అసలైన ఉద్యమకారులు రోడ్డు పాలయ్యారు..

ABN , First Publish Date - 2021-03-07T05:09:03+05:30 IST

సీఎం కేసీఆర్‌ పక్కన ప్రస్తుతమున్నది ఉద్యమ ద్రోహులేనని, అసలైన ఉద్యమకారులు రోడ్డు పాలయ్యారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు.

అసలైన ఉద్యమకారులు రోడ్డు పాలయ్యారు..

టీఆర్‌ఎస్‌ పాలనపై ప్రజల్లో అసంతృప్తి
బీజేపీ నేత, కేంద్ర హోం సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి


మట్టెవాడ, మార్చి 6: సీఎం కేసీఆర్‌ పక్కన ప్రస్తుతమున్నది ఉద్యమ ద్రోహులేనని, అసలైన ఉద్యమకారులు రోడ్డు పాలయ్యారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కిషన్‌రెడ్డి శనివారం వరంగల్‌కు వచ్చారు. హన్మకొండ స్నేహనగర్‌లోని ఎస్‌వీ కన్వెన్షన్‌ హాల్‌లో జరిగిన వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గ పట్టభద్రుల సమ్మేళనంలో కిషన్‌ రెడ్డి మాట్లాడారు.

తెలంగాణ  ఉద్యమకారులు రోడ్డున పడ్డారని, ఉద్యమద్రోహులు మంత్రి పదవులు అనుభవిస్తున్నారని అన్నారు. తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే ప్రభుత్వం రావాలని, అది ఒక్క బీజేపీతోనే సాధ్యమని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. ఉద్యోగాల నియామకాలు ఏవని ప్రశ్నించారు. ఓవైసీ కుటుంబంలో మాత్రం అందరికీ ఉద్యోగాలు వచ్చాయన్నారు. టీఆర్‌ఎస్‌ రూ.1000 కోట్లు ఖర్చు పెట్టి హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలవాలని చూసిందని, కానీ ప్రజలు బీజేపీకే ఓటు వేశారన్నారు.  

పరిశ్రమల స్థాపనకు తెలంగాణ ప్రభుత్వం భూములను ఇవ్వడం లేదన్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభానికి సిద్ధంగా ఉందన్నారు. వరంగల్‌ కేఎంసీ ఆవరణలోని కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ ఆస్పత్రికి తెలంగాణ ప్రభుత్వం తన వంతుగా రూ.30కోట్లు ఇవ్వకుండా జాప్యం చేస్తోందని ఆరోపించారు. ఆయుష్మాన్‌ పథకాన్ని కూడా తెలంగాణలో అమలు చేయడం లేదన్నారు. కేంద్రంపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తోందన్నారు. తెలంగాణకు, వరంగల్‌ అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం ఏమీ చేయలేదన్న టీఆర్‌ఎస్‌ విమర్శలను తిప్పికొట్టారు. రూ.17వేల కోట్లతో జాతీయ రహదారులను అభివృద్ధి  చేస్తున్నామని గుర్తుచేశారు. రూ.700కోట్లతో హైవేలను అభివృద్ధి చేసిందని చెప్పారు. హృదయ్‌, అమృత్‌ పథకాలతో వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో అభివృద్ధి జరిగిందని మంత్రి కిషన్‌ రెడ్డి వివరించారు.  మామునూరు ఎయిర్‌పోర్టుకు స్థలమిస్తే వెంటనే పనులు ప్రారంభిస్తామన్నారు. రూ.500కోట్లతో వరంగల్‌లో రింగ్‌ రోడ్డు నిర్మాణాన్ని మోదీ ప్రభుత్వమే చేసిందని అన్నారు. కాజీపేటలో రైల్వేవ్యాగన్‌ పరిశ్రమను 2016లో కేంద్రం మంజూరు చేసిందని, వెయ్యిమందికి ప్రత్యక్షంగా 2500 మందికి పరోక్షంగా ఉపాధి కల్పించే ఈ పరిశ్రమకు అవసరమైన భూమిని రాష్ట్రప్రభుత్వం ఇవ్వకుండా జాప్యం చేసిందని విమర్శించారు. వివిధ పథకాల కింద జిల్లాకు ఇచ్చిన నిధులను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దారి మళ్లించిందని, పైగా తన వంతు వాటాగా ఇవ్వాల్సిన నిధులను సైతం ఎగ్గొట్టిందన్నారు. వరంగల్‌లో  21 బస్తీ దవాఖాలను మంజూరు చేస్తే అందులో ఏ ఒక్కటి కూడా పని చేయడం లేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డిని పట్టభద్రులు గెలిపించాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో ఇంకా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు విజయరామారావు, మార్తినేని ధర్మారావు, ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి, అర్బన్‌ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-03-07T05:09:03+05:30 IST