
కోల్‌కతా : ఉత్కంఠ భరిత పోరులో లక్నో సూపర్ జెయింట్స్‌పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఘనవిజయం సాధించింది. 14 పరుగుల తేడాతో విజయం సాధించి సగర్వంగా క్వాలిఫయర్-2కి అర్హత సాధించింది. ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్టు తలపడినా విజయం ఆర్సీబీనే వరించింది. చివరి రెండు ఓవర్లలో 33 పరుగులు అవసరమయిన సమయంలో బంతి అందుకున్న హేజల్ వుడ్ మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. 19వ ఓవర్ 4వ బంతికి క్రీజులో పాతుకుపోయిన కేఎల్ రాహుల్(79), 5వ బంతికి కృనాల్ పాండ్యా వికెట్లను తీసి బెంగళూరు శిబిరంలో నమ్మకాన్ని పెంచాడు. ఇక చివరి ఓవర్‌లో లక్నో సూపర్ జెయింట్స్ గెలుపునకు 24 పరుగులు అవసరమైన సమయంలో బంతి అందుకున్న హర్షల్ పటేల్ చక్కటి బంతులు వేశారు. కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో బెంగళూరు 14 పరుగుల తేడాతో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.