రెండు నెలలు ఓపికపట్టండి.. బిల్లులు చెల్లిస్తాం

ABN , First Publish Date - 2022-05-18T03:57:46+05:30 IST

రెండు నెలల్లో బిల్లులు చెల్లిస్తామని, అప్పటి వరకు ఓపికపట్టాలని ట్రాక్టర్‌ యజమానులకు ఆర్డీవో శీనానాయక్‌ హామీ ఇచ్చారు.

రెండు నెలలు ఓపికపట్టండి..  బిల్లులు చెల్లిస్తాం
దామవరంలో ట్రాక్టర్‌ యజమానులు, ప్రజలతో మాట్లాడుతున్న ఆర్డీవో శీనానాయక్‌

ట్రాక్టర్‌ యజమానులకు ఆర్డీవో శీనానాయక్‌ హామీ

దగదర్తి, మే 17: రెండు నెలల్లో బిల్లులు చెల్లిస్తామని, అప్పటి వరకు ఓపికపట్టాలని ట్రాక్టర్‌ యజమానులకు ఆర్డీవో శీనానాయక్‌ హామీ ఇచ్చారు. మంగళవారం ఆయన  దామవరం గ్రామంలోని దళితవాడ, బీసీ కాలనీల్లో జగనన్న లేఅవుట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా బిల్లులు అందక ఇళ్ల నిర్మాణాలను అడ్డుకున్న ట్రాక్టర్‌ యజమానులతో చిర్చించారు. ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకుకాలనీల్లో లెవలింగ్‌కు ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద బిల్లులు చెల్లిస్తున్నారని, ఇప్పుడు గృహ నిర్మాణశాఖ ద్వారా చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. రెండు నెలల్లో బిల్లులు వచ్చేలా చూస్తామని చెప్పారు. అయినప్పటికీ ట్రాక్టర్‌ యజమానులు వినిపించుకోలేదు. ఏడాదిన్నర నుంచి బిల్లుల కోసం ఎదరు చూస్తున్నామని, ఇక తమకు నమ్మకం లేదని తెగేసి చెప్పారు. మాకు బిల్లులు ప్పుడు చెల్లిస్తారో ఆర్డీవో, లేదా సంబంధిత అధికారులు ఖచ్చితమై హామీ ఇస్తారా? అని కోరడంతో.. ఏం సమాధానం చెప్పాలో తెలియక అధికారులు అక్కడి నుంచి జారుకున్నారు. అనంతరం ఆర్డీవో శీనానాయక్‌ మండలంలోని కోర్టు కేసుల్లో ఉన్న జగనన్న ఇళ్ల నిర్మాణాల లేవుట్లను సందర్శించారు. సున్నపుబట్టి, దగదర్తి, తురిమెర్ల దక్షిణమిట్ట, శ్రీరామపురం (పెద్దపుత్తేడు), ప్యాడిసన్‌పేట, దుండిగం, కాట్రాయపాడులోని లేవుట్ల ప్రస్తుత పరిస్థితిని పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. అనంతరం కేకేగుంట, చెన్నూరు సచివాలయాలను తనిఖీ చేసి, సిబ్బందితో మాట్లాడారు. ఆయన వెంట హౌసింగ్‌ డీఈ ప్రసాద్‌, ఎంపీడీవో శ్రీదేవి, తహసీల్దార్‌ ప్రమీల ఉన్నారు. 

Updated Date - 2022-05-18T03:57:46+05:30 IST