సాగుకు సై

ABN , First Publish Date - 2022-05-16T05:33:24+05:30 IST

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వానాకాలం సాగుకు రైతులు సమాయత్తం అవుతున్నారు. వారికి అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉంచడంలో వ్యవసాయ శాఖ అధికారులు అప్పుడే కసరత్తు మొదలు పెట్టారు. బ్యాంకులు సైతం సకాలంలో పంట రుణాలు ఇచ్చేలా ఆయా జిల్లాల యంత్రాంగాలు తగిన ఏర్పాట్లు చేస్తున్నాయి. మరో పక్క ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమయ్యేలోగానే కిసాన్‌ సమ్మాన్‌ డబ్బులు రైతు ఖాతాలో పడేలా ఈ-కేవైసీ నమోదుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇంకో పక్క నకిలీ విత్తనాలు మార్కెట్‌లోకి ప్రవేశించకుండా కొత్తవిధానం అమలుకు సన్నాహాలు చేస్తున్నారు. రైతుకు పెరిగిన పెట్టుబడి వ్యయాన్ని దృష్టిలో పెట్టుకొని బ్యాంకులు పంట రుణాలు ఇచ్చేలా పంట పరిమితులను (స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌) టెస్కాబ్‌ అప్పుడే నిర్ణయించింది.

సాగుకు సై

కసరత్తు ప్రారంభించిన వ్యవసాయశాఖ
విత్తనాలు అందుబాటుకు ఏర్పాట్లు
నకిలీ విత్తనాలను అరికట్టేందుకు కొత్త విధానం
పంట రుణాల మంజూరుకు బ్యాంకర్లతో భేటి
రుణ పరిమితులను ఖరారు చేసిన టెస్కాబ్‌
కిసాన్‌ సమ్మాన్‌ డబ్బు జమకు చర్యలు
వానాకాలంలో సాగుకు పకడ్బందీ చర్యలు


ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వానాకాలం సాగుకు రైతులు సమాయత్తం అవుతున్నారు. వారికి అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉంచడంలో వ్యవసాయ శాఖ అధికారులు అప్పుడే కసరత్తు మొదలు పెట్టారు. బ్యాంకులు సైతం సకాలంలో పంట రుణాలు ఇచ్చేలా ఆయా జిల్లాల యంత్రాంగాలు తగిన ఏర్పాట్లు చేస్తున్నాయి. మరో పక్క ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమయ్యేలోగానే కిసాన్‌ సమ్మాన్‌ డబ్బులు రైతు ఖాతాలో పడేలా ఈ-కేవైసీ నమోదుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇంకో పక్క నకిలీ విత్తనాలు మార్కెట్‌లోకి ప్రవేశించకుండా కొత్తవిధానం అమలుకు సన్నాహాలు చేస్తున్నారు. రైతుకు పెరిగిన పెట్టుబడి వ్యయాన్ని దృష్టిలో పెట్టుకొని బ్యాంకులు పంట రుణాలు ఇచ్చేలా పంట పరిమితులను (స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌) టెస్కాబ్‌ అప్పుడే నిర్ణయించింది.

హనుమకొండ, మే 15 (ఆంధ్రజ్యోతి):
వానాకాలం సాగుకు సంబంధించి హనుమకొండ, వరంగల్‌, జనగామ, మహబూబాబాద్‌, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల కలెక్టర్లు వ్యవసాయశాఖ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. అర్హులైన రైతులందరికీ పంట రుణాలు ఇప్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఇందుకోసం కిసాన్‌ సమ్మాన్‌ నిధి 11వ విడత అమలుతో పాటు ఆ పథకం అబ్ధిదారులందరికీ పంట రుణాలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు పంచాయతీ అధికారులు, బ్యాంకర్లతో కలిసి పల్లెల్లో గ్రామసభలు నిర్వహిస్తూ పంట రుణాలు పొందని రైతులను గుర్తిస్తున్నారు. బ్యాంకర్ల సహకారంతో రుణాలకు సంబంఽధించిన దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇందులో కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల ప్రాధాన్యాన్ని తెలియచేస్తున్నారు.

కిసాన్‌ సమ్మాన్‌ నిధి

భూప్రక్షాళన ప్రకారం ఉమ్మడి జిల్లాలో కిసాన్‌ సమ్మాన్‌ నిధికి అర్హులైన వారు 5 లక్షల మంది వరకు రైతులు ఉంటారు. మహబూబాబాద్‌, వరంగల్‌ జిల్లాలో రైతులు ఎక్కువగా ఉన్నారు. ఏడాదికి మూడు విడతలుగా ఒక్కో విడతలో రూ.2వేల చొప్పున ఏడాదికి రూ.6వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. 11వ విడత కిసాన్‌ సమ్మాన్‌ నిధి డబ్బులు వానాకాలం ప్రారంభంలో రానున్నాయి. గ్రామాల్లో చేపట్టే సభల్లో అన్ని అర్హతలున్నా ఈ పథకం డబ్బులు రాని రైతులు ఎవరైనా ఉంటే గుర్తిస్తున్నారు. సాంకేతిక సమస్యలుంటే సరి చేసి డబ్బులు వచ్చేలా చూస్తున్నారు. రైతు బ్యాంకు ఖాతాలకు ఆధార్‌కార్డు అనుసంధానమై ఉండాలి. చాలామంది రైతుల ఖాతాలకు ఆధార్‌ లింక్‌ అయి ఉండకపోడంతోనే సమస్యలు వస్తున్నాయి.

