ప్రజల కోసం ఎన్నిసార్లయినా జైలుకెళతాం

ABN , First Publish Date - 2022-09-25T05:01:43+05:30 IST

ప్రజల కోసం ఎన్నిసార్లయినా జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు అన్నారు.

ప్రజల కోసం ఎన్నిసార్లయినా జైలుకెళతాం
చిత్తూరులో టీడీపీ భారీ వాహన ర్యాలీ

పులివెందుల రాజకీయాలు కుప్పంలో సాగవు

కుప్పం అభివృద్ధిపై వైపీపీ శ్వేతపత్రం విడుదల చేయాలి

లక్ష ఓట్ల మెజారిటీతో చంద్రబాబును గెలిపించుకుంటాం

మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీవాసులు


చిత్తూరు సిటీ, సెప్టెంబరు 24: ప్రజల కోసం ఎన్నిసార్లయినా జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు అన్నారు. ఆయనతో పాటు కుప్పానికి చెందిన మరికొంతమంది నేతలకు హైకోర్టులో బెయిల్‌ మంజూరవడంతో 27 రోజుల తర్వాత చిత్తూరు జైలు నుంచి శనివారం విడుదలయ్యారు. జైలు బయట గౌనివారి విలేకరులతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం తనపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిందని, చేయని తప్పుకు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే పార్టీ నేతలు, కార్యకర్తలు తనపై చూపిస్తున్న అభిమానం ఆ బాధను తగ్గించిందన్నారు. పార్టీ శ్రేణులకు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. సీఎం జగన్‌ పులివెందుల రాజకీయాలను కుప్పంలో చేయాలనుకుంటున్నారని, అయితే అది జరగని పని అని స్పష్టం చేశారు. కుప్పం ప్రజలు మంచికి, మానవత్వానికి, న్యాయానికి, ధర్మానికి కట్టుబడి ఉంటారన్నారు. ప్రశాంతంగా ఉన్న కుప్పంలో అరాచకాలు, దౌర్జన్యాలు సృష్టించి అమాయక ప్రజలను వైసీపీ భయభ్రాంతులకు గురిచేస్తోందని చెప్పారు. చంద్రబాబు వల్లే కుప్పం అన్ని విధాలా అభివృద్ధి చెందిందని, సీఎం జగన్‌కు దమ్ముంటే కుప్పం అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పారు. వైసీపీ మోసపూరిత మాటలకు కుప్పం ప్రజలు ఏమారే  ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.


ఫ 27 రోజుల పాటు జైల్లో..

గత నెల టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో పర్యటించే సమయంలో వైసీపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేయడం.. పోలీసులు టీడీపీ నాయకుల మీద లాఠీ ఛార్జి చేసి, మళ్లీ 72 మంది టీడీపీ శ్రేణుల మీద  కేసులు నమోదు చేయడం తెలిసిందే. గౌనివారి శ్రీనివాసులు సహా కుప్పం నియోజకవర్గ టీడీపీ నేతలు రాజ్‌కుమార్‌, ఆర్‌.సుబ్రమణ్యం, టి.మునస్వామి, మంజు, ఎం.సుబ్రమణ్యం, యు.ముఖేష్‌, ఎస్‌.మునెప్పను అరెస్టు చేసి గత నెల 27న చిత్తూరు జిల్లా జైలుకు రిమాండ్‌కు పంపారు. వీరిలో ఆర్‌.సుబ్రమణ్యానికి తప్ప మిగిలిన వారికి హైకోర్టులో శుక్రవారం బెయిల్‌ మంజూరైంది. దీంతో 27 రోజుల తర్వాత శనివారం విడుదలయ్యారు. ఆర్‌.సుబ్రమణ్యానికి మరో కేసులో బెయిల్‌ రాకపోవడంతో ఆయన విడుదల కాలేదు.

జైలువద్దకు భారీఎత్తున టీడీపీ శ్రేణులు

 కుప్పం టీడీపీ నేతలు విడుదలవుతున్న సందర్భంగా వారికి స్వాగతం పలికేందుకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని టీడీపీ నేతలు, కార్యకర్తలు శనివారం మధ్యాహ్నం 2:30 గంటలకే జిల్లా జైలు వద్దకు భారీగా తరలి వచ్చారు. టపాసులు పేల్చి సందడి చేశారు. సాయంత్రం 4.30 గంటలకు జైలు నుంచి బయటకు వచ్చిన గౌనివారి తదితరులు పెద్దఎత్తున తరలివచ్చిన శ్రేణుల్ని చూసి  భావోద్యేగానికి లోనయ్యారు. ఆనంద భాష్పాలతో పార్టీ నేతలకు, కార్యకర్తలకు అభివాదం చేశారు. జైలు నుంచి బయటకు వచ్చిన టీడీపీ నేతలపై పూలవర్షం కురిపించిన పార్టీ శ్రేణులు చిత్తూరు నుంచి కుప్పం వరకు వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు.

ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

జైలు నుంచి బెయిల్‌ మీద విడుదలైన టీడీపీ నేతలను వందలాది వాహనాల్లో కుప్పం వరకు ర్యాలీగా తీసుకెళ్లాలని చిత్తూరు టీడీపీ నాయకులు ముందుగా ప్లాన్‌ చేసుకున్నారు. ఈ క్రమంలో జైలు వద్ద పెద్దఎత్తున వాహనాలతో హాజరయ్యారు. జైలు నుంచి కుప్పానికి ర్యాలీ ప్రారంభమవ్వగా ఓ కిలోమీటరు ప్రయాణించగానే, కాజూరు జంక్షన్‌ వద్ద అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. వాహనాల ముందు బారికేడ్లు ఏర్పాటు చేశారు. జైలు నుంచి విడుదలైన టీడీపీ నేతల వాహనాలను మాత్రం పంపించారు. దీంతో టీడీపీ నేతలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. సాయంత్రం 6.30 గంటల తర్వాత మిగిలిన వాహనాలనూ వదిలి పెట్టారు. ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ మంత్రి అమరనాథరెడ్డి, మాజీ మేయర్‌ కఠారి హేమలత, పార్టీ చిత్తూరు, తిరుపతి పార్లమెంటు నియోజకవర్గాల అధ్యక్షులు పులివర్తి నాని, నరసింహ యాదవ్‌, రాష్ట్ర కార్యదర్శి సురేంద్రకుమార్‌, బీసీసెల్‌ ప్రధాన కార్యదర్శి షణ్ముగం, నేతలు శ్రీధర్‌ వర్మ, కోదండయాదవ్‌, కాజూరు బాలాజి, భీమినేని చిట్టిబాబు, వసంత్‌కుమార్‌, సుబ్రి, సీఎం విజయ, కార్జాల అరుణ, కాజూరు రాజేష్‌, మోహన్‌రాజ్‌, శంకర్‌, దుర్గాచౌదరి, మేషాక్‌, రాజశేఖర్‌, శేషాద్రి నాయుడు, అశోక్‌, ఈశ్వర్‌, రాణి, శ్రీదుర్గ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-25T05:01:43+05:30 IST