‘న్యాక్‌’ గుర్తింపునకు సమాయత్తం

Published: Sun, 27 Mar 2022 00:00:00 ISTfb-iconwhatsapp-icontwitter-icon
న్యాక్‌ గుర్తింపునకు సమాయత్తం సంగారెడ్డిలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల

సంగారెడ్డి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో

వచ్చే నెల 12, 13 తేదీల్లో ‘న్యాక్‌’ బృందం తనిఖీ

మెరుగైన గ్రేడ్‌ సాధించేందుకు ప్రయత్నాలు

గుర్తింపు పొందితేనే కళాశాల అభివృద్ధికి నిధులు


సంగారెడ్డి అర్బన్‌, మార్చి27: సంగారెడ్డిలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల న్యాక్‌ (నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రిడిటేషన్‌ కౌన్సిల్‌-ఎన్‌ఏఏసీ) గుర్తింపు పొందేందుకు సమాయత్తమవుతున్నది. ప్రస్తుతం కళాశాల న్యాక్‌-బీ గ్రేడ్‌ గుర్తింపు కలిగి ఉంది. రెండు పర్యాయాల నుంచి కళాశాల న్యాక్‌-బీ గ్రేడ్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఐదేళ్లకొకసారి జరిగే న్యాక్‌ అసెస్‌మెంట్‌కు సంబంధించి ఇప్పటికే కళాశాల అధికారులు, అధ్యాపకులు కసరత్తు ప్రారంభించారు. న్యాక్‌ అసెస్‌మెంట్‌లో మెరుగైన గ్రేడు సాధిస్తే కళాశాలను నిధులు మంజూరయ్యే అవకాశాలుంటాయి. కాగా ఏప్రిల్‌ 12, 13 తేదీల్లో న్యాక్‌ బృందం సభ్యులు కళాశాలను సందర్శించనున్నారు. అవసరమైన వాటిని సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.  

1981లో కళాశాల స్థాపన

ఈ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల 1981లో ఏర్పాటైంది. కళాశాలకు 9ఎకరాల 15 గుంటల స్థలం ఉంది. ప్రస్తుతం 14 డిపార్ట్‌మెంట్లు ఉన్నాయి. ఆయా కోర్సుల్లో సుమారు 377 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. 21 మంది అధ్యాపకులకు 14 మంది పనిచేస్తున్నారు. వారితో పాటు ముగ్గురు గెస్ట్‌, ఇద్దరు కాంట్రాక్టు ప్రాతిపదికన అధ్యాపకులు విధులు నిర్వహిస్తున్నారు. ఈ కళాశాలలో మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థినులే ఇక్కడ ఎక్కువ మంది విద్యనభ్యసిస్తుండటం విశేషం.

న్యాక్‌ బృందం పరిశీలించే అంశాలివే

వచ్చే నెలలో కళాశాలను న్యాక్‌ బృందం సందర్శించి పలు అంశాలను పరిశీలించనున్నది. ఇందులో భాగంగా 1. టీచింగ్‌, లెర్నింగ్‌, ఈవాల్యుయేషన్‌, 2. కరిక్యులర్‌ ఆస్పెక్ట్స్‌(సెలబస్‌),3. రీసెర్చ్‌ ఇన్నోవేషన్‌(స్టాఫ్‌ సెల్ఫ్‌ డెవలప్‌మెంట్‌), 4. వసతులు, సదుపాయాలు, 5. స్టూడెంట్‌ సపోర్ట్‌ ప్రొగ్రెస్‌(ఫలితాలు), 6. అడ్మినిస్ట్రేషన్‌, 7. బెస్ట్‌ ప్రాక్టిస్‌ ఇన్నోవేషన్‌ (కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, విపణి) తదితర అంశాలు పరిశీలించి మార్కులు, పాయింట్లు కేటాయిస్తారు. మార్కులు, వచ్చిన పాయింట్ల ఆధారంగా గ్రేడ్లు ఇస్తారు. న్యాక్‌ అసెస్‌మెంట్‌లో భాగంగా ఇప్పటికే కళాశాలకు సంబంధించిన సెల్ఫ్‌ స్టడీ రిపోర్ట్‌(ఎస్‌ఎస్‌ఆర్‌)ను గత అక్టోబరులోనే బెంగుళూరులోని న్యాక్‌ కార్యాలయానికి ఆన్‌లైన్‌ ద్వారా పంపారు. ఏప్రిల్‌ 12, 13 తేదీల్లో ముగ్గురు సభ్యులతో కూడిన న్యాక్‌ బృందం ప్రత్యక్షంగా కళాశాలను తనిఖీ చేయనుంది. ఆ తర్వాత మూడు రోజుల్లో కళాశాల సాధించిన గ్రేడ్‌తో కూడిన ఫలితాలు వెల్లడిస్తారు. 

న్యాక్‌కు సమాయత్తం

న్యాక్‌ బృందం సంతృప్తి చెందేందుకు కళాశాల ప్రిన్సిపాల్‌తో పాటు అధ్యాపకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కళాశాలను రంగులు వేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కళాశాల ప్రాంగణంలో ఆకట్టుకునేలా బొటానికల్‌ గార్డెన్స్‌ ఏర్పాటు చేశారు. హరితహారం కింద నాటిన మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు. కళాశాలలో అవసరమైన ఫర్నిచర్‌ సమకూర్చారు. దాతల సహకారంతో బెంబీలు, ఫర్నిచర్‌ సమకూర్చుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఐదు డిగ్రీ కళాశాలల్లో ఎన్‌సీసీ వింగ్‌ ఏర్పాటై ఉండగా, అందులో సంగారెడ్డి ఒకటి కావడం విశేషం. ఇటీవలే కళాశాలకు చెందిన హిస్టరీ అధ్యాపకురాలు మూడు నెలల పాటు గ్వాలియర్‌లో శిక్షణ పొందిన కృష్ణప్రియ ఎన్‌సీసీ లెఫ్ట్‌నెంట్‌గా ఎంపికయ్యారు. 

న్యాక్‌ గుర్తింపుతో లాభాలు

కళాశాలకు జాతీయ మదింపు గుర్తింపు మండలి(న్యాక్‌) పొందితే ‘రూసా’ కింద నిధులు మంజూరు చేస్తారు. ఆ నిధులతో కళాశాల అభివృద్థి సాధ్యమవుతుంది. నాణ్యమైన బోధన ఉంటుందనే గుర్తింపు లభిస్తుంది. ప్రాంగణ నియామకాల ద్వారా విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఈ ఏడాది న్యాక్‌ అసెస్‌మెంట్‌లో మెరుగైన గ్రేడ్‌ సాధించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని కళాశాల  ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ హుమేరా సయీద్‌ తెలిపారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.