బిక్కుబిక్కుమంటూ చదువులు

ABN , First Publish Date - 2022-07-04T07:02:16+05:30 IST

నాడు-నేడు పథకం ద్వారా కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని ప్రభుత్వం ఆర్భాటం గా ప్రకటనలు చేసినా... క్షేత్రస్థాయిలో నేటికీ శిఽథిలాల కిందే చదువులు కొనసాగు తున్నాయి.

బిక్కుబిక్కుమంటూ చదువులు
అనంతపురంనగరంలోని నెం-1 పాఠశాలలో తరగతి గదుల దుస్థితి...


ఆ గదుల్లో...

పెచ్చులూడుతున్న పైకప్పులు

నెమ్మెక్కుతున్న గోడలు

కూలడానికి సిద్ధంగా తరగతి గదులు

రెండో విడత నాడు-నేడు పనుల్లో జాప్యం 

జిల్లాకు చేరిన అరకొర పుస్తకాలు...

జగనన్న కిట్ల ఊసేలేదు...

 రేపటి నుంచి స్కూళ్లు ప్రారంభం


నాడు-నేడు పథకం ద్వారా కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని ప్రభుత్వం ఆర్భాటం గా ప్రకటనలు చేసినా... క్షేత్రస్థాయిలో నేటికీ శిఽథిలాల కిందే చదువులు కొనసాగు తున్నాయి. పాఠశాలల భవనాల శిథిలాలు, పెచ్చులూడిన పైకప్పులు, తలుపులు, కిటికీలు లేని తరగతి గదులు, కూలిన ప్రహరీలు, ముళ్లపొదలతో నిండిన ఆవరణాలు, అరకొర పనులతో దర్శనమిస్తున్న మొండి గోడలు ఇందుకు అద్దం పడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో దాదాపు 4వేల దాకా పాఠశాలలున్నాయి. మొదటి విడతలో 1200 పాఠశాలల్లో అరకొరగా నాడు-నేడు ద్వారా పనులు చేపట్టి మమా అనిపించారు.  రూ. 340.16 కోట్లతో 996 పాఠశాలల్లో రెండో విడతలో భాగంగా... మౌలిక సదుపాయాల కల్పన కోసం నివేదికలు సిద్ధం చేశారు. ఇప్పటివరకూ కేవలం రూ.33 కోట్లు రివాల్వింగ్‌ ఫండ్‌(ఆర్‌ఎఫ్‌) విడుదల చేశారు. దీంతో పనులు ప్రారంభించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. జిల్లాకు మొత్తం మీద సెమి స్టర్‌-1 పుస్తకాలు 25 లక్షలు రావాల్సి ఉండగా... ఇప్పటి వరకూ కేవలం 18 లక్షల పుస్త కాలు మాత్రమే జిల్లాకు చేరాయి. కాగా ఇప్పటి వరకూ జగనన్న కిట్ల ఊసేలేదు .    

అనంతపురం ఆంధ్రజ్యోతి



జిల్లా కేంద్రంలోని అనంతపురం నగరంలో నెం-1 ప్రభు త్వ పాఠశాల భవనం పైకప్పు పెచ్చులూడేందుకు సిద్ధంగా ఉన్నా... ఎవరూ పట్టించుకోవడం లేదు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల దుస్థితే ఇలా ఉందంటే... గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో సౌకర్యాలు ఏ మేరకు ఉంటాయో దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు.  అదే విధంగా నగరంలోని అజయ్‌ఘోష్‌ పాఠశాలలో పైకప్పు పెచ్చులూడి కిందపడ్డాయి. ఆ శిఽథిలాలు తరగతి గదిలో అలాగే దర్శనమిస్తున్నాయి. 



అనంతపురం నగరంలోని నెం-1 పాఠశాల శిథిలావస్థకు చేరుకున్నప్పటికీ... ఆ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో పాలకులు, పాఠశాల ఉపాధ్యా యులు చొరవ చూపడం లేదు. నాడు-నేడు కింద అదనపు గదుల నిర్మాణం చేపట్టి మూడేళ్లు కావస్తున్నా... ఇప్పటి వరకూ పూర్తికాలేదు. ఈ పరిస్థితుల్లో తలుపులు కిటికీ ఊచలు లేని పెచ్చులూడిన పైకప్పు, గోడలకు రంధ్రాలున్నా... అదే శిథిలమైన గదిలో చదువుకోవాల్సిన దుస్థితిని విద్యార్థులు ఎదుర్కొంటున్నారు.