బ్యాంకు రుణాలు
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 10,49,942 మంది రైతులు ఉన్నారు. ఏటా అర్హత గల రైతులందరికీ రుణాలు ఇప్పించాలని ప్రభుత్వ బ్యాంకులకు లక్ష్యాలను నిర్దేశిస్తున్నారు. అయితే బ్యాంకర్లు  లక్ష్యాలను చేరుకోవడం లేదు. ఏటా 60 నుంచి 70 శాతం లక్ష్యం మాత్రమే సాధిస్తున్నారు. వీరిలో చాలావరకు రైతులు పంట రు ణాలను రెన్యూవల్‌ చే సుకున్నవారే. కొత్త రుణాలు ఇవ్వటంలో ఉమ్మడి జిల్లాలోని అన్ని మండలాల బ్యాంకర్లు తీరు ఆశించినంత మె రుగ్గా లేదు. బ్యాంకర్లు రు ణాలు ఇచ్చేందుకు విముఖత చూపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పటికీ చాలామందికి కిసాన్‌ క్రెడిట్‌ కార్డులను ఇవ్వ టం లేదు. వాటి ప్రయోజనాలు తెలపటం లేదు. అలాకాకుండా ఈసారి పీఎం కిసాన్‌ పథకానికి అర్హులుగా ఉన్న రైతులందరికీ పంట రుణాలను ఇప్పించాలనే లక్ష్యంతో వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటి నుంచే  చర్యలు  తీసుకుంటున్నారు.

పంట రుణ పరిమితి ఖరారు

ఏప్రిల్‌ 1నుంచి వానాకాలం పంట రుణాలను అందించే ప్రక్రియ మొదలుకాగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో రైతులకు అందించే స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ (రుణపరిమితి) పెంపును రాష్ట్ర సహకార అపెక్సు బ్యాంకు (టెస్కాబ్‌) ఖరారు చేసింది. జూలై వరకు రైతులు పంట రుణాలు రెన్యూవల్‌ చేసేప్పుడు లేదా నూతనంగా రుణాలిచ్చేప్పుడు స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ను అమలు చేయడం ద్వారా రైతులకు అదనపు పెట్టుబడి చేతికందుతుంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 2021-2022లో  రెండు సీజన్లలో 7.28  లక్షల మంది రైతులకు రూ. 12,096 కోట్ల పంట రుణాలు పంపిణీ లక్ష్యం కాగా, 80శాతం వరకే లక్ష్యాన్ని చేరగలిగారు. రూ.2,556కోట్ల వ్యవసాయ అనుబంధకాలిక రుణాలను  అందించటం లక్ష్యంగా ఉండగా 20శాతంలోపే పంపిణీ చేశారు. రూ.2022-23లో దాదాపుగా రూ.13,100కోట్ల వరకు పంటరుణాలు వ్యవసాయ అనుబంధ రుణాల పంపిణీ లక్ష్యంగా ఉండగా నెరవేర్చితేనే రైతులకు ఆర్థికంగా చేదోడుగా ఉంటుంది.  సాగు నీటి కల్పన, పాడి పరిశ్రమ, ఎద్దులు, ఎడ్లబం డ్లు, భూముల అభివృద్ధి, విత్తనోత్పత్తి, సేంద్రియ రుణాలు చాలా వరకు ఇవ్వటం లేదు. ప్రభుత్వ అనుమతి మేరకు బ్యాంకులు పంటరుణ మొత్తాన్ని పెంచి ఇవ్వటంలో పాటు సక్రమంగా రుణాలు చెల్లించిన రైతులకు నిర్దేశిత మొత్తంకన్నా 30 శాతం వరకు కూడా రుణాన్ని పెంచి ఇచ్చే వీలుంది. నూతనంగా పట్టాదారు పాస్‌ పుస్తకాలు పొందిన వారు.. ఇది వర కు రుణం పొందనివారు ఉమ్మడి జిల్లాలో దాదాపుగా లక్షమంది వరకు ఉండగా వీరికి రుణం అందించేందుకు ఇటీవల ప్రత్యేక డ్రైవ్‌ను కూడా నిర్వహించారు.

నకిలీ విత్తనాలకు చెక్‌

సాగులో నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వ వానాకాలం సీజన్‌ నుంచి కొత్త విధానాన్ని అమలులోకి తేనున్నది. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలోని విత్తన డీలర్లకు ఐడీలు జారీచేయడంతో పాటు ఎప్పటికప్పుడు సమాచారం ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగా వ్యవసాయదారులు మండలపరిధిలో ఉన్న విత్తన డీలర్లకు వ్యవసాయశాఖ రూపొందించిన ప్రత్యేక యాప్‌పై అవగాహన కల్పించారు. ఇక నుంచి డీలర్లు విక్రయించే విత్తనాలు, రకాలు, నిల్వలు తదితర వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇందువల్ల నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట పడుతుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. గతంలో విత్తనాలు, ఏ కంపెనీవి, వాటి రకాలు తదితర వివరాలు తెలిసేంది కాదు.

Updated Date - 2022-05-16T05:33:24+05:30 IST