కూటమి నుంచి వైదొలగడానికి సిద్ధమే!

ABN , First Publish Date - 2022-06-24T07:18:38+05:30 IST

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ముదిరి పాకాన పడింది.

కూటమి నుంచి వైదొలగడానికి సిద్ధమే!

24 గంటల్లోగా రండి మాట్లాడుకుందాం

సమస్యలను చర్చలతో పరిష్కరించుకుందాం

పార్టీ తలుపులు తెరిచే ఉన్నాయి: సంజయ్‌ రౌత్‌

పోతే పొండంటూ తొలుత మేకపోతు గాంభీర్యం

సంఖ్యాబలం అనుకూలంగా లేదని గ్రహించి వెనక్కి

46 మంది ఎమ్మెల్యేలు, జాతీయ పార్టీ

మద్దతు కూడా ఉన్నట్టు ప్రకటించిన ఏక్‌నాథ్‌ షిండే

తన శిబిరంలోని ఎమ్మెల్యేలతో ఫొటోలు, వీడియో

కూటమి బలం ఎంతో బలపరీక్షలో తేలుతుంది

గువాహటిలో కాదు.. ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ 

పరీక్షలో మహావికాస్‌ అఘాడీ గెలుస్తుందని ధీమా

12 మంది ‘ఎమ్మెల్యే’లకు సేన అనర్హత నోటీసులు

ఎవరిని భయపెట్టాలనుకుంటున్నారు?: షిండే


ముంబై, జూన్‌ 23: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ముదిరి పాకాన పడింది. సంఖ్యా బలం తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ షిండేకు అనుకూలంగా ఉన్నట్టు స్పష్టంగా తేలిన నేపథ్యంలో.. మహా వికాస్‌ అఘాడీ (ఎంవీయే) కూటమి నుంచి వైదొలగడానికి శివసేన సిద్ధమైంది. రెబెల్‌ ఎమ్మెల్యేలకు పార్టీ తలుపులు తెరిచే ఉన్నాయని, వారంతా 24 గంటల్లోగా ముంబైకి తిరిగి వచ్చేస్తే మహావికాస్‌ అఘాడీ కూటమి నుంచి వైదొలగే అంశాన్ని పరిశీలిస్తామని, వారి సమస్యలపై ఉద్ధవ్‌ ఠాక్రేతో చర్చించి పరిష్కరించడానికి సిద్ధమని పార్టీ ఎంపీ సంజయ్‌ రౌత్‌ విజ్ఞప్తి చేశారు. ‘‘లక్ష్యం లేకుండా ఎందుకు తిరుగుతారు? తలుపులు తెరిచే ఉన్నాయి. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చు. బానిసత్వాన్ని అంగీకరించడం కన్నా.. ఆత్మగౌరవంతో నిర్ణయం తీసుకుందాం’’ అంటూ మరాఠీలో ట్వీట్‌ చేశారు. మరోవైపు.. ముంబైకి దాదాపు మూడువేల కిలోమీటర్ల దూరాన గువాహటిలో మకాం వేసిన ఏక్‌నాథ్‌ షిండే గూటికి గురువారం మరో ముగ్గురు శివసేన ఎమ్మెల్యేలు  చేరారు. దీంతో తనకు స్వతంత్ర ఎమ్మెల్యేలతో కలిపి మొత్తం 46 మంది శాసనసభ్యుల మద్దతు ఉందని ఏక్‌నాథ్‌ షిండే ప్రకటించారు. 35 మంది సేన ఎమ్మెల్యేలు సంతకాలు చేసిన లేఖను మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ నరహరి జిర్వాల్‌కు సమర్పించారు. తనకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలతో కలిసి ఫొటోలు, వీడియో దిగి మీడియాకు విడుదల చేశారు. ‘‘మనందరి ఆందోళనలు, సంతోషాలు ఒక్కటే.


మనం కలిసి ఉన్నాం. గెలుపు మనదే. ఒక జాతీయ పార్టీ ఉంది. అదొక మహాశక్తి.. మీకు తెలుసు, పాకిస్థాన్‌ను అణచివేసింది. తామొక చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని.. మనకు కావాల్సిన అన్ని రకాల సాయం చేస్తామని ఆ పార్టీ చెప్పింది’’ అని ఆ వీడియోలో షిండే రెబెల్‌ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ప్రసంగించడం గమనార్హం. ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించకుండా పార్టీని వీడాలంటే షిండేకు 37 మంది శివసేన ఎమ్మెల్యేల మద్దతు కావాలి. అంతకు మించి.. అంటే దాదాపు 40 మంది దాకా ‘సేన’ ఎమ్మెల్యేలు ఆయనతో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్యేలే కాదు.. డజను మందికి పైగా శివసేన ఎంపీలు కూడా షిండేకు మద్దతుగా ఉన్నట్టు సమాచారం. తామంతా ఉద్ధవ్‌ ఠాక్రేకు వ్యతిరేకం కాదని, కూటమి నుంచి వైదొలగి బీజేపీకి మద్దతు ఇవ్వాలనేదే తమ డిమాండ్‌ అని గురువారంనాడు షిండే శిబిరంలో చేరిన సేన ఎమ్మెల్యే దీపక్‌ కేసర్‌కర్‌ తెలిపారు. 