అనంతపురం రూరల్‌ మండలం కృష్ణంరెడ్డిపల్లిలో మండల పరిషత పాఠశాల ప్రహరీ శిఽథిలం కావడంతో పాటు... పాఠశాల ఆవరణలో పిచ్చిమొక్కలు మొలవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే విధంగా పామురాయి గ్రామంలోని మండల పరిషత ప్రాథమిక పాఠశాల పూర్తిస్థాయిలో శిథిలావస్థకు చేరుకున్న క్రమంలో నాడు-నేడు కింద మౌలిక సదుపాయాలు చేపట్టాలని గతేడాది నిర్ణయించి నప్పటికీ... ఇప్పటి వరకూ పనులు ప్రారంభంకాలేదు. దీంతో ఆ పాఠశాలను మూసేసి పక్కనే ఉన్న కమ్యూనిటీ హాల్లో అన్ని తరగతులను నిర్వహిస్తున్నారు. 


కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండలం మేళ్లకుంట గ్రామంలోని ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరుకుంది. ప్రహరీ కూలిపోయింది. ఈ పాఠశాలలో నాడు-నేడు పనులు ఇప్పటి వరకూ  చేపట్టలేదు. ఆ ప్రాథమిక పాఠశాలలో 40 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 


రాయదుర్గం నియోజకవర్గం డీ హీరేహాళ్‌ మండలం కోట ప్రాంతంలోని ప్రాథమిక పాఠశాల పురాతన భవనాన్ని తలపిస్తోంది. ఆ పాఠశాలలో 86 మంది విద్యార్థులు న్నారు. పాఠశాలలు పునఃప్రారంభమవుతున్నా... ఆ పాఠశాల భవనానికి ఎలాంటి మరమ్మతులు చేపట్టలేదు.  


ఉరవకొండ పట్టణం పాత మార్కెట్‌ సమీపంలోనున్న ఉర్దూ అప్పర్‌ ప్రైమరీ పాఠశాల శిథిలావస్థకు చేరుకుంది. ఆ పాఠశాలను పెంకులతో ఏర్పాటు చేయడంతో పెంకులు ఒక్కొక్కటిగా జారిపోతున్నా... పట్టించు కోవడం లేదు. అదనపు గదులను నిర్మించాల్సి ఉండగా నిధుల కొరత కారణంగా పనులు అర్థాంతరంగా నిలిచి పోయాయి.



గుంతకల్లు నియోజకవర్గం గుత్తి పట్టణంలోని కోట వీధిలోనున్న పిళ్లై ప్రాథమిక పాఠశాల లోపల దృశ్యాన్ని చూస్తే.. ఎవరైనా బూతబంగ్లా అనుకోక తప్పదు. తరగతి గదిలో చుట్టూ గోడలు పెచ్చులూడి పోయాయి.



శింగనమల నియోజకవర్గం యల్లనూరు మండల కేంద్రంలోని జిల్లాపరిషత పాఠశాలలో నాడు-నేడు కింద అదనపు గదుల కోసం రూ.24 లక్షలు మంజూరయ్యాయి. కాని నేటివరకు పనులు ప్రారంభం కాలేదు. నాబార్డు కింద నిధులు మంజూరై రెండు సంవత్సరాలైనా పనులు పూర్తికాలేదు. పాఠశాలలో ఏర్పాటుచేసిన లక్షలు విలువైన ఆర్వోప్లాంట్‌ నిరుపయోగంగా ఉంది. 


తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి మండలం రాయలచెరువు హైస్కూల్‌లో నాడు-నేడు కింద రూ.48 లక్షలతో అదనపు గదుల నిర్మాణానికి 20రోజులక్రితం ఎమ్మెల్యే పెద్దారెడ్డి శంకుస్థాపన చేశారు. పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇసుక, కంకర పాఠశాల ఆవరణలో వదిలారు. 

Updated Date - 2022-07-04T07:02:16+05:30 IST