ఓటీపీతో రేషన్‌!

ABN , First Publish Date - 2020-11-19T04:54:53+05:30 IST

ఓటీపీ చెబితేనే ఇక రేషన్‌. నిత్యావసరాల పంపిణీలో పారదర్శకత పేరిట ప్రభుత్వం కొత్త విధానాన్ని తెరపైకి తెస్తోంది. జనవరి నుంచి అమలుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే వలంటీర్ల ద్వారా ఇంటింటికీ రేషన్‌ పంపిణీ చేస్తున్న ప్రభుత్వం... అక్రమాలు నియంత్రించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ప్రతి నెల కార్డుదారుడి ఫోన్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ నంబరు చెబితేనే వలంటీరు రేషన్‌ అందిస్తారు.

ఓటీపీతో రేషన్‌!
ఈదుపురంలో ఫోన్‌ నెంబర్లు సేకరిస్తున్న రెవెన్యూ అధికారులు

 ఫోన్‌కు వచ్చే నంబరు చెబితే సరుకులు

జనవరి నుంచి అమలుకు సన్నాహాలు

నంబర్లు సేకరించే పనిలో వలంటీర్లు

(ఇచ్ఛాపురం రూరల్‌)

ఓటీపీ చెబితేనే ఇక రేషన్‌. నిత్యావసరాల పంపిణీలో పారదర్శకత పేరిట ప్రభుత్వం కొత్త విధానాన్ని తెరపైకి తెస్తోంది. జనవరి నుంచి అమలుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే వలంటీర్ల ద్వారా ఇంటింటికీ రేషన్‌ పంపిణీ చేస్తున్న ప్రభుత్వం... అక్రమాలు నియంత్రించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ప్రతి నెల కార్డుదారుడి ఫోన్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ నంబరు చెబితేనే వలంటీరు రేషన్‌ అందిస్తారు. ఈ లెక్కన లబ్ధిదారుడికి సెల్‌ఫోన్‌ తప్పనిసరి. వలంటీర్ల ద్వారా ఇంటింటా రేషన్‌ పంపిణీకి మన జిల్లాను ప్రయోగాత్మకంగా ఎంపిక చేసి అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. జనవరి నుంచి అన్ని జిల్లాలో అమలు చేయనున్న దృష్ట్యా ఓటీపీ నంబరును తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది.  రేషన్‌ పంపిణీలో ఎప్పటికప్పుడు మార్పులు తెస్తున్నా బియ్యం నల్ల బజారుకు తరలిపోవడం ఆగడం లేదు. దీంతో లక్ష్యం నీరుగారిపోతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. సంక్షేమ పథకాలు, ఇతర రాయితీల కోసం రేషన్‌ కార్డులు పొందిన కొందరు చౌక దుకాణాల్లో అందించే బియ్యం వినియోగించడం లేదని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే 12 రకాల నిబంధనలతో అక్రమార్కులను కట్టడి చేయగా...తాజాగా జీపీఎస్‌, ఓటీపీ విధానం అమల్లోకి తీసుకురానుంది.  


524 వాహనాలు అవసరం 

ఇంటింటికీ రేషన్‌ సరఫరాకు  524 వాహనాలు అవసరమని అధికారులు గుర్తించారు. జిల్లాలో 8,41,000 బియ్యం కార్డులు ఉన్నాయి. అందులో తెలుపు కార్డులు 7,84,770, అన్నపూర్ణ 5035, అంత్యోదయ కార్డులు 51,195 ఉన్నాయి. వలంటీర్లు ఇంటి వద్దకే తెచ్చి సరుకులు అందించనున్నారు. 5, 10. 15 కిలోల చొప్పున బియ్యాన్ని పొట్లాలుగా చేసి వాహనాల్లో తీసుకువచ్చి కార్డుదారులకు అందిస్తారు. అందుకు జిల్లా వ్యాప్తంగా 524 వాహనాలను అవసరమని గుర్తించారు. ప్రస్తుతం చౌక దుకాణాల్లో అంత్యోదయ కార్డులకు కిలో చెక్కర, బియ్యం 35 కిలోలు ఇస్తుండగా, అన్నపూర్ణ కార్డులకు 10 కిలోల బియ్యం ఇస్తున్నారు. ఇతర కార్డులకు యూనిట్‌కు 5 కిలోల బియ్యం, అర కిలో పంచదార పంపిణీ చేస్తున్నారు. 


ఫోన్‌ నెంబర్లు సేకరిస్తున్నాం 

 ప్రభుత్వ ఆదేశాలు మేరకు జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లోని రెవెన్యూ అధికారులు, వలంటీర్లు కలసి కార్డుదారుల ఫోన్‌ నెంబర్లు సేకరిస్తున్నాం. వారి ఇంట్లో  మొబైల్‌ లేకపోతే పొరుగింటి వారి నెంబరుకు జీపీఎస్‌ చేస్తున్నాం. ఇంటింటికీ రేషన్‌కు జిల్లాలో 524 వాహనాలు అవసరం. వాటిని సిద్ధం చేస్తున్నాం. జనవరి 1 నుంచి ఓటీపీ విధానం ద్వారా రేషన్‌  అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.

- వెంకటేశ్వరరావు, డీఎస్‌వో, శ్రీకాకుళం. 


Updated Date - 2020-11-19T04:54:53+05:30 IST