ఇక..సమరమే!

Jul 27 2021 @ 01:47AM

ప్రభుత్వంపై సంఘటిత పోరాటానికి రెడీ

ఆర్టీసీ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ

ఏకమవుతున్న ఈయూ, ఎన్‌ఎంయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్‌

నేడు బెజవాడలో కీలక సమావేశం 

మిగిలిన కార్మిక సంఘాలకూ ఆహ్వానం 


విజయవాడ, జూలై 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను విలీనమైతే చేసింది కానీ.. విలీనాంతర సమస్యలు మాత్రం పరిష్కరించడం లేదు. దీంతో సంక్షేమ పథకాల దగ్గరి నుంచి పెన్షన్‌ వరకు.. అనేక సమస్యలు అపరిష్కృతంగానే మిగిలాయి. సర్వీసు సమస్యలూ వేధిస్తున్నాయి. ఉద్యోగులను విలీనం చేసి ప్రభుత్వం తమ గొంతు నొక్కిందని రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) కార్మిక సంఘాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏడాదిగా ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న కార్మిక సంఘాలు సంఘటితమై సర్కారుపై సమరశంఖం పూరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఆర్టీసీలో బలమైన ఎంప్లాయీస్‌ యూనియన్‌ (ఈయూ), నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ (ఎన్‌ఎంయూ), స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌డబ్ల్యూఎఫ్‌) ఐక్య కార్యాచరణ దిశగా అడుగులు వేస్తున్నాయి. మంగళవారం విజయవాడలోని సామ్రాట్‌ హోటల్‌లో ఈ సంఘాల అగ్రనాయకత్వం అత్యవసరంగా సమావేశమవుతున్నాయి. ఆర్టీసీ విలీనానంతర సమస్యలపై చర్చించి సంఘటితశక్తితో ఉద్యమ పథాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. తమతో కలిసి వచ్చే పక్షాలన్నింటినీ కలుపుకుని ముందుకెళ్లాలని భావిస్తున్నాయి. మంగళవారం నాటి సమావేశానికి ఇతర కార్మిక సంఘాల నేతలను కూడా ఆహ్వానించాయి. 


ఎక్కడి సమస్యలు అక్కడే..

రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పింది. తీరా చూస్తే ఉద్యోగులను మాత్రమే ప్రజారవాణా సంస్థలోకి తీసుకుని ఆర్టీసీని ప్రభుత్వ రంగ సంస్థగానే వదిలివేసింది. ఇప్పటికీ ఆర్టీసీ, పీడీడీ రెండు పేర్లతో ఆర్టీసీలో చెలామణి అయ్యే పరిస్థితులున్నాయి. ప్రభుత్వంలో విలీనాన్ని ఆర్టీసీ ఉద్యోగ, కార్మిక సంఘాలు కూడా కాంక్షించాయి. ఉద్యోగ, కార్మిక సంఘాలు అనుకున్న విలీనం వేరు, ప్రభుత్వం చేసిన విలీనం వేరుగా ఉంది. ఆర్టీసీ ఉద్యోగులుగా అనుభవిస్తున్న సదుపాయాలతో పాటు పెన్షన్‌ వంటి అదనపు ప్రయోజనాల కోసం విలీనం కోరుకుంటే దీనికి విరుద్ధంగా సాగుతోంది. ఆర్టీసీలో అమలు చేస్తున్నటువంటి పథకాలన్నీ రద్దు కావడంతో పాటు.. ప్రభుత్వంలో విలీనం జరిగినా ఆ మేరకు సదుపాయాలకు నోచుకోక రెండు వైపులా తీవ్ర నష్టపోయామన్న భావనలో ఆర్టీసీలోని ప్రతీ ఉద్యోగి, కార్మికుడు ఉన్నాడు. ఆర్టీసీ కార్మిక సంఘాల (ప్రస్తుతం ఉద్యోగ సంఘాలు)కు ప్రభుత్వం కనీస ప్రాధాన్యత ఇవ్వకపోవటం ఆయా సంఘాల అగ్ర నాయకత్వాన్ని బాధిస్తోంది. విలీనం నేపథ్యంలో ప్రభుత్వానికి తమ సమస్యల గురించి ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసి వినతిపత్రాలు ఇచ్చినా.. వాటిని పరిశీలించి సరిచేసే వ్యవస్థలు లేవు. ఈ క్రమంలో ప్రభుత్వానికి నిర్భయంగా తమ వాణిని వినిపించాలని, అవసరమైతే ఉద్యమానికి శ్రీకారం చుట్టడం కోసమైనా సంఘటితశక్తి అవసరమని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. ఇన్నాళ్లూ వేర్వేరుగా ప్రభుత్వంతో సంప్రదింపులు చేసిన ప్రధాన కార్మిక సంఘాలన్నీ ఏకం కావాలని భావించాయి. 


ఈ సమావేశంలో ప్రధానంగా విలీనాననంతర సమస్యలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఆర్టీసీలో ఉండగా ఉద్యోగుల సొమ్ముతో కొనసాగించే  సంక్షేమ పథకాలైన ఎస్‌ఆర్‌బీఎస్‌, ఎస్‌బీటీ వంటి పథకాలను విలీనాంతరం రద్దు చేశారు. వీటితో పాటు ఆర్టీసీ ఉద్యోగుల ఆర్థిక భాగస్వామ్యంతో నిర్మించిన ఆర్టీసీ కార్పొరేట్‌ హాస్పిటల్‌లో గతంలో మాదిరిగా అన్‌లిమిటెడ్‌ వైద్య సదుపాయాలకు కోత పడింది. ఆర్టీసీ ఉద్యోగ, కార్మికులు విలీనానికి బలంగా ఆశించిన అంశం పెన్షన్‌ అంశం. ఆర్టీసీ ఉద్యోగులుగా పెన్షన్‌ స్కీమ్‌ లేదు. ప్రభుత్వంలో విలీనమైతే చివరి మజిలీలో ధైర్యంగా ఉండొచ్చని భావించారు. కానీ.. విలీనం జరిగినా పెన్షన్‌పై ప్రభుత్వం మాట్లాడటం లేదు. పదోన్నతుల ప్రక్రియకు కూడా అనేక నిబంధనలు అడ్డు వస్తున్నాయి. వీటిపై ప్రభుత్వంతో ఎన్నిసార్లు చర్చించినా ఉపయోగం ఉండటం లేదు కాబట్టి ఉద్యమస్థాయిలో వెళ్లాలని కార్మిక సంఘాలు భావిస్తున్నాయి. ఇది ప్రభుత్వం మీద ఆందోళన కాదని, తమకు న్యాయం కోసం చేస్తున్న పోరాటం మాత్రమేనని కార్మిక సంఘాల నేతలు అంటున్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.