ఆర్‌అండ్‌బీ భూమి ఆక్రమణ

ABN , First Publish Date - 2021-10-26T06:55:13+05:30 IST

మండలకేంద్రమైన దొనకొండకు కూతవేటు దూరంలోని నాలుగు రోడ్ల కూడలిలో ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఆర్‌అండ్‌బీ శాఖకు చెందిన విలువైన భూమి ఆక్రమణకు గురైంది.

ఆర్‌అండ్‌బీ భూమి ఆక్రమణ
రాత్రికి రాత్రే చదును చేసిన భూమి

దొనకొండ, అక్టోబరు 25 : మండలకేంద్రమైన దొనకొండకు కూతవేటు దూరంలోని నాలుగు రోడ్ల కూడలిలో ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఆర్‌అండ్‌బీ శాఖకు చెందిన విలువైన భూమి ఆక్రమణకు గురైంది.   అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే ఈ ఆక్రమణ జరగడం గమనార్హం.   దొనకొండకు కొద్దిదూరంలో ఆర్‌అండ్‌బీ రహదారి వెంబడి ఒబ్బాపురం రెవెన్యూ పరిధిలోని సర్వేనంబరు 245లో రోడ్డుకు ఇరువైపు ఆ శాఖ స్థలం 1.40 ఎకరాల భూమి ఉంది. ఒక వైపు 30 సెంట్ల భూమి, మరోవైపు 1.10 ఎకరాల భూమి ఉంది. దీనిలో రెండో వైపు ఉన్న 30 సెంట్ల భూమిలో ఇప్పటి వరకు పశువుల కుంట ఉండేది. ఆర్‌అండ్‌బీ శాఖ పరిధిలోనే ఈ భూమి ఉన్నప్పటికీ, పశువులు ఈ కుంటలోని నీటిలో దాహార్తిని తీర్చుకొనేవి. అయితే ఈ కుంటను రాత్రికి రాత్రే  వందల ట్రిప్పుల మట్టితోలి చదును చేశారు. ఇప్పటి వరకు ఉన్న కుంట ఒక్కసారిగా మాయం కావడంతో ప్రజలు ఆశ్ఛర్యానికి గురయ్యారు.  ప్రధాన రహదారి  పక్కనే ఉన్న విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురికావడం, ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన అధికారులు చూసిచూడనట్లు వ్యహరించడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమణకు గురైన  ఆర్‌అండ్‌బీ పరిధిలోని భూమి పక్కనే ఉన్న పట్టాభూమితో అనుసంధానమైంది. దీంతో ఈ  భూమిని ఇప్పటి వరకు పట్టాభూమికి చెందిన వారిదిగానే స్థానికులు భావించారు. ఇటీవల సర్వే నిర్వహించగా ఆ భూమి ఆర్‌అండ్‌బీ శాఖకు చెందినదిగా రెవెన్యూ రికార్డులో నమోదైంది. దీంతో అధికార పార్టీకి చెందిన నేతలు ఆర్‌అండ్‌బీ శాఖకు చెందిన ఈ భూమిని స్వాహా చేయాలని ప్రణాళిక రచించారు. రాత్రికి రాత్రే భూమిలో మట్టితోలి చదును చేశారు. ఆక్రమణకు గురైన భూమి విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.40 లక్షల ఉంటుందని ప్రజలు చర్చించుకుంటున్నారు. సంబందిత అధికారులు స్పందించి విలువైన ప్రభుత్వభూమి ఆక్రమణకు గురికాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

మా దృష్టికి రాలేదు 

దొనకొండ వద్ద ఆర్‌అండ్‌బీ శాఖకు చెందిన భూమి ఆక్రమణకు గురైన విషయం మా దృష్టికి రాలేదు. వెంటనే తమ సిబ్బంది ద్వారా తహసీల్దార్‌తో చర్చించి వారి సహకారంతో భూమిలో హద్దులు ఏర్పాటు చేయిస్తాం. కృష్ణ, ఆర్‌అండ్‌బీ డీఈ, పొదిలి



Updated Date - 2021-10-26T06:55:13+05:30 IST