‘రియల్‌’ దందా

ABN , First Publish Date - 2022-08-18T06:02:17+05:30 IST

ఆనందపురం మర్రిచెరువు గట్టుపై ‘రియల్‌’ వ్యాపారులు పట్టు బిగిస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి ఎక్స్‌కవేటర్‌ సహాయంతో చెరువు గట్టును చదును చేసి రహదారిగా మార్చేశారు. తొమ్మిది నెలల క్రితం ఇదే గట్టుపై రోడ్డు నిర్మాణ ప్రయత్నాలు జరిగాయి. స్థానికుల ఫిర్యాదు మేరకు పత్రికలు ఆ విషయాన్ని వెలుగులోకి తేవడంతో అప్పటి తహసీల్దార్‌ వేణుగోపాలరావు పనులు అడ్డుకుని హెచ్చరిక బోర్డు కూడా ఏర్పాటుచేశారు.

‘రియల్‌’ దందా
చెరువు గట్టును రోడ్డుగా మారుస్తున్న దృశ్యం

మర్రిచెరువు గట్టుపై మళ్లీ రోడ్డు నిర్మాణం

గతంలో నిర్మాణ ప్రయత్నాన్ని అడ్డుకున్న అప్పటి తహసీల్దార్‌

ఆయన బదిలీ కావడంతో మరో యత్నం

జలవనరుల శాఖ అనుమతులున్నాయంటున్న అక్రమార్కులు

అలా అయితే పంచాయతీ కార్యాలయంలో ఉత్తర్వులేవంటున్న రైతులు

మండల ప్రజాప్రతినిధుల ఒత్తిడి మేరకే అడ్డగోలు వ్యవహారమని విమర్శలు


ఆనందపురం, ఆగస్టు 17:

ఆనందపురం మర్రిచెరువు గట్టుపై ‘రియల్‌’ వ్యాపారులు పట్టు బిగిస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి ఎక్స్‌కవేటర్‌ సహాయంతో చెరువు గట్టును చదును చేసి రహదారిగా మార్చేశారు. తొమ్మిది నెలల క్రితం ఇదే గట్టుపై రోడ్డు నిర్మాణ ప్రయత్నాలు జరిగాయి. స్థానికుల ఫిర్యాదు మేరకు పత్రికలు ఆ విషయాన్ని వెలుగులోకి తేవడంతో అప్పటి తహసీల్దార్‌ వేణుగోపాలరావు పనులు అడ్డుకుని హెచ్చరిక బోర్డు కూడా ఏర్పాటుచేశారు. సదరు తహసీల్దార్‌ ఇటీవల భీమిలికి బదిలీ అయ్యారు. ఇదే అదనుగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు స్థానిక నాయకుల అండతో మళ్లీ చెరువు గట్టుపై రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించారు. గతంలో లక్షల రూపాయలు వెచ్చించి ఈ చెరువు గట్లను పనికి ఆహార పథకంలో పటిష్ఠం చేశారు. వర్షాకాలంలో చెరువు నిండుకుండలా మారి వందలాది ఎకరాలకు సాగు నీరందిస్తుంది. అటువంటి చెరువు గట్టును రోడ్డుగా మారిస్తే గట్టు ఎత్తు తగ్గి నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువు గట్టు వెడల్పు కనీసం పదిహేను అడుగుల కూడా ఉండదు. ఇప్పుడు గట్టు తలను నరికి రోడ్డు నిర్మిస్తే తదుపరి పూడిక తీసి మట్టి వేయాలంటే వీలుపడదు. అటువంటప్పుడు గతంలో నిలిపివేసిన రోడ్డు నిర్మాణాన్ని తాజాగా ఎలా ప్రారంభించారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అయితే మండల ప్రజా పరిషత్‌ నిఽధులతో రోడ్డు వేసేందుకు ఇంజనీరింగ్‌ అధికారులు అనుమతి ఇచ్చినట్టు పనులు చేస్తున్నవారు చెబుతున్నారు. కానీ ఇంజనీరింగ్‌ అధికారులు అనుమతి ఇచ్చినట్టుగా చెబుతున్న పత్రాలకు, చేస్తున్న పనికిపొంతన లేదని రైతులంటున్నారు. మండల ప్రజా ప్రతినిధుల ఒత్తిడే ఇందుకు కారణమని తెలుస్తోంది. నిజంగా జలవనరుల శాఖ అనుమతిస్తే ఆ శాఖ అధికారుల పర్యవేక్షణలో రోడ్డు వేయాలి. అలాగే అనుమతి పత్రాలు స్థానిక పంచాయతీ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంచాలి. కానీ అటువంటివి ఏవీ పంచాయతీ కార్యాలయం నోటీసు బోర్డులో కనిపించలేదు. దీంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల ఒత్తిడి వల్లే రోడ్డు నిర్మాణం జరుగుతోంది తప్ప, ప్రజా ప్రయోజనార్థం కాదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా రెవెన్యూ, జల వనరుల శాఖ  అధికారులు తగిన చర్యలు తీసుకుని చెరువు గట్టు కబ్జాకు గురికాకుండా కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయాన్ని తహసీల్దార్‌ రామారావు వద్ద ప్రస్తావించగా ఇరిగేషన్‌ శాఖ అనుమతి పొంది పనులు చేపడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, వాస్తవాలు పరిశీలిస్తానని తెలిపారు.  


Updated Date - 2022-08-18T06:02:17+05:30 IST