ఆర్‌అండ్‌బీ రుణానికి బ్రేక్‌!

ABN , First Publish Date - 2022-01-21T05:30:00+05:30 IST

రహదారుల అభివృద్ధి పనులకు టెండర్లు పిలవడం, అవి ఖరారు చేయడం ఇదంతా ఆర్‌అండ్‌బీ చేపట్టి దాదాపు ఏడాది దాటింది.

ఆర్‌అండ్‌బీ రుణానికి బ్రేక్‌!

ప్రభుత్వ వాటా ఇవ్వాలంటూ న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు మెలిక

కేంద్ర ఆర్థిక శాఖ నుంచి  లభించని అనుమతులు

రూ.187కోట్ల విలువైన పనుల్లో పురోగతి కరువు

ఒంగోలు (జడ్పీ), జనవరి 21 : రహదారుల అభివృద్ధి పనులకు టెండర్లు పిలవడం, అవి ఖరారు చేయడం ఇదంతా ఆర్‌అండ్‌బీ చేపట్టి దాదాపు ఏడాది దాటింది. వీటి అభివృద్ధికి రుణం ఇవ్వడానికి ఎన్‌డీబీ అప్పట్లో ముందుకొచ్చింది. జిల్లావ్యాప్తంగా రూ.187 కోట్ల విలువైన పనులకు బ్యాంకు సహకారం అందించే విధంగా ఏర్పాట్లు జరిగాయి. ఇప్పుడు చూస్తే ఆ రుణం వ్యవహారం మళ్లీ మొదటికొచ్చినట్లు తెలుస్తోంది. ఎన్‌డీబీ వాటాగా కొంత మొత్తం ఇవ్వాలంటే ముందుగా రాష్ట్రప్రభుత్వ వాటా జమ చేయాల్సిందేనని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ తేల్చిచెప్పినట్లు సమాచారం. దీంతో ఎన్‌డీబీ రుణానికి బ్రేక్‌ పడటంతో జిల్లాలో చేయదలచిన ఆర్‌అండ్‌బీ రహదారుల అభివృద్ధి పనులలో పురోగతి కరువై ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా పనుల పరిస్థితి తయారైంది.


70 శాతం బ్యాంకు..30 శాతం ప్రభుత్వం

నిబంధనల ప్రకారం  మొత్తం పనుల విలువలో 70శాతం రుణాన్ని ఎన్‌డీబీ అందిస్తే మిగిలిన  30శాతం రాష్ట్రప్రభుత్వం సమకూర్చాల్సి ఉంటుంది. కానీ తొలుత ఎన్‌డీబీ అందించిన రుణాన్ని ఖర్చుచేశాకే తమ వంతు వాటాను జమచేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇందుకు కేంద్ర ఆర్థిక శాఖ సమ్మతించకపోవడంతో రుణం విషయంలో గందరగోళం నెలకొంది.


పనుల్లో పురోగతి కరువు

గతంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరితో పలు టెండర్లకు ఇప్పటికే స్పందన కొరవడింది. ఆర్‌అండ్‌బీ రహదారుల అభివృద్ధి పనులు దక్కించుకున్న చిత్తూరు జిల్లాకు చెందిన సంస్థ సైతం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. రుణం విషయంలో కూడా స్పష్టత లేకపోవడంతో పనుల విషయంలో సదరు సంస్థ క్రియాశీలకంగా ఉండటం లేదు. ముందుగా పనులు చేసి బిల్లులు అప్‌లోడ్‌ చేస్తేనే కాంట్రాక్టర్లకు డబ్బులు అందుతాయి. రుణం విషయంలో పూర్తి స్పష్టత రాకపోవడంతో పనులు చేస్తే తమ బిల్లులు ఎక్కడ పెండింగ్‌లో ఉంటామోననే సందేహంతో టెండరు దక్కించుకున్న సంస్థ ముందడుగు వేయడం లేదు. జిల్లావాసులు మాత్రం రహదారుల అభివృద్ధి పనులు ఎప్పుడు పూర్తవుతాయో...తమ దారి కష్టాలు ఎప్పుడు తీరతాయా అని ఆశగా ఎదురు చూస్తున్నారు.


Updated Date - 2022-01-21T05:30:00+05:30 IST