నిల్వతో ప‘రేషన్‌’!

ABN , First Publish Date - 2021-07-18T06:17:31+05:30 IST

చౌక దుకాణాల్లో సంవత్సర కాలంగా నిత్యావసరాల నిల్వలు పేరుకుపోతున్నాయి.

నిల్వతో ప‘రేషన్‌’!

చౌక దుకాణాల్లో ఏడాదిగా నిత్యావసరాల నిల్వలు 

జనవరిలో ఈ పోస్‌ యంత్రాల్లో జీరో బ్యాలెన్స్‌ 

డీలర్ల ఆందోళనతో కొద్ది సరుకు బదలాయింపు 

స్వాధీనం చేసుకోవాలని కమిషనర్‌ ఆదేశాలు 

పట్టించుకోని సివిల్‌ సప్లయిస్‌ డీఎం కార్యాలయం 


చౌక దుకాణాల్లో సంవత్సర కాలంగా నిత్యావసరాల నిల్వలు పేరుకుపోతున్నాయి. వీటిని స్వాధీనం చేసుకోవాలని కమిషనర్‌ ఇచ్చిన ఆదేశాలను జిల్లా పౌరసరఫరాల సంస్థ డీఎం కార్యాలయం లెక్క చేయటం లేదు. నాన్‌ సార్టెక్స్‌ బియ్యం, పంచదార, కందిపప్పు, శెనగలు పెద్ద ఎత్తున మగ్గిపోతున్నా వాటిని సివిల్‌ సప్లయిస్‌ సంస్థ స్వాధీనం చేసుకోకపోవడంతో డీలర్లు ఆందోళన చెందుతున్నారు. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : రేషన్‌ డీలర్ల దగ్గర నిల్వ ఉన్న నిత్యావసరాలను వెనక్కు తీసుకోవాలని సివిల్‌ సప్లయిస్‌ కమిషనర్‌ కొద్దికాలం కిందట ఆదేశాలు జారీ చేసినా.. జిల్లా పౌరసరఫరాల సంస్థ డీఎం కార్యాలయం పట్టించుకోలేదు. ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఇన్‌చార్జిలకు ఆదేశాలు ఇవ్వటం లేదు. ఫలితంగా చౌక దుకాణాల్లో నిల్వ ఉన్న సరుకులు పుచ్చిపోతున్నాయి. తాజాగా కమిషనర్‌ మరోసారి ఆదేశాలు ఇచ్చినా జిల్లా సివిల్‌ సప్లయిస్‌ డీఎం కార్యాలయం పట్టించుకోవటం లేదు. 


ఈ పోస్‌లలో జీరో బ్యాలెన్స్‌.. అయినా...

సార్టెక్స్‌ రైస్‌ ప్రవేశపెట్టక ముందు నుంచే రేషన్‌ దుకాణాల దగ్గర నిత్యావసర నిల్వలు ఉన్నాయి. వీటిలో నాన్‌ సార్టెక్స్‌ బియ్యం, కందిపప్పు, పంచదార, శెనగలు ఉన్నాయి. జనవరి నెలలో బియ్యం, పంచదార నిల్వలు డీలర్ల దగ్గర ఉన్నాయి. ఫిబ్రవరి నుంచి డోర్‌ డెలివరీ విధానానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో జనవరిలో డీలర్ల ఈ పోస్‌లలో జీరో బ్యాలెన్స్‌ చూపించారు. మిగిలిపోయిన నిత్యావసరాలను స్వాధీనం చేసుకున్న తర్వాతే ఇలా చూపించాలి. అయితే డోర్‌ డెలివరీ కోసం తొందరపడి ఉన్నత స్థాయిలోనే ఈ పని చేశారు. తర్వాత కూడా ఆ పని చేయకపోవటంతోనే తంటా ఏర్పడింది. జనవరి నాటికి ఉన్న క్లోజింగ్‌ బ్యాలెన్స్‌తో పాటు ఆ తర్వాత ఇచ్చిన కందిపప్పు, శెనగలు కూడా డీలర్ల దగ్గర ఉన్నాయి. వీటన్నింటినీ ఎంఎల్‌ఎస్‌ స్టాక్‌ ఇన్‌చార్జ్‌ల ద్వారా స్వాధీనం చేసుకునేలా డీఎం సివిల్‌ సప్లయిస్‌ కార్యాలయం చర్యలు తీసుకోవాలి. చౌక దుకాణాల దగ్గర ఉన్న నిల్వలను స్వాధీనం చేసుకోవాలని కమిషనర్‌ ఆదేశించిన తర్వాత కూడా డీఎం కార్యాలయం చర్యలు తీసుకోలేదు. రెండు నెలల తర్వాత సివిల్‌ సప్లయిస్‌ కమిషనరేట్‌ కార్యాలయం నుంచి డీలర్ల దగ్గర ఉన్న నిల్వ సరుకును మధ్యాహ్న భోజనం, ఐసీడీఎస్‌లకు బదలాయించారు. అప్పటికే కందిపప్పు చాలావరకు పుచ్చిపోయింది. పంచదార నీరు కారింది. 


ఈ పోస్‌లలో జీరో బ్యాలెన్స్‌గా ఉండటం, తమ దగ్గర సరుకు నిల్వలు ఉండటంతో డీలర్లు బెంబేలెత్తి పోతున్నారు. విజిలెన్స్‌ తనిఖీలు చేస్తే ప్రతి డీలర్‌ దగ్గర నిల్వలు కనిపిస్తుంటాయి. ఇలాంటపుడు తమ మీద కేసులు నమోదు చేస్తారని డీలర్లు భయపడుతున్నారు. ఈ నిల్వలను స్వాధీనం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ డీలర్ల సంఘాలు కమిషనర్‌ను కలిసి విజ్ఞప్తి చేశాయి. దీంతో ఇటీవల మరోమారు ఆయన డీఎం కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేశారు. రెండోసారి ఆదేశాల తర్వాత కూడా సరుకునే స్వాధీనం చేసుకోకపోవడంతో రేషన్‌ డీలర్లు ఆందోళన చెందుతున్నారు. నిల్వ సరుకును ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు తీసుకువెళితే.. డీఎం సివిల్‌ సప్లయిస్‌ కార్యాలయం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని చెబుతుండటం గమనార్హం. 

Updated Date - 2021-07-18T06:17:31+05:30 IST