ltrScrptTheme3

దేనికైనా రెడీ!

Oct 26 2021 @ 00:00AM

అక్రమాలకు కేరా్‌ఫగా మారిన ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయం
ముడుపులిస్తే చాలు నిబంధనలకు విరుద్దంగా రిజిస్ర్టేషన్లు
వాటాల్లో పంపకాలతో లొల్లి.. పరస్పరం ఫిర్యాదులు
సబ్‌ రిజిస్ట్రార్‌, సీనియర్‌ అసిస్టెంట్‌పై ఉన్నతాధికారుల వేటు


ఓరుగల్లు, ఆక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : ‘అక్కడ ప్రతీ పనికి ఓ రేటు.. అవసరమైన పత్రాలు ఉంటే ఒక రేటు, లేకుంటే రెట్టింపు.. ప్రభుత్వ నిబంధనలు పనికిరాని విషయాలు.. ప్రభుత్వానికెంత చెల్లిస్తున్నావన్నది కాదు.. మాకెంత ఇస్తున్నావన్నదే ముఖ్యం.. లేదంటే ఫైలు అంగుళం కదలదు..’ ఇది  హనుమకొండలోని ఉమ్మడి వరంగల్‌ జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయంలో నెలకొన్న పరిస్థితి. అక్రమాలకు మరిగిన కొందరు అధికారులు.. ‘ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి... మాకు అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల అండదండలున్నాయి’ అంటూ సామాన్యపౌరులపై ఒంటికాలి మీద లేస్తున్నారు.  

నిబంధనలకు విరుద్దంగా జరిపిన రిజిస్ర్టేషన్‌ లావాదేవీల్లో పెద్దఎత్తున ముడుపులు అందడం ఇక్కడ రివాజుగా మారింది. ఈ ముడుపుల  పంపకాల్లో వచ్చిన పంచాయితీతో కొందరు అధికారులు  పరస్పరం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకున్నారు. రంగంలోకి దిగిన అధికారులు విచారణ జరపడంతో అవినీతి రంగు బహిరంగమైంది. ఫలితంగా సబ్‌ రిజిస్ట్రార్‌ సురేంద్రబాబు, సీనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ శ్రీనివా్‌సలపై ప్రభుత్వం సోమవారం సస్పెన్షన్‌ వేటు వేసింది. అయితే దొరకని దొంగలు ఇంకా ఉన్నారనేది ప్రజల వాదన.

ప్రతీ పనికో రేటు ..
రిజిస్ట్రేషన్‌ శాఖలో అవినీతిని అరికట్టేందుకు ప్రభుత్వం అనేక రకాలుగా ప్రయత్నిస్తోంది. రిజిస్ట్రేషన్‌  శాఖ బాధ్యతను కొంత మేర రెవెన్యూ శాఖకు బదిలీ చేసింది. రిజిస్ట్రేషన్‌ లావాదేవీల ద్వారా ఆదాయాన్ని పెంచే విధంగా ప్రభుత్వం విధానాల రూపకల్పనలో అనేక మార్పులు చేపట్టింది. అయితే ఇదంతా రిజిస్ట్రేషన్‌ శాఖలో పనిచేసే కొద్దిమంది అవినీతి అధికారుల జేబులు నింపడానికి ఉపయోగపడుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.  

హైదరాబాద్‌ తర్వాత రెండో అతిపెద్ద నగరమైన వరంగల్‌లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరుగా సాగుతోంది.  వరంగల్‌, హనుమకొండ, కాజీపేట పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు వెలుస్తున్నాయి.  మడికొండ, భీమారం, హసన్‌పర్తి, ఆరెపల్లి, పైడిపల్లి,  గొర్రెకుంట, ధర్మారం, మామునూర్‌ సరిహద్దు ప్రాంతాలన్నీ ఇపుడు రియల్‌ హబ్‌లుగా మారాయి.  

