ltrScrptTheme3

ఆడిటింగ్‌ వ్యవస్థ పటిష్ఠంగా ఉండాలి

Oct 26 2021 @ 03:00AM

ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ 

న్యూఢిల్లీ: దేశంలో ఆర్థిక స్థిరత్వం, వృద్ధి సాధనకు ఖచ్చితమైన, విశ్లేషణాత్మక ఆడిట్‌ నివేదికలెంతో అవసరమని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అన్నారు. అవి ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందిస్తాయన్నారు. ప్రభుత్వ రంగంలో ఆడిటింగ్‌ మెరుగైన పాలనకు మూలస్తంభం లాంటిదన్నారు. నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ ఆడిట్‌ అండ్‌ అకౌంట్స్‌ (ఎన్‌ఏఏఏ) అధికారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ ప్రపంచీకరణ యుగంలో న్యాయమైన, నిష్పక్షపాతమైన ఆడిటింగ్‌ దేశీయ అవసరం మాత్రమే కాదని, ప్రపంచ వేదికపై భారత ప్రతిష్ఠ, విశ్వసనీయతను పెంచే సాధనమని చెప్పారు. ఇంకా ఏమన్నారంటే.. 


ఆర్థిక సేవల మార్కెట్లో సంక్లిష్టత పెరుగుతోంది. ప్రభుత్వ నిధుల కేటాయింపుల దక్షతపైనా ప్రజల అంచనాలు పెరిగాయి. 

భారత్‌ వేగంగా వృద్ధి చెందాలనుకుంటున్న తరుణంలో సంబంధిత వర్గాల ఆర్థిక పనితీరుపై నిపుణులు, స్వతంత్ర ఆడిటర్లు మరింత నమ్మకం కలిగించాల్సిన ఆవశ్యకత ఉంది.  

చురుకైన ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే పటిష్ఠమైన ఆడిటింగ్‌ వ్యవస్థ అవసరం. 

ఆర్థిక నిర్ణయాల్లో అప్పటివరకు అందుబాటులో ఉన్న సమాచార ప్రాధాన్యం పెరిగింది. ఖచ్చితత్వం లోపించిన సమాచారంతో నిర్ణయాల్లో నాణ్యత లోపించవచ్చు. ఉదాహరణకు బ్యాంకింగ్‌ రంగంలో తప్పుడు సమాచారం ఆధారంగా రుణాలిస్తే, అప్పు తీసుకున్నవారు తిరిగి చెల్లించలేకపోవచ్చు. ఇది బ్యాంక్‌కు నష్టం కలిగించడమే కాకుండా, భవిష్యత్‌లో ఆ బ్యాంక్‌ అర్హులైన వారికీ రుణాలిచ్చేందుకు వెనుకాడవచ్చు. అంతేకాదు, ఈ నష్టాన్ని పూడ్చుకునేందుకు బ్యాంక్‌ వడ్డీ రేట్లు పెంచే అవకాశాలుంటాయి. అంటే, ఒక తప్పుడు నిర్ణయం మొత్తం వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంది. 

సరైన, విశ్వసనీయ, విశ్లేషణాత్మక సమాచార నివేదికలు ఆర్థిక స్థిరత్వం, వృద్ధికి ఎంతో అవసరం. కాబట్టి, ఆడిటర్లు స్వేచ్ఛ, వృత్తి నైతికతపై ప్రధానంగా దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. 

ఆడిటర్లు తమ నైపుణ్యాన్ని నిరంతరం మెరుగుపర్చుకోవాలి. అలాగే, వారి పనిని మరింత సమర్థవంతంగా పూర్తి చేయాలి. 

ఆడిటింగ్‌ నాణ్యత, సూక్ష్మసంగ్రాహ్యత మరింత పెరగాల్సిన అవసరం ఉంది. బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థల్లో ఆడిటింగ్‌ విధానాన్ని మెరుగుపర్చేందుకు ఐసీఏఐ (ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌)తో కలిసి ఆర్‌బీఐ ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.