బియ్యం బదులు డబ్బులు?

ABN , First Publish Date - 2020-07-14T15:07:21+05:30 IST

కరోనా కష్టకాలంలో ప్రజలకు ఇస్తోన్న ఉచిత బియ్యం పక్కదారి..

బియ్యం బదులు డబ్బులు?

రూ.7 ఇస్తామని రేషన్‌డీలర్ల ప్రలోభాలు

ప్రేక్షకపాత్ర పోషిస్తోన్న పౌరసరఫరాల అధికారులు


గుంటూరు(ఆంధ్రజ్యోతి): కరోనా కష్టకాలంలో ప్రజలకు ఇస్తోన్న ఉచిత బియ్యం పక్కదారి పడుతున్నాయి. సరుకులు పంపిణీ చేయాల్సిన చోటే బియ్యం కావాలా... డబ్బులు కావాలా అని రేషన్‌ డీలర్లు ప్రలోభాలకు గురి చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో వేలిముద్ర వేయించుకుని కేజీకి రూ.7 చొప్పున ఇస్తున్నారు. ఇలా మిగిలిన బియ్యాన్ని ఇతర జిల్లాలకు ఎగుమతి చేస్తూ కరోన లాక్‌డౌన్‌, అన్‌లాక్‌లోనూ రేషన్‌ మాఫియా జేబులు నింపుకుంటోంది. 


రేషన్‌ బియ్యాన్ని ఇంచుమించు 60 శాతం మందికి పైగా ప్రజలు దోశ పిండికి వినియోగిస్తుంటారు. కొంతమంది బహిరంగ మార్కెట్‌లో 25 కేజీల బస్తా కొనుగోలు చేసి అందులో ఈ రేషన్‌ బియ్యాన్ని కలిపి వినియోగించుకుంటూ ఉంటారు. అయితే వారానికి ఒకసారి తయారు చేసుకునే దోశపిండికి పెద్దగా బియ్యం అవసరం లేదు. దీంతో లాక్‌డౌన్‌లో ఇచ్చిన బియ్యం నిల్వలే చాలామంది వద్ద పేరుకుపోయి ఉన్నాయి. ఇదే అదనుగా కొంతమంది డీలర్లు ప్రలోభాలకు తెరలేపారు. కేజీ రూ.7 కొనుగోలు చేసిన బియ్యాన్ని వారు మాఫియాకి రూ.10 నుంచి రూ.12కి విక్రయిస్తూ లాభపడుతున్నారు. ఇలా వెళ్లిన బియ్యం తిరిగి రీసైక్లింగ్‌ అవుతున్నది.


జిల్లాలో ఇటీవలకాలంలో పెద్దఎత్తున విజిలెన్స్‌, పోలీసు అధికారులు దాడులు నిర్వహించి రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకోవడం పరిస్థితికి అద్దం పడుతున్నది. స్టాక్‌ రిజిష్టర్‌ తనిఖీలు సక్రమంగా జరగకపోతుండటంతో డీలర్లపై ఎలాంటి చర్యలు ఉండటం లేదు. ఇప్పటికిప్పుడు గుంటూరులో ఏ షాపునకు వెళ్లి తనిఖీ చేసినా హెచ్చు, తగ్గులు కనిపిస్తాయనేది బహిరంగ రహస్యమే. పంపిణీ చివరి రోజుల్లో చాలామంది డీలర్లు తమ వద్ద బియ్యం స్టాకు లేనప్పటికీ షాపులు తెరిచి కార్డుదారులతో వేలిముద్రలు వేయించుకుని డబ్బులు చేతిలో పెడుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు కరోనా విధుల్లో నిమగ్నమై ఉండటం కూడా ఈ పరిస్థితికి కారణంగా మారింది.  


Updated Date - 2020-07-14T15:07:21+05:30 IST