పోతే పొండి..

చర్చలకు సిద్ధమని ప్రకటించిన సంజయ్‌ రౌత్‌ నిజానికి గురువారం మధ్యాహ్నం దాకా మేకపోతుగాంభీర్యం ప్రదర్శించారు. ‘‘మీరు కావాలనుకుంటే బీజేపీతో కలవండి. శివసేన మాతోనే ఉంటుంది. మేం పార్టీని పునర్నిర్మించుకుంటాం’’ అని ఒక టీవీచానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెబెల్‌ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. ఉద్ధవ్‌ ఠాక్రేనే సీఎంగా ఉంటారా? అనే ప్రశ్నకు.. ‘‘ఎమ్మెల్యేలందరినీ సభకు రమ్మనండి. అప్పుడు చూస్తాం. ఇప్పుడు వెళ్లిపోయిన ఎమ్మెల్యేలందరూ.. మహారాష్ట్రకు తిరిగొచ్చి, ఇక్కడ తిరగడం ఎంత కష్టమో తెలుసుకుంటారు’’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పార్టీ, రాష్ట్రం ఉద్ధవ్‌ ఠాక్రేతోనే ఉన్నాయని, కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయినంతమాత్రాన పార్టీ పని అయిపోయినట్టు కాదని పేర్కొన్నారు. బాల్‌ఠాక్రే హయాంలో కూడా చాలా మంది పార్టీని వీడి వెళ్లారని.. అప్పుడు కూడా తాము పార్టీని పునర్నిర్మించుకుని అధికారంలోకి తీసుకొచ్చామని రౌత్‌ గుర్తు చేశారు.  ‘‘ఇది శివసేన భూమి. బాలాసాహెబ్‌ భూమి. మేం ఫీనిక్స్‌ పక్షిలా మళ్లీ లేస్తాం. పైకెగురుతాం.’’ అని అన్నారు. షిండే శిబిరంలో ఉన్న 20 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని మరో సందర్భంలో చెప్పారు. ఇన్ని మాటలు మాట్లాడిన రౌత్‌.. సాయంత్రం 5.30 గంటల సమయంలో పార్టీ తలుపులు తెరిచే ఉన్నాయంటూ ట్వీట్‌ చేయడం గమనార్హం. కాగా.. రెబెల్‌ ఎమ్మెల్యేల డిమాండ్‌ను ఉద్ధవ్‌ ఒప్పుకోబోరని తాము భావిస్తున్నట్టు కాంగ్రెస్‌ నేత పృథ్వీరాజ్‌ చవాన్‌ పేర్కొన్నారు. శివసేన ఎమ్మెల్యే సంజయ్‌ శిర్సత్‌ తాజాగా ఉద్ధవ్‌ ఠాక్రేకు ఒక లేఖ రాశారు.  ఠాక్రే చుట్టూ ఉన్న కోటరీ.. పార్టీ ఎమ్మెల్యేలు సీఎం అధికారిక నివాసానికి వెళ్లకుండా ఈ రెండున్నర సంవత్సరాలుగా అడ్డుకోవడమే ఈ సమస్యకు కారణమని వివరించారు.


13 మంది ఎమ్మెల్యేలే..

ఉద్ధవ్‌ ఠాక్రే గురువారం నిర్వహించిన పార్టీ సమావేశానికి కేవలం 13 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరైనట్టు సమాచారం. ఈ నేపథ్యంలో చివరి ప్రయత్నంగా శివసేన వ్యూహాత్మకంగా 12 మంది రెబెల్‌ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ డిప్యూటీ స్పీకర్‌ను కోరింది. అంతకన్నా ఎక్కువ మందిని అనర్హులను చేస్తే సంఖ్యాబలం బీజేపీకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ మార్గాన్ని ఎంచుకున్నట్టు తెలిసింది. పదిహేను మందిపై అనర్హత వేటు వేస్తే మిగతావారిలో భయం పెరిగి దారికి వస్తారనే అంచనాలు ఎంవీయే వర్గాలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే.. అనర్హత నోటీసులు ఇవ్వడం ద్వారా ఎవరిని భయపెట్టాలనుకుంటున్నారని ఏక్‌నాథ్‌ షిండే ప్రశ్నించారు. ఇక.. సభలో శివసేన శాసనసభాపక్ష నేతగా ఏక్‌నాథ్‌ షిండే స్థానంలో అజయ్‌చౌధురీని నియమిస్తున్నట్టు ఆపార్టీ  లేఖను ఆమోదించానని నరహరి జిర్వాల్‌ ప్రకటించారు. డిప్యూటీ స్పీకర్‌ కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న నేపథ్యంలో జరగబోయే పరిణామాలపై అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Updated Date - 2022-06-24T07:18:38+05:30 IST