ఈ క్రమంలో కొద్దిమంది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు లేఅవుట్‌ లేని వెంచర్‌లు చేసి ప్లాట్లను ప్రజలకు అంటగడుతున్నారు. ల్యాండ్‌ కన్వర్షన్‌, నాలా కన్వర్షన్‌ లేకుండా ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేయడం నిబంధనలకు విరుద్ధం. అయితే కొందరు రిజిస్ట్రేషన్‌ శాఖాధికారులు పర్సంటేజీలు మాట్లాడుకుని  నిబంధనలను పక్కనపెట్టి రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారు. నిర్ణీత ధరలను కూడా ఏర్పాటుచేసుకున్నారు. నాన్‌ లే అవుట్‌ ప్లాట్లు రిజిస్ట్రేషన్‌ చేయాలంటే గజానికి రూ .500 అదనంగా  సదరు అవినీతి అధికారులకు చెల్లించాలి.  అవినీతి అధికారులు ఎంతగా తెగించారంటే ఒక్కో రోజు 20 నుంచి 30 నాన్‌ లేఅవుట్‌, నాలా కన్వర్షన్‌ లేని ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేస్తున్నట్లు  ఉన్నతాధికారుల విచారణలో తేలినట్లు సమాచారం.

ఏజెంట్లదే రాజ్యం..

జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయంలో పని కావాలంటే ప్రజలు  అధికారుల అనుంగు ఏజెంట్లను కలిస్తే సరిపోతుంది. అధికారి వాటా, తన వంతు వాటా డబ్బులు తీసుకుని మెరుపు వేగంతో పనులు చేయించుకొస్తారు. రోజుల తరబడి కార్యాలయం చుట్టూ తిరగడం కంటే,  ఏజెంట్‌ చెప్పినట్టు విని డబ్బులు ముట్టజెప్పితే సరిపోతుందని ప్రజలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు భావిస్తున్నారు. రోజు వారీగా వచ్చే లక్షల రూపాయలను వివిధ స్థాయిల్లో వాటాల రూపంలో పంచుకుంటారనేది బహిరంగ రహస్యమేనంటున్నారు.

సెలవు వ్యూహం ..
జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయంలోని కొందరు అధికారులు తమ చేతికి మట్టి అంటకుండా ప్రత్యేక వ్యూహంతో పనులు చక్కబెడుతున్నారని తెలుస్తోంది. రాజకీయ పార్టీల నేతలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల నుంచి ఒత్తిళ్ళు ఎక్కువవుతున్నాయని నిబంధనలకు విరుద్దంగా పనులు చేయలేమని చెబుతూ సెలవులో  వెళ్ళిపోతుంటారు. అదే సమయంలో సదరు వ్యక్తుల రిజిస్ట్రేషన్‌లు చక చకా జరిగిపోతుంటాయని తెలిసింది.

లక్షలు ఖర్చు పెట్టి..

హనుమకొండలోని ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయంలో పోస్టింగ్‌ అంటే మామూలు మాటలు కాదంటున్నారు. అత్యధిక సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరిగే  ఈ కార్యాలయంలో స్థానం సంపాదించడమంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అంటున్నారు. తాము అధికార పార్టీ నేతలకు పెద్ద మొత్తంలో ముట్ట జెప్పితేనే ఇక్కడ ఉద్యోగం చేయగలుగుతామని లేదంటే వేరే దారి చూసుకోవాల్సిందేనని ఈ కార్యాలయ ఉద్యోగులే బహిరంగంగానే చెబుతున్నారు.   ఇంత ఖర్చు పెట్టిన తాము ఆ మాత్రం తీసుకోక పోతే ఎట్లా బతికేదని బరితెగించి మాట్లాడుతున్నారని ప్రజలు వాపోతున్నారు.

