కీలక రేట్లపై ఆర్బీఐ ప్రకటన

ABN , First Publish Date - 2021-08-06T17:32:50+05:30 IST

భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) రెపో రేటును యథాతథంగా

కీలక రేట్లపై ఆర్బీఐ ప్రకటన

ముంబై : భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) రెపో రేటును యథాతథంగా ఉంచింది. నాలుగు శాతం రెపో రేటును వరుసగా ఏడోసారి కొనసాగించింది. ప్రస్తుతం కొనసాగుతున్న అనిశ్చితి, అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లలో అస్థిరత నడుమ కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వవలసిన అవసరం ఉందని తెలిపింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 9.5 శాతం ఉంటుందని అంచనా వేసింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం  వర్చువల్ సమావేశంలో బై మంత్లీ పాలసీ రేట్లను ప్రకటించారు.


రెపో రేటును 4 శాతంగా, రివర్స్ రెపో రేటును 3.35 శాతంగా కొనసాగించాలని ఆర్బీఐ మానెటరీ పాలసీ కమిటీ నిర్ణయించింది. ఈ కమిటీ మూడు రోజుల సమావేశాల అనంతరం ఈ నిర్ణయాలను ఆర్బీఐ ప్రకటించింది. 


2020 మార్చి  నుంచి రెపో రేటులో 115 బేసిస్ పాయింట్లను ఆర్బీఐ తగ్గించింది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా విధించిన కఠినమైన ఆంక్షలు, ఆరోగ్య సంక్షోభం నుంచి గట్టెక్కడానికి ఈ నిర్ణయం తీసుకుంది. కోవిడ్ రెండో ప్రభంజనం తగ్గుతుండటంతో ఆర్థిక కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని శక్తికాంత దాస్ చెప్పారు. ఆర్థిక వ్యవస్థలో ఒడుదొడుకులను పరిష్కరించడం, వృద్ధికి ప్రాధాన్యమివ్వడం లక్ష్యంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. వినియోగం, పెట్టుబడులు, బాహ్య డిమాండ్ గాడిలో పడుతున్నట్లు తెలిపారు. ఆర్థిక వ్యవస్థలో సరఫరా-గిరాకీ (డిమాండ్) మధ్య సమతుల్యతను పునరుద్ధరించడానికి, ద్రవ్యోల్బణం ఒత్తిడిని తగ్గించడానికి మరిన్ని చర్యలు తీసుకోవలసి ఉందన్నారు. 


వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ద్రవ్యోల్బణం 2020-21లో 5.7 శాతం ఉందని, ఇది 2022 ఏప్రిల్-జూన్‌లో 5.1 శాతానికి తగ్గుతుందని చెప్పారు. 


రెపో రేటు : వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ.


రివర్స్ రెపో రేటు : బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలపై ఆర్బీఐ చెల్లించే వడ్డీ.


Updated Date - 2021-08-06T17:32:50+05:30 IST