ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోంది : ఆర్బీఐ చీఫ్

ABN , First Publish Date - 2021-11-16T23:48:15+05:30 IST

దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం ఇప్పుడు గాడిలో

ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోంది : ఆర్బీఐ చీఫ్

న్యూఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం ఇప్పుడు గాడిలో పడినట్లు అనేక సూచికలు తెలియజేస్తున్నాయని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ మంగళవారం చెప్పారు. అయితే వృద్ధి నిలదొక్కుకుని, తన సామర్థ్యానికి తగిన స్థాయికి చేరుకోవాలంటే ప్రైవేటు పెట్టుబడులు తిరిగి పుంజుకోవాలని చెప్పారు. ప్రైవేటు పెట్టుబడులు పుంజుకుంటే కోవిడ్ మహమ్మారి తర్వాత సమంజసమైన అధిక వేగంతో వృద్ధి చెందే సామర్థ్యం భారత దేశానికి ఉందని తెలిపారు. ఎస్‌బీఐ బ్యాంకింగ్ అండ్ ఎకనమిక్స్ కాంక్లేవ్, 2021లో ఆయన మాట్లాడారు. 


వ్యాక్సిన్ల విషయంలో సాధించిన ప్రగతి మన దేశ శాస్త్రీయ సామర్థ్యాలకు అద్భుతమైన ఉదాహరణ అని తెలిపారు. కాంటాక్ట్-ఇంటెన్సివ్ సర్వీసెస్ కోల్పోయిన వేగాన్ని తిరిగి పొందవలసి ఉందన్నారు. ప్రైవేటు వినియోగం, పెట్టుబడుల మధ్య చెప్పుకోదగ్గ అంతరం ఉన్నట్లు తొలి త్రైమాసికంలోని జీడీపీ డేటా వెల్లడించిందన్నారు. కోవిడ్-19 మహమ్మారికి ముందునాటి పరిస్థితికి చేరుకునేలా వృద్ధి చెందాలంటే నిలకడగా ప్రేరణ ఉండాలని తెలిపారు. స్టార్టప్ వ్యాపార రంగంలో మన దేశం టాప్ పెర్ఫార్మర్‌గా ఉందన్నారు. 


పెట్టుబడులకు అనువైన సమయం వచ్చినపుడు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉండాలని బ్యాంకులను కోరారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పెట్టుబడులకు అనువైన సమయం వస్తుందని ఆర్బీఐ అంచనా వేస్తోంది. 


Updated Date - 2021-11-16T23:48:15+05:30 IST