మందగించిన రియల్‌ దందా

ABN , First Publish Date - 2022-05-26T05:33:16+05:30 IST

మందగించిన రియల్‌ దందా

మందగించిన రియల్‌ దందా

 నాన్‌ లేఅవుట్‌ రిజిస్ట్రేషన్‌లకు చెక్‌

సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం కొరడా

మూడు రోజులుగా శాఖకు తగ్గిన ఆదాయం

హనుమకొండ టౌన్‌, మే 25: రియల్‌ ఎస్టేట్‌ దందాకు సుప్రీంకోర్టు షాక్‌ ఇచ్చింది. నాన్‌ లేఅవుట్‌ ప్లాట్ల రిజిస్ట్రేషన్‌లు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో నాలుగు రోజులుగా రిజిస్ట్రేషన్‌లు భారీగా తగ్గాయి. రిజిస్ట్రేషన్‌ శాఖకు పెద్దఎత్తున ఆదాయం తగ్గింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో అటు రియల్టర్లు ఇటు ప్లాట్లు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేసుకునే దశలో ఉన్నవారు ఆందోళన చెందుతున్నారు. 

వ్యక్తిగత అనుమతులతో..

26 ఆగష్టు 2020న రాష్ట్రప్రభుత్వం నాన్‌ లేఅవుట్‌ ప్లాట్లు, పార్ట్‌ రిజిస్ట్రేషన్‌లు చేయకూడదని సర్క్యూలర్‌ జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రియల్టర్లు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు వ్యక్తిగత అనుమతులు ఇస్తూ రిజిస్ట్రేషన్‌లు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఇచ్చిన అవకాశంతో రియల్టర్లు యేడాదిన్నరగా యథేచ్ఛగా రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. కోర్టు ఖర్చులు విక్రయదారులకు అంటగడుతూ కోట్ల రూపాయల వ్యాపారం కొనసాగిస్తున్నారు. అయితే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో నాన్‌ లేఅవుట్‌లకు హైకోర్టు వ్యక్తిగత అనుమతులు ఇచ్చిన ఆదేశాలపై ఈనెల 18న సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిన స్టేను నెట్‌లో పెట్టారు. శాఖకు అధికారిక ఉత్తర్వులు రాకపోవడంతో ఈనెల 21వరకు హైకోర్టు ఇచ్చిన అనుమతులతో రిజిస్ట్రేషన్‌లు కొనసాగించినట్లు తెలిసింది. సుప్రీంకోర్టు ఆదేశాలను రిజిస్ట్రేషన్‌ శాఖ అమలు చేయడం లేదని ఆరోపణలు రావడంతో శాఖ ఉన్నతాధికారులు అప్రమత్తమై సుప్రీంకోర్టు ఆదేశాలు అమలయ్యేలా చర్యలు తీసుకున్నారు. మూడు రోజులుగా సుప్రీంకోర్టు ఆదేశాలను జిల్లా రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు అమలు చేస్తున్నారు. 

తగ్గిన ఆదాయం

రిజిస్ట్రేషన్‌లు నిలిచిపోవడంతో శాఖ ఆదాయానికి గండి పడింది. భారీగా ఆస్తుల క్రయవిక్రయాలు తగ్గాయి. హనుమకొండ జిల్లా రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో ఈనెల 16న 101 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌లు కాగా, రూ.23లక్షల 34వేలు ఆదాయం వచ్చింది. 17న 102 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌లు కాగా, రూ.25లక్షల 32వేలు, 18న 112 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌లు కాగా, రూ.24లక్షల 32వేలు, 19న 96 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌లు కాగా, రూ.26లక్షల 23వేలు, 20న 109 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌లు కాగా, రూ.34లక్షల 65వేలు, 21న 111 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌లు కాగా, రూ.34లక్షల 36వేలు శాఖకు రెవెన్యూ వచ్చింది. 

ఈ మూడు రోజుల్లో 23న 50 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌లు కాగా, 12లక్షల 35వేలు, 24న 77 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌లు కాగా, రూ.23లక్షల 34వేలు, 25న 126 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌లు కాగా, రూ.32లక్షల 63వేల రెవెన్యూ వచ్చింది. బుధవా రం మంచి రోజు కావడంతో లేఅవుట్‌ ప్లాట్లతో పాటు లింక్‌ టూ లింక్‌ (గతంలో రిజిస్ట్రేషన్‌ అయిన డాక్యుమెంట్‌లు), మార్టిగేజ్‌లు జరిగినట్లు అధికారులు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలు కొనసాగినట్లు అయితే రియల్‌ దందా పడకేసే అవకాశం ఉంది. నగర సమీపంలో పెద్ద ఎత్తున చేసిన నాన్‌ లేఅవుట్‌ వెంచర్ల ప్లాట్లు విక్రయించే పరిస్థితి ఉండదు. కోట్ల రూపాయలు వెచ్చించి దందా చేస్తున్న రియల్టర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.

Updated Date - 2022-05-26T05:33:16+05:30 IST