సగం మందికే రేషన్‌ బియ్యం

ABN , First Publish Date - 2022-01-22T04:36:54+05:30 IST

పేదలకు ఈ పర్యాయం రేషన్‌బియ్యం పూర్తిస్థాయిలో అందడం లేదు. గోడౌన్‌పాయింట్లకు రావాల్సిన కోటా కంటే తక్కువ మోతాదులో రావడంతో ఆ మేరకు మాత్రమే రేషన్‌ దుకాణాలకు బియ్యం అందాయి. దీంతో డీలర్లు తొలుత వెళ్లిన లబ్ధిదారులకు మాత్రం పూర్తిస్థాయిలో బియ్యం ఇచ్చారు. ఆ తర్వాత రేషన్‌షాపుల్లో నిల్వలు లేకపోవడంతో బియ్యం ఇవ్వలేదు.

సగం మందికే రేషన్‌ బియ్యం

దర్శి నియోజకవర్గానికి 2287 మెట్రిక్‌ టన్నులకుగాను 1179 టన్నుల పంపిణీ

తొలుత వచ్చిన లబ్ధిదారులకే కేంద్రం కోట అందజేత

నిరాశతో వెనుదిరుగుతున్న కార్డుదారులు


దర్శి, జనవరి 21 : పేదలకు ఈ పర్యాయం రేషన్‌బియ్యం పూర్తిస్థాయిలో అందడం లేదు. గోడౌన్‌పాయింట్లకు రావాల్సిన కోటా కంటే తక్కువ మోతాదులో రావడంతో ఆ మేరకు మాత్రమే రేషన్‌ దుకాణాలకు బియ్యం అందాయి. దీంతో డీలర్లు తొలుత వెళ్లిన లబ్ధిదారులకు మాత్రం పూర్తిస్థాయిలో బియ్యం ఇచ్చారు. ఆ తర్వాత రేషన్‌షాపుల్లో నిల్వలు లేకపోవడంతో బియ్యం ఇవ్వలేదు. 

కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న గత నెల, ఈ నెల కోటాల బియ్యం ఒకేసారి పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. గత నెలలో కేంద్రప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా బియ్యం రాష్ట్రంలో పంపిణీ చేయలేదు. ఈనెలలో రెండు దఫాల బియ్యం పంపిణీ చేస్తున్నట్లు అధి కారులు ప్రకటించారు. దర్శి నియోజకవర్గానికి రెండు దఫాల బి య్యం మొత్తం 2287 మెట్రిక్‌ టన్నులు విడుదల చేయాల్సి ఉంది. అయితే కేవలం 1179 మెట్రిక్‌ టన్నులు మాత్రమే సరఫరా చేశారు. ఇంకా 1107 మెట్రిక్‌ టన్నుల బియ్యం అందాల్సి ఉంది. రావాల్సిన వాటాలో 60 శాతం బి య్యం మాత్రమే సరఫరా కావడంతో లబ్ధిదారులందరికీ బియ్యం అందలేదు. నియోజకవర్గంలో మొత్తం 81872 రేషన్‌కార్డులు ఉన్నాయి. ఇందులో 60 శాతం మందికి మాత్రమే బియ్యం అందాయి. ప్రస్తుతం కార్డుదారులు రేషన్‌ దుకాణాలకు వెళ్లి అక్కడ బియ్యం సరఫరా చేయకపోవడంతో నిరాశతో వెను తిరిగి వస్తున్నారు. ఈ నెలాఖరు లోపు బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది. ఈ లోపు బియ్యం అందుతాయో లేదో రేషన్‌ తీసుకునేందుకు సమయం ఉంటుందో..? లేదో..? అని కార్డుదారులు ఆందోళనలు చెందుతున్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా కేంద్రప్రభుత్వం రెండు విడతల బియ్యం ఒకేసారి పంపిణీ చేస్తుందని ప్రస్తుతం రావాల్సిన కోటాలో 60 శాతం బియ్యం అందాయని, మిగిలిన బియ్యం త్వరలో దిగుమతి అవుతాయని చెప్పారు. అందగానే కార్డుదారులందరికీ పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు.

Updated Date - 2022-01-22T04:36:54+05:30 IST