పేదల ఇంటికే రేషన్‌

ABN , First Publish Date - 2021-01-22T05:24:05+05:30 IST

పేదల ఇంటి వద్దకే రేషన్‌ సరుకులు తీసుకువెళ్లి అందజేసే ఉద్దేశంతో ప్రభుత్వం రేషన్‌ మొబైల్‌ వాహనాలను ప్రవేశపెట్టిందని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన వీటిని గురువారం లబ్ధిదారులకు అందజేశారు.

పేదల ఇంటికే రేషన్‌
రేషన్‌ మొబైల్‌ వాహనాన్ని ప్రారంభిస్తున్న ఎంపీ, ఎమ్మెల్యేలు, కలెక్టర్‌, జేసీ తదితరులు

రేషన్‌ సరుకుల వాహనాలను ప్రారంభించిన కలెక్టర్‌

హాజరైన ఎంపీ, ఎమ్మెల్యేలు

కలెక్టరేట్‌, జనవరి 21: పేదల ఇంటి వద్దకే రేషన్‌ సరుకులు తీసుకువెళ్లి అందజేసే ఉద్దేశంతో ప్రభుత్వం రేషన్‌ మొబైల్‌ వాహనాలను ప్రవేశపెట్టిందని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన వీటిని గురువారం లబ్ధిదారులకు అందజేశారు. పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో విజయనగరం పార్లమెంట్‌ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్‌, ఎమ్మెల్యేలు బొత్స అప్పలనర్సయ్య, శంబంగి చిన వెంకట అప్పలనాయుడు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. జెండా ఊపి వాహనాలు ప్రారంభించిన అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ ఇంటి వద్దకే రేషన్‌ సరుకులు ఇవ్వడం దేశ చరిత్రలో ఒక అద్భుత ఘట్టమని చెప్పారు. ఈ వాహనం 18 రోజుల పాటు గ్రామంలో తిరుగుతుందని, రోజుకు 90 మంది కార్డుదారులకు సరుకులు అందజేస్తారని చెప్పారు. వాహనానికి జీపీఎస్‌తో అనుసంధానం చేస్తూ ఒక యూనిక్‌ కోడ్‌ కేటాయిస్తామని తెలిపారు. వాహనం నిర్వహణకు, చోదకుడు, సహాయకుడికి కలిసి నెలకు రూ.16000 ప్రభుత్వం అందిస్తుందని వివరించారు. లబ్ధిదారులకు సరుకులు అందజేసేందుకు మొదటిసారి ఉచితంగా సంచులు అందజేస్తున్నట్లు చెప్పారు. అనంతరం వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేసీలు కిషోర్‌కుమార్‌, మహేష్‌కుమార్‌, జె.వెంకటరావు, డీఆర్‌వో గణపతిరావు, ఆర్‌డీవో భవానీ శంకర్‌, డీఎస్‌వో పాపారావు, సివిల్‌ సప్లయ్స్‌ డీఎం వరకుమార్‌, వైసీపీ జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

వాహనాల ప్రదర్శనతో అవస్థలు

లబ్ధిదారులకు అందజేసిన వాహనాలు విజయనగరం పట్టణంలో ప్రదర్శనగా బయలుదేరడంతో ప్రజలకు అవస్థలు పడాల్సి వచ్చింది. ఎక్కడికక్కడ మిగిలిన వాహనాలను నిలిపివేయడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇబ్బంది పడ్డారు. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. అత్యసర పనులపై వెళ్లే వారు కూడా గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. 


Updated Date - 2021-01-22T05:24:05+05:30 IST