రియల్‌ దోపిడీ

ABN , First Publish Date - 2022-05-17T05:14:50+05:30 IST

అక్రమ లేఅవుట్లు.. అందులో నిబంధనలు ఉండవు.. వాటి గురించి పట్టించుకునే వారే లేరు.. ఆదాయానికి గండి పడుతున్నా స్పందించని అధికారులు.. కొనుగోలుదారులు మోసపోతున్నా ఆలకించిన యంత్రాంగం.. ఇదీ వినుకొండలో ఇటీవల చోటుచేసుకుంటున్న రియల్‌ దోపిడీ.

రియల్‌ దోపిడీ
వినుకొండ సమీపంలో అక్రమ వెంచర్లు

రియాల్టర్లకు రాజకీయ అండ

పుట్టగొడుగుల్లా అక్రమ వెంచర్లు 

నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్లు

మున్సిపల్‌, పంచాయతీల ఆదాయానికి గండి 

ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు లభించక లబోదిబో


వినుకొండ, మే 16: అక్రమ లేఅవుట్లు.. అందులో నిబంధనలు ఉండవు.. వాటి గురించి పట్టించుకునే వారే లేరు.. ఆదాయానికి గండి పడుతున్నా స్పందించని అధికారులు.. కొనుగోలుదారులు మోసపోతున్నా ఆలకించిన యంత్రాంగం.. ఇదీ వినుకొండలో ఇటీవల చోటుచేసుకుంటున్న రియల్‌ దోపిడీ. వినుకొండలో పొలిటికల్‌ రియల్‌ఎస్టేట్‌ రాజ్యమేలుతుంది. అధికార పార్టీ అండదండలతో రియల్‌ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమ వెంచర్లు వేస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు. తక్కువ ధరకే రైతుల వద్ద నుంచి భూములు కొనుగోలు చేసి ఎటువంటి నిబంధనలు తీసుకోకుండా వెంచర్లు వేస్తున్నారు. ఈ వెంచర్లలో భూమిని చదును చేయడం, రోడ్లు వేసి ప్లాట్లుగా మార్చి విక్రయించేస్తున్నారు. అయితే వీటికి ప్లాన్‌, లేఔట్‌ అఫ్రూవల్‌, భూమి స్వభావ మార్పు అనుమతులు ఉండవు. అయినా విక్రయించి భారీగా అక్రమార్జన చేసుకుంటున్నారు. అనధికార వెంచర్ల ద్వారా రూ.కోట్లు దోచుకుంటున్నారు. రాజకీయ నాయకులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు సైతం వ్యవసాయ భూములను కొనుగోలు చేసి ఇళ్ల ప్లాట్లుగా మార్చి ప్రజలను నమ్మించి స్థలాలను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చి వెంచర్లు వేసి సెంట్ల ప్రకారం భూములను విక్రయిస్తున్నారు. వినుకొండలో భూముల ధరలు ఆకాశానికి అంటడంతో సామాన్యుడు స్థలం కొనుగోలు చేసి సొంతింటి కలను సాకారం చేసుకునే పరిస్థితి మచ్చుకైనా కనపడటం లేదు. పట్టణ పరిధిలోని కారంపూడి రోడ్డులో ఆరు నెలల క్రితం వరకు సెంటు రూ.8 లక్షలు ఉండగా ప్రస్తుతం రూ.20 లక్షలకు పైగా చేరింది. భూముల ధరలకు రెక్కలతో పట్టణానికి పట్టణానికి నలువైపులా ఉన్న వెల్లటూరురోడ్డు, కారంపూడిరోడ్డు, ఏనుగుపాలెంరోడ్డు, నరసరావుపేటరోడ్లల్లో వెంచర్లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. అంతేగాకుండా పట్టణానికి 10 కిలోమీటర్ల లోపు ఉన్న గ్రామాల వరకు అక్రమ వెంచర్లు విపరీతంగా వెలిశాయి. పట్టణంతో పాటు సమీపంలో గల బ్రాహ్మణపల్లి, నరగాయపాలెం, చాట్రగడ్డపాడు, చీకటీగలపాలెం, విఠంరాజుపల్లి, కనమర్లపూడి, వెంకుపాలెం, ఉప్పరపాలెం, కోటప్పనగర్‌ తదితర గ్రామాల పరిధిలో సుమారు 150కు పైగా అక్రమ వెంచర్లు వెలిశాయి. సాధారణంగా ఏదైనా వ్యవసాయ భూమిని నివాస యోగ్యంగా మార్చేందుకు రెవెన్యూ శాఖ నుంచి ల్యాండ్‌ కన్వర్షన్‌కు అనుమతి తీసుకోవాలి. అధికార లేఔట్లల్లో ఎకరానికి 10 శాతం స్థలాన్ని మౌలిక వసతుల కల్పనకు మున్సిపాలిటీ, పంచాయతీలకు అప్పగించాలి. మరో 5 శాతం బడుగు, బలహీన వర్గాలకి కేటాయించాలి. అయితే ఈ నిబంధనలు ఎక్కడా పాటించకