారు. పిడుగురాళ్ల, గుర జాల, దాచేపల్లి మండల  కేంద్రాలే కా కుండా గ్రామీణ ప్రాంతాల్లో సైతం రేషన్‌బియ్యాన్ని కొనుగోలు చేసే వారు ఎక్కువయ్యారు. తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామంలో నాలుగు రోజుల క్రితం  బ్లాక్‌మార్కెట్‌కు తరలించటానికి సిద్ధంగా ఉంచిన 70 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని పోలీసులు పట్టుకొని ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. నియోజకవర్గంలోని తుళ్లూరు, ఫిరంగిపురం, మేడికొండూరు మండలాల్లో కూడా ఇదే విధంగా ఇంటింటికీ తిరిగి తక్కువకు కొనుగోలు చేసి, ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారు.

- చిలకలూరిపేట పట్టణంలోని అధికారపార్టీకి చెందిన ఓ నేత, పసుమర్రు గ్రామానికి చెందినకొంతమంది చిలకలూరిపేట పట్టణం, మండలంలో బియ్యం వ్యాపారం చేస్తున్నట్లు స మాచారం. గత మే నెల 13వ తేదీన చిలకలూరిపేటలో ఏఎంజీ వద్ద మా ర్కెట్‌యార్డు చెక్‌పోస్టు పక్కన డొంక లో గణపవరం పరిధిలోని శ్రీనివాస ట్రేడర్స్‌ నుంచి 22 టన్నుల రేషన్‌ బియ్యంను లారీలో తెలంగాణ రాష్ట్రానికి తరలిస్తుండగా విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు స్వాధీ నం చేసుకున్నారు. గత మార్చి 31న పట్టణంలోని శాంతినగర్‌లో లారీలో తరలించేందుకు సిద్ధం చేసిన 40 క్విం టాళ్ల బియ్యంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యడ్లపాడు మండలంలో సొలస, కొండవీడు, కారుచోల గ్రా మాలకు చెందిన వ్యాపారులు  అధికార పార్టీ నాయకుల అండదండలతో  రేషన్‌ బ్యియ్యం సేకరించి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇటీవల కాలం లో సొలస నుంచి కాకినాడకు తరలిస్తున్న రేషన్‌ బియ్యం లారీలను పోలీసులు సీజ్‌ చేశారు. నాదెండ్ల మండలంలో గణపవరం, సాతులూరు, తూబాడు గ్రామాలు కేంద్రాలుగా రేషన్‌ బియ్యం అక్రమ వ్యాపా రం జరుగుతోంది. 

- నరసరావుపేట కేంద్రంగా ఉచితబియ్యం బ్లాక్‌ మార్కెట్‌ కొనసాగుతోంది. ఇక్కడ రెం డు మిల్లుల్లో బియ్యంకు పాలిష్‌ పట్టించి జిల్లా సరిహద్దులు దాటిస్త్తున్నారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు, పల్నాడు ప్రాంతం నుంచి కూడా ఇక్కడకు బియ్యం నిల్వలు వస్తు న్నాయి. గతంలో పల్నాడురోడ్డులోని మిల్లులో వేలాది బస్తా ఉచితబియ్యం నిల్వలను స్వాధీనపరచుకున్నారు. పల్నాడురోడ్డు, వినుకొండ రోడ్డు కేంద్రాలుగా బియ్యం బ్లాక్‌ మార్కెట్‌ సాగుతోంది. 

- ప్రత్తిపాడు మండలంలో ముగ్గు ముసుగులో రేషన్‌  వ్యాపారం జోరుగా సాగుతోంది. ముగ్గు వ్యాపారులు రేషన్‌ వాహనం వెనుకనే రిక్షాలతో క్యూ కడతారు. చిన్నచిన్న మూటలుగా కట్టి ముగ్గు బండిలో తీసుకెళుతుంటారు. ఇప్పటికే పలుమార్లు పోలీసులు దాడులు చేసి ఇలాంటివారిని పట్టుకున్నారు.  

-  సత్తెనపల్లి పట్టణం, మండలంలోని కొంతమంది వ్యాపారులు రేషన్‌బియ్యాన్ని కొనుగోలు చేసి బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తున్నారు. కొమెరపూ డిలోని ఓ మిల్లు కేంద్రంగా అక్రమ రేషన్‌ వ్యాపారం  కొనసాగుతోంది. ఈ మిల్లువద్ద నుంచి రేషన్‌ బియ్యం కాకినాడ సమీపంలోని గంగవరం పోర్టుకు, తరలివెళ్తుండగా గత నెలలో మేడికొండూరులో విజిలెన్స్‌ అధికారు లు తనిఖీచేసి పట్టుకున్నారు. ముప్పాళ్ల మండలంలో ఒకరిద్దరు వ్యాపారు లు బియ్యాన్ని కొనుగోలు చేసి నరసరావుపేట ప్రాంతానికి చెందిన ఓ వ్యా పారికి విక్రయించి సొమ్ముచేసుకుంటున్నారు. రాజుపాలెం, నకరికల్లు మండలాల్లో సేకరించిన బియ్యాన్ని నరసరావుపేట,పిడుగురాళ్లప్రాంతాలకు తరలించి సొమ్ముచేసుకుంటున్నారు. 

- వినుకొండ నియోజకవర్గంలో రేష న్‌ అక్రమ వ్యాపారానికి అవధులు లే కుండా పోయాయి. మొబైల్‌ వ్యాన్ల (ఎండీయూ) యజమానులే లబ్ధిదా రుల నుంచి కిలో రూ.14 వరకు కొను గోలు చేసి బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తు న్నారు. ఈ ఏడాది మే నెలలో ఇని మెళ్లలో 5 క్వింటాళ్లు, ఈపూరులో 32 క్వింటాళ్లు,  బోడిపూడివారిపాలెంలో 4 క్వింటాళ్ల బియ్యాన్ని పోలీసులు స్వాఽ దీనం చేసుకున్నారు. చినకంచర్లలో ప్ర తిఒక్కరికి 10 కిలోల బియ్యం పంపిణీ చేయాల్సి ఉండగా కేవలం 5 కిలోలు మాత్రమే పంపిణీ చేశారు. ముండ్రు వారిపాలెం, పిచికలపాలెం గ్రామాల్లో అక్రమంగా నిల్వచేసిన రేషన్‌ బియ్యా న్నిపోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.