రేషన్‌ సరుకులు ఏవీ..?

ABN , First Publish Date - 2021-02-28T04:57:21+05:30 IST

రేషన్‌ పంపిణీలో అడుగడుగునా లోపాలు కనిపిస్తున్నాయి.

రేషన్‌ సరుకులు ఏవీ..?
పెదమల్లంలో రేషన్‌ వాహనం వద్ద గుమిగూడిన జనం

ఇంటింటికి ఇస్తామని.. రోడ్డుపై నిలబెట్టారు

నెలరోజులైనా పంపిణీ పూర్తి కాలేదు


పొలం వెడుతున్నానంటే.. బియ్యం వచ్చాయి తీసుకువెళ్లమన్నారు. బియ్యం కోసం వెడితే స్టాకు లేదు సాయంత్రం ఇస్తామన్నారు. ఉదయం 8 గంటలకే వాహనంలో స్టాకు నిల్‌ అంటున్నారు. ఇది ఓ రైతుకూలీ ఆవేదన.


రేషన్‌ పంపిణీ వాహనం వచ్చింది.. వచ్చి సరుకులు తీసుకువెళ్లండి ఇది గ్రామ వలంటీర్‌ అభ్యర్థన. వాహనం ఎక్కడ ఉంది అంటే ఖాళీ ప్రదేశంలో, ఇంటికి 100 మీటర్ల దూరంలో నిలిపి ఉంచుతున్నారు. 


నాకు ఆరోగ్యం బాలేదు.. సాయంత్రం వచ్చి సరుకులు ఇస్తాను.. ఇది సరుకుల పంపిణీ వాహన డ్రైవర్‌ సమాధానం. ఒక్క కార్డు అయినా ఈ పోస్‌లో చేయకపోతే మేము విధులు నిర్వర్తించినట్టు కాదు అందుకే ఒకటి, రెండు కార్డులకు బియ్యం, పంచదార ఇస్తున్నాను.


వీరవాసరం/పెనుమంట్ర/ఆకివీడు/ఆచంట, ఫిబ్రవరి 27: ఇంటింటికీ రేషన్‌ పంపిణీలో కార్డుదారులను రోడ్డుపై నిలబెడుతున్నారని పలువురు వాపోతున్నారు. రేషన్‌ దుకాణాల వద్దకు వెళ్లి నిత్యవసరాలు తెచ్చుకోడానికి ఎటువంటి ఇబ్బందులు పడలేదు. ఇంటింటికీ సరుకులు పంపణీతో రోడ్డుపై పడిగాపులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరవాసరం మం డల కేంద్రం లో 9 చౌకదుకాణాలు ఉండగా వాటితో పాటు నందమూరుగరువు, పెర్కిపాలెం, వడ్డిగూడెంతో కలిపి మూడు వాహనాలను కేటాయించారు. ఈ నెల 15న ప్రారంభమైన రేషన్‌ పంపిణీ 30 శాతం కూడా పూర్తికాని పరిస్థితులు ఎదురయ్యాయి. కొందరు వాహనాల వద్దకు వెళ్ళి సరుకు లు తీసుకోగా మరికొందరు ఇంటికి తెచ్చి ఎందుకివ్వరని ప్రశ్నిస్తున్నారు.


పెనుమంట్ర మండలం రేషన్‌ పంపిణీలో అడుగడుగునా లోపాలు కనిపిస్తున్నాయి. నెగ్గిపూడి శివారు వనంపల్లిలో శుక్రవారం సరుకుల రేషన్‌ పంపిణీ ప్రారంభించారు. వాహనాన్ని ఒకచోట నిలిపి అక్కడి వలంటీర్‌ పరిధిలోని 50 కుటుంబాల లబ్ధిదారులను అక్కడికే వచ్చి తీసుకోవాలని చెప్ప డంతో వారంతా నడిరోడ్డుపై నిలబడ్డారు. ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు రేషన్‌ దుకాణంలో తెచ్చుకునే తాము రోడ్డుపై నిలబడాల్సి వచ్చిందని వాపో తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వలంటీర్లు దురుసుగా వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.


దిక్కుమాలిన పద్ధతులతో కార్డుదారులు, డీలర్లకు సైతం ఇబ్బందులు తెచ్చిపెట్టారని ఆకివీడులో మహిళలు ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు. నెల గడిచి నా ఇంతవరకు సరుకులు అందలేదు. నిన్న మొన్నటి వరకు బియ్యం ఇంటి కి వచ్చి ఇస్తారని చెప్పారు. వాహనాల డ్రైవర్లు మానివేయడంతో వీఆర్వో, డీలర్ల ద్వారా దుకాణాల్లోనే సరుకులు ఇస్తున్నారు. ప్రతీబస్తాకు తూకం వేయాల్సి ఉండడం, సర్వర్‌ పనిచేయకపోవడం వంటి సమస్యలతో ఉదయం నుంచి రేషన్‌ దుకాణం వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితి. మరోవైపు డీలర్లు  సమస్యలు పరిష్కరించాలని వేడుకుంటున్నారు. ఇంటింటి రేషన్‌ పథకంతో డీలర్ల పరిస్థితి అయోమయం. అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.


ఆచంట మండలంలో రేషన్‌ పంపిణీ పూర్తి కాలేదు. మండలంలో సుమారు 80శాతం రేషన్‌ పంపిణీ అయినట్లు చెబుతున్నా నెల ముగిసినప్పటికీ అందని వారి పరిస్థితి ప్రశ్నార్ధకం. ప్రతి ఇంటికి వచ్చి రేషన్‌ అందించాల్సి ఉన్నా అమలు చేయలేకపోతున్నారని పెదమల్లం మాజీ సర్పంచ్‌ అంజూరి శరాబందురాజు ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రాంతానికి వాహనం రాకుం డా వేరేచోట ఉంచి అక్కడికి వెళ్లి బియ్యం తీసుకోవాలనడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ ప్రాంతానికి రోడ్డు సౌకర్యం ఉన్నప్పటికీ రేషన్‌ బియ్యం వాహనం రాకపోవడం ఎంత వరకు సమంజసం అని మాజీ సర్పంచ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2021-02-28T04:57:21+05:30 IST