బీజేపీకి రావెల రాజీనామా

ABN , First Publish Date - 2022-05-17T09:15:23+05:30 IST

మాజీ మంత్రి రావెల కిశోర్‌ బాబు బీజేపీకి రాజీనామా చేశారు. దళిత సామాజిక వర్గానికి చెందిన ప్రభావశీలక నేత, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటనకు మూడు వారాల ముందు పార్టీని వీడడంతో ఆ పార్టీ రాష్ట్ర నేతలు ఉలికిపాటుకు గురయ్యారు.

బీజేపీకి రావెల రాజీనామా

కుటుంబ, వ్యక్తిగత కారణాలంటూ ప్రకటన

అనుమానించి, అవమానించినందుకేనా..!


అమరావతి, మే 16(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి రావెల కిశోర్‌ బాబు బీజేపీకి రాజీనామా చేశారు. దళిత సామాజిక వర్గానికి చెందిన ప్రభావశీలక నేత, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటనకు మూడు వారాల ముందు పార్టీని వీడడంతో ఆ పార్టీ రాష్ట్ర నేతలు ఉలికిపాటుకు గురయ్యారు. రావెల తన రాజీనామా లేఖలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాలనను కీర్తించారు. వ్యక్తిగత, కుటుంబ కారణాలతో పార్టీకి, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన అనుచరులు మాత్రం అందుకు పూర్తి భిన్నమైన వాదనను తెరపైకి తెచ్చారు. కావాలనే తమ నేతకు పార్టీలో ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదని వారు ఆరోపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ అధికారి అయిన రావెల కిశోర్‌ బాబు 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. చంద్రబాబు మంత్రివర్గంలో సాంఘిక సంక్షేమ మంత్రిగా పనిచేశారు. ఏకపక్ష విధానాలతో ముందుకెళుతున్నారని పార్టీ కేడర్‌ ఆయనపై అసంతృప్తి వ్యక్తం చేసింది. పరిస్థితి చేయిదాటి పోతుండటంతో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించిన చంద్రబాబు రావెలను మంత్రివర్గం నుంచి తప్పించారు. ఆయన స్థానంలో నక్కా ఆనంద్‌ బాబుకు చోటు కల్పించారు. దీంతో కొన్నాళ్లు మౌనంగా ఉన్న రావెల ఎన్నికల ముందు జనసేన పార్టీలో చేరారు.


ఎన్నికల తర్వాత అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పిలుపుతో బీజేపీ కండువా కప్పుకున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఆ తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఆశించారు. అయితే ఉపాధ్యక్షుడితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఉత్తరాంధ్రకు చెందిన ప్రధాన కార్యదర్శి (ఎస్టీ) ఆకస్మిక మృతితో తనకు ఆ పదవి వరిస్తుందని మరోసారి రావెల ఆశపడ్డారు. అయితే కోర్‌ కమిటీలో ఎలాంటి చర్చ లేకుండానే గుంటూరు జిల్లాకు చెందిన బిట్ర శివన్నారాయణ (బీసీ)ను రాష్ట్ర నాయకత్వం ఎంపిక చేసింది. దీనికి తోడు రావెలకు ఎటువంటి బాధ్యతలు అప్పగించ లేదు. తనను అనుమానంగా చూడడం అవమానించడమే అని ఆయన భావించారని అనుయాయులు చెపుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీని వీడటమే సముచితంగా ఉంటుందని మాజీ మంత్రి బీజేపీకి గుడ్‌ బై చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. పొరుగు రాష్ట్రం తెలంగాణలో బీజేపీ రోజు రోజుకూ బలపడుతూంటే... ఏపీలో మాత్రం దిగజారి పోతుండటంపై పార్టీ పెద్దల్లో చర్చ మొదలైంది. ఇతర పార్టీల నేతలను చేర్చుకుని దేశంలోని పలు రాష్ట్రాల్లో కమలం వికసిస్తూంటే... ఆంధ్రలో మాత్రం పార్టీలో ఎవ్వరూ చేరకపోగా, ఉన్నవారు సైతం వెళ్లిపోతున్నారనే వ్యాఖ్యలు బలంగా వినిపిస్తున్నాయి. 


తిరిగి సొంత గూటికి..!

తిరిగి సొంతగూటికి చేరాలని రావెల కిశోర్‌ భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే కొద్ది కాలంగా జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్‌ నేతలతో సన్నిహితంగా ఉంటున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుని కలిసి టీడీపీలో చేరేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అంతేకాదు ప్రత్తిపాడు నియోజకవర్గంలోని టీడీపీ కేడర్‌కు తిరిగి దగ్గరయ్యేందుకు అక్కడ ఏ ప్రైవేటు కార్యక్రమం జరిగినా టీడీపీ నేతలతో పాటు కలిసివెళ్లి పాల్గొంటున్నారు. 

Updated Date - 2022-05-17T09:15:23+05:30 IST