హరితహారానికి రెడీ

ABN , First Publish Date - 2022-07-04T05:16:17+05:30 IST

హరిత తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహార కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎనిమిదో విడత హరితహారానికి జిల్లాలోని 526 గ్రామ పంచాయతీల్లోని నర్సరీల్లో విరివిగా మొక్కలను సిద్ధం చేస్తున్నారు.

హరితహారానికి రెడీ
హరితహారానికి నర్సరీలలో పెంచుతున్న మొక్కలు

- ఎనిమిదో విడతకు సర్వం సిద్ధం

- ఏర్పాట్లు చేస్తున్న అధికార యంత్రాంగం

- టార్గెట్‌ కోటికి పైగానే

- హరితహారంపై జిల్లా అధికారుల ప్రత్యేక దృష్టి


కామారెడ్డి, జూలై 3: హరిత తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహార కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎనిమిదో విడత హరితహారానికి జిల్లాలోని 526 గ్రామ పంచాయతీల్లోని నర్సరీల్లో విరివిగా మొక్కలను సిద్ధం చేస్తున్నారు. కోటికి పైగానే మొక్కలు నాటేందుకు ప్రణాళిక తయారు చేశారు. ఆయా గ్రామాల్లోని కాల్వగట్లు, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఆశించినంతగా వర్షాలు లేకపోవడంతో మొక్కలు నాటే ప్రక్రియ ప్రారంభం కాలేదని తెలుస్తోంది. మొక్కలను నర్సరీల్లో పెంచి, నాటించే బాధ్యత డీఆర్‌డీవో, మున్సిపాలిటీలు, అటవీశాఖ, ఎక్సైజ్‌శాఖలకు అప్పగించారు. హరితహారం కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా చేపట్టేందుకు జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

హరితహారానికి 10 శాతం నిధుల కేటాయింపు

హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు స్థానిక సంస్థల బడ్జెట్‌లో 10 శాతం నిధులు కేటాయిస్తున్నారు. త్వరలో జిల్లా వ్యాప్తంగా హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించి జిల్లాలోని 22 మండలాల వారీగా కేటాయించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో భాగంగా నాటే మొక్కలో 85 శాతం బతికేలా చర్యలు తీసుకోనున్నారు. కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం ప్రభుత్వం ఈ నిబంధనలు అమలు చేస్తున్నది. ఇందులో భాగంగానే ప్రతీ గ్రామ పంచాయతీకి ట్రాక్టర్లు, ట్యాంకర్లు అందించింది. వీటితో ఏడాది పాటు మొక్కలకు నీళ్లు పడుతున్నారు. నర్సరీల నుంచి మొక్కలు సరఫరా చేస్తుండగా అడవులు, రహదారులు, గ్రామ పంచాయతీలు, పాఠశాలల మైదానాలు, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.

పంపిణీకి మొక్కలు సిద్ధం

జిల్లాలోని 526 గ్రామ పంచాయతీలుండగా ప్రతీ జీపీలోనూ నర్సరీ ఉంది. ప్రతీ ఇంటికి పూలు, పండ్ల ఆరు మొక్కలను పంపిణీ చేయనున్నారు. కాగితం పూలు, సీమ తంగేడు, టెకోమా, రణపాల, కానుగ, టేకు, చింత, ఉసిరి, సీతాఫలం, జామ, నేరేడు, మందార, క్రొటోపాం మొక్కలను నాటేందుకు సిద్ధమవుతున్నారు. వీటితో పాటు ప్రతీ మండలంలో నాలుగు బృహత్‌ ప్రకృతి వనాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. ఐదెకరాల్లో ప్రకృతి వనం ఏర్పాటు చేస్తారు. ప్రతీ వనంలో 15వేల వివిధ రకాల పండ్లు, నీడనిచ్చే మొక్కలు నాటనున్నారు. హరితహారంలో మొక్కలు నాటి సంరక్షణ చర్యలపై కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అధికారులకు ఇది వరకే దిశానిర్ధేశం చేశారు. హరితహారం విజయవంతం చేయడానికి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు.

నాటడం ఒకే.. మరి సంరక్షణ మాట

ప్రతీసారి మొక్కలను నాటడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు చూపుతున్న శ్రద్ధ సంరక్షణపై ఉండడం లేదు. మొక్కలు నాటేటప్పుడు ఒకటికి పది సార్లు ఫొటోలు దిగి సోషల్‌ మీడియాలో షేర్‌లు చేస్తున్నారే తప్ప ప్రభుత్వ లక్ష్యం మాత్రం నెరవేర్చడంలో విఫలమవుతున్నారు. నాటిన మొక్కలు ఎండుముఖం పడితే స్థానిక ప్రజాప్రతినిధులపై, అధికారులపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినా అమలుకు నోచుకోకపోవడంతో మొక్కలు నాటడంలో ఉన్న శ్రద్ధ సంరక్షణలో మాత్రం ఉండడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2022-07-04T05:16:17+05:30 IST