
'ఆర్సీ 15'లో కొత్త శ్రీకాంత్‌ను చూస్తారని ఆయన అన్నారు. హీరోగా 100 సినిమాలను పూర్తి చేసిన శ్రీకాంత్.. మధ్యలో చిరంజీవి, నాగార్జున, మోహన్ బాబు లాంటి స్టార్ హీరోలతో కలిసి మల్టీస్టారర్ చిత్రాలను చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. హీరోగా కాస్త జోరు తగ్గాకా 'అఖండ' సినిమాతో విలన్ పాత్రలను చేసేందుకు సిద్దమయ్యారు. ఇటీవల వచ్చిన ఈ సినిమాలో నెగిటివ్ రోల్ పోషించిన శ్రీకాంత్ బాగానే పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు శంకర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో రూపొందుతున్న పాన్ ఇండియన్ సినిమాలోనూ కీలక పాత్ర చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఆర్సీ 15లో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. నా పాత్రను చూసి ప్రతి ఒక్కరు షాకవుతారు. అసలు ఇతను శ్రీకాంతేనా? అని అందరూ ప్రత్యేకంగా నా పాత్ర గురించి మాట్లాడుకుంటారు. ఇందులో కచ్చితంగా కొత్త శ్రీకాంత్‌ని చూస్తారు’ అని అన్నారు. దీనిని బట్టి చరణ్ - శంకర్ సినిమాలో ఆయన చాల పవర్ఫుల్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా కియారా అద్వానీ నటిస్తుండగా, దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. దీనికి థమన్ సంగీత దర్శకుడు.