రేషన్‌ వాహనాలు వచ్చేశాయి

ABN , First Publish Date - 2021-01-22T07:55:30+05:30 IST

ఇంటింటికీ నిత్యావసరాలను పంపిణీ చేసే రేషన్‌ డెలివరీ వాహనాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు.

రేషన్‌ వాహనాలు వచ్చేశాయి

1 నుంచి ఇంటింటికీ వచ్చి నిత్యావసరాలు పంపిణీ

రేషన్‌ పంపిణీ వాహనం తాళం చెవిని డ్రైవర్‌కు అందజేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌

స్వర్ణరకం మధ్యస్త సన్నబియ్యం సరఫరా

నెలలో 18రోజులపాటు డోర్‌ డెలివరీ

రూ.539 కోట్లతో 9,260 రేషన్‌వాహనాలు

కార్పొరేషన్ల ద్వారా సమకూర్చిన సర్కారు

డ్రైవర్‌ కాకుండా ముగ్గురు కూర్చునే వీలు

బెజవాడలో ప్రారంభించిన సీఎం జగన్‌


విజయవాడ, జనవరి 21 (ఆంధ్ర‌జ్యోతి): ఇంటింటికీ నిత్యావసరాలను పంపిణీ చేసే రేషన్‌ డెలివరీ వాహనాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. వచ్చే నెల ఒకటోతేదీ నుంచి ప్రారంభించనున్న ‘ఇంటి వద్దకే నిత్యావసర సరుకుల పంపిణీ’ కార్యక్రమంలో భాగంగా గురువారం విజయవాడ బెంజిసర్కిల్‌ వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో  రాష్ట్రవ్యాప్తంగా 9260 రేషన్‌ డెలివరీ వాహనాలకు పచ్చజెండా ఊపారు.  పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, ఆ శాఖ కమిషనర్‌ కోన శశిధర్‌లతో కలిసి ముందుగా జ్యూట్‌ బ్యాగులను ప్రారంభించారు. అనంతరం వాహనాలకు పచ్చజెండా ఊపారు. ఈ వాహనాలను అందచేసిన టాటా తదితర సంస్థల అధికారులతో జగన్‌ మాట్లాడారు. వాహనాల ప్రారంభోత్సవానికి ముందు వేదిక దిగువన టాటా కు చెందిన డోర్‌ డెలివరీ వాహనాన్ని సీఎం జగన్‌ పరిశీలించారు.


అనంతరం కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన లబ్ధిదారులకు వాహనాల తాళాలను జగన్‌ అందించారు. ఈ వాహనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం 539 కోట్ల ను వ్యయం చేసింది. ప్రధానంగా టాటా ఏస్‌ గోల్డ్‌ వాహనాలతో పాటు మరికొన్ని కంపెనీల వాహనాలను కొనుగోలు చేసింది. నిరుద్యోగులైన వారికి ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా 9260 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. వివిధ కార్పొరేషన్ల కింద ఈ వాహనాలను ప్రభుత్వం అందించింది. ఈ మొత్తం వాహనాలలో ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా 2300, ఎస్టీ కార్పొరేషన్‌ ద్వారా 700, బీసీ కార్పొరేషన్‌ ద్వారా 3800, మైనారిటీ కార్పొరేషన్‌ ద్వారా 660, ఈబీసీ కార్పొరేషన్‌ ద్వారా 1800 వాహనాలను అందచేశారు. ఒక్కో వాహనం యూనిట్‌ కాస్ట్‌ రూ. 5,81,000. ప్రభుత్వం రూ. 3,48,600  అందిస్తే, బ్యాంక్‌ లింకేజీ ద్వారా రూ. 1,74,357 లను సమకూర్చింది. లబ్ధిదారుని వాటాగా రూ. 58,000 చెల్లించాల్సి ఉంది. బ్యాంకు లింకేజీ రుణం చెల్లించేలా ప్రతి నెలా వాహనానికి పౌరసరఫరాల శాఖ అద్దె చెల్లిస్తుంది. నెలలో 18 రోజులను పనిదినాలుగా ఖరారుచేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాసరావు, చెరుకూరి రంగనాధరాజు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.




రేషన్‌ బండిలో.. 

డోర్‌ డెలివరీకి తగినట్టుగా వాహనం బాడీ బిల్డింగ్‌ చేయించారు. మినీ వ్యాన్లు మాదిరిగా బయటకు కనిపిస్తాయి. ఈ వాహనంలో నిత్యావసరాలతో పాటు నలుగురు ప్రయాణం చేయవచ్చు. వాహన యజమాని / డ్రైవర్‌తో పాటు వలంటీర్‌, హమాలీ, డీలర్‌ కూడా కూర్చోవచ్చు. వాహనంలోనే కాటా ఏర్పాటు చేశారు. కూర్చునే సరుకులు పంపిణీ చేసేందుకు వీలుగా సీటింగ్‌ అమర్చారు. ఇంటి ముందుకు వాహనం వస్తుందనే సమాచారం ముందే తెలిపే మైక్‌ ఉంది. వాహనంలోనే ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌, ఈ పోస్‌ మిషన్‌, క్యాష్‌ బాక్స్‌ ఉంటాయి.

Updated Date - 2021-01-22T07:55:30+05:30 IST