నేతల అండదండలు

అధికార పార్టీకి చెందిన కీలక నేతలు అండదండలు వీరికి పుష్కలంగా ఉండడంతో నిబంధనలకు విరుద్ధంగా సుదీర్ఘ కాలం ఒకే జిల్లాలోని కార్యాలయంలో ఏకంగా పది సంవత్సరాలుగా పనిచేస్తున్న అధికారులు ఉన్నారు.  అధికార పార్టీ ఎమ్మెల్యేలు  కొందరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులుగా రూపాంతరం చెందడంతో వీరి ఆగడాలకు అంతులేకుండా పోతోంది. నిబంధనలకు విరుద్ధంగా సదరు నేతల పనులు చేసి పెడితే చాలు, ఇక ఎన్ని అక్రమాలకు పాల్పడ్డా తమను అడిగే నాధుడే లేడన్న ధీమాతో కొనసాగుతున్నారు.

మరో ఇద్దరిపైనా వేటు...?

హనుమకొండ టౌన్‌, అక్టోబర్‌ 26: హనుమకొండలోని ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అక్రమాలు జరిగినట్లు తేలడంతో ఇద్దరు అధికారులపై సస్పెన్షన్‌ వేటు పడటం కలకలం రేపింది.  ప్రభుత్వ నిబంధనలు విస్మరించి నాన్‌ లేఅవుట్‌ ప్లాట్లను రిజిస్ట్రేషన్‌లు చేస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. కార్యాలయంలోని ఇద్దరు సబ్‌ రిజిస్ట్రార్‌లతో పాటు, ఒక సీనియర్‌ అసిస్టెంట్‌, డీఐజీ కార్యాలయంలో పని చేస్తున్న ఒక సూపరింటెండెంట్‌కు అక్రమాలతో సంబంధం ఉన్నట్టు తేలింది.  ఈ మేరకు పూర్తి వివరాలతో నివేదికను ఐజీకి పంపించారు. ఈ క్రమంలో ఉన్నతాధికారులు... కార్యాలయంలో పనిచేస్తున్న సబ్‌ రిజిస్ట్రార్‌ సురేంద్రబాబు,  సీనియర్‌ అసిస్టెంట్‌ శ్రీనివా్‌సను సస్పెండ్‌ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసారు. మరో సబ్‌ రిజిస్ట్రార్‌, సూపరింటెండెంట్‌లపై ఒకటి రెండు రోజుల్లో చర్యలు తీసుకునే అవకాశాలున్నట్లు సమాచారం.  అక్రమ రిజిస్ట్రేషన్‌ల వ్యవహారం ఎంతమంది మెడకు చుట్టుకుంటుందోనని కార్యాలయ ఉద్యోగులు ఆందోళనలో చెందుతున్నారు. కార్యాలయంలో సగటున ప్రతీ రోజు 150కి పైగా రిజిస్ట్రేషన్‌లు జరిగేవి. తాజా పరిణామాలతో  మంగళవారం 89 రిజిస్ట్రేషన్‌లు మాత్రమే జరగడం గమనార్హం.  

ఇదిలావుండగా  సబ్‌ రిజిస్ట్రార్‌ సురేంద్రబాబును సస్పెండ్‌ చేస్తూ ఉన్నతాధికారులు సోమవారమే ఉత్తర్వులు జారీచేయగా, అవి మంగళవారం ఉదయం వరకు కూడా ఆయనకు అందలేదు. దీంతో ఆయన యధావిధిగా విధులకు హాజరయ్యారు. అయితే మధ్యాహ్నం డీఐజీ సంతకంతో కూడిన సస్పెన్షన్‌ ఉత్తర్వులను అందజేయడంతో ఆయన వెంటనే కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. సస్పెన్షన్‌ అయినప్పటికీ, సంబంధిత ఉత్తర్వులు అందేవరకు డ్యూటీ చేయవచ్చని, సురేంద్రబాబు కూడా ఆ నిబంధన ప్రకారమే మంగళవారం డ్యూటీ చేశారని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.