బిల్లులు రావడం లేదని రాజీనామాలకు సిద్ధపడిన సర్పంచులు

ABN , First Publish Date - 2022-05-18T06:21:47+05:30 IST

ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసినా బిల్లులు రాకపోవడంతో సర్పంచ్‌లు రాజీనామాలకు సిద్దపడ్డారు.

బిల్లులు రావడం లేదని రాజీనామాలకు సిద్ధపడిన సర్పంచులు
సమావేశంలో మాట్లాడుతున్న సర్పంచులు

  - 20లోపు చెల్లిస్తేనే పల్లెప్రగతిలో పాల్గొంటాం

- అప్పులు చేసి పనులు చేశాం... కనీస గౌరవం దక్కడం లేదు

ఇల్లంతకుంట, మే 17: ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసినా బిల్లులు రాకపోవడంతో సర్పంచ్‌లు రాజీనామాలకు సిద్దపడ్డారు. మండలపరిషత్‌ కార్యాలయంలో మంగళవారం సమావేశం అయిన సర్పంచ్‌లు పలు అంశాలపై వివరించారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్‌ల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ఎక్కువ వడ్డీకి తెచ్చి పనులు చేసినా బిల్లులు రాక నెలలు గడిచిపోతుందన్నారు. భూములు అమ్ముకుంటూ కొంతమంది సర్పంచ్‌లు నెట్టుకువస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదన్నారు. తమ పరిస్థితిని అర్థం చేసుకోవాలని కోరారు. ఈ నెల 20 లోపు పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని లేనట్లయితే సర్పంచ్‌లు అందరం మూకుమ్మడిగా రాజీనామా చేస్తామన్నారు. పల్లెప్రగతిలో క్రీయాశీలకంగా వ్యవహరించాలని చెప్పుతున్న వారు బిల్లులు జాప్యం అయినా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మొత్తం బిల్లులు వస్తేనే పల్లెప్రగతిలో పాల్గొంటామన్నారు. సర్పంచ్‌లకు కనీస గౌరవం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు చల్ల నారాయణ, సర్పంచ్‌లు గట్ల మల్లారెడ్డి, ముస్కు మల్లయ్య, బిల్లవేని పర్శరాం, చింతలపెల్లి తిరుపతిరెడ్డి, బిల్లవేని పర్శరాం, అనసూయనర్సింహ్మరెడ్డి, లక్ష్మీఅంజయ్య, మల్లవ్వమల్లయ్య, బాగ్యలక్ష్బిబాలరాజు, సుశీలలింగయ్య, అనసూయచంద్రారెడ్డి, లక్ష్మీస్వామి, రజిత, శ్రీలతనరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 


Updated Date - 2022-05-18T06:21:47+05:30 IST