సాయానికి ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బలగాలు సిద్ధం: ఎస్పీ అప్పలనాయుడు

ABN , First Publish Date - 2021-11-26T07:57:17+05:30 IST

భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ వెంకటఅప్పలనాయుడు సూచించారు.

సాయానికి ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌   బలగాలు సిద్ధం: ఎస్పీ అప్పలనాయుడు
విపత్తు సహాయక బృందాలు, పోలీసు అధికారులతో మాట్లాడుతున్న ఎస్పీ వెంకటఅప్పలనాయుడు

తిరుపతి(నేరవిభాగం), నవంబరు 25: భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ వెంకటఅప్పలనాయుడు సూచించారు. గురువారం ఆయన ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బలగాలతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు పోలీసు బలగాలు, విపత్తు సహాయక బృందాలు సర్వసిద్ధంగా ఉన్నాయన్నారు. లోతట్టు ప్రాంతాల్లోనివారు తమ విలువైన పత్రాలు, నగదు, నగలు, ఇతరత్రా వస్తువులను సురక్షిత ప్రాంతాల్లో భద్రపరుచుకోవాలని సూచించారు. జలమయమైన రోడ్లలో నడిచేవారు, వాహనాల్లో ప్రయాణించేవారు మ్యాన్‌హోల్స్‌ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. వృద్ధులను, చిన్నపిల్లలను వీలైతే సురక్షిత ప్రాంతాల్లో ఉన్న బంధువుల వద్దకు పంపించాలన్నారు. కరెంటు స్తంభాలను ముట్టుకోరాదని, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద, భారీ వృక్షాల కింద ఉండరాదని చెప్పారు. ఇళ్లలోకూడా కరెంటు మెయిన్లు, ఫ్యూజులు తీస్తూ పెడుతూ ఉండరాదన్నారు. వరద ముంపునకు గురయ్యే పరిస్థితులు తలెత్తితే పోలీస్‌ డయల్‌ 100, 80999999, 6309913960 నంబర్లకు కాల్‌చేసి పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం అందించాలని సూచించారు. వెంటనే సహాయక బృందాలు సాయమందిస్తాయని చెప్పారు. 

ఫ బాధితులకు పూర్తిస్థాయిలో అందని సాయం

వరద కారణంగా తిరుపతి, చిత్తూరులోని కొన్ని కాలనీల ప్రజలు నేటికీ నీళ్లలోనే కాలం వెల్లదీస్తున్నారు. ఇంట్లో నుంచి నేరుగా వరద నీటిలో కాలు పెట్టి బయటికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అలాగే 489 గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి. 33,451 కుటుంబాలను వరద ప్రభావం తాకింది. 25 కిలోల బియ్యం, కిలో బంగాళాదుంపలు, ఎర్రగడ్డలు, నూనె వంటి సామగ్రిని యంత్రాంగం అందిస్తోంది. కానీ.. బాధితులకు పూర్తిస్థాయిలో నేటికీ సాయం అందలేదు. 22 వేల కుటుంబాలకు సాయం అందించామని కలెక్టర్‌ హరినారాయణన్‌ ఇటీవల విడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్‌కు వివరించారు.ఇప్పటికీ ఎక్కడ చూసినా దాతలే ముందుకొచ్చి ఆహార సామగ్రితో పాటు దుప్పట్లు, చాపలు వంటి వాటిని బాధితులకు అందిస్తున్నారు.

ఫ ఆక్రమణలతో పెరిగిన ప్రమాదం : వరదలతో ఊహించని నష్టం కలగడానికి నదుల ఆక్రమణలూ కారణమే. రాజకీయ నాయకుల వత్తాసు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా జిల్లాలో నదులు భారీగా అన్యాక్రాంతమయ్యాయి. ఫలితంగా ఇప్పుడు భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. పాకాల, చంద్రగిరి, తిరుపతి, రేణిగుంట, ఏర్పేడు, శ్రీకాళహస్తి మండలాల్లో ప్రవహించే స్వర్ణముఖి నది వెంబడి ఆక్రమణలు విచ్చలవిడిగా ఉన్నాయి. దీంతో నది వెడల్పు కుంచించుకుపోయింది. భారీ వర్షాలకు ఉధృతంగా ప్రవహించిన నది చంద్రగిరి నుంచి శ్రీకాళహస్తి వరకు ఉన్న ఆక్రమణలను తనలో కలిపేసుకుంది. దీంతో తీవ్రస్థాయిలో నష్టం కలిగింది. చిత్తూరు నగరం మధ్యలో ప్రవహించే నీవా నది వెంట ఇళ్ల నిర్మాణం చేపట్టడంతో కాలనీలు వెలిశాయి. ఈ వర్షాలకు నది ఎన్నడూలేని రీతిలో ప్రవహించడంతో ఆక్రమణలన్నీ మునిగిపోయాయి.తిరుపతి చుట్టుపక్కలున్న చెరువులను రూపుమాపడంతోనే నగరం మునిగిందని.. దళవాయి, పేరూరు, అవిలాల వంటి గొలుసుకట్టు చెరువులు తిరుపతిలో కనిపించకుండాపోయాయని ఇటీవల జిల్లాలో పర్యటించిన చంద్రబాబు చెప్పిన విషయం తెలిసిందే. 


Updated Date - 2021-11-26T07:57:17+05:30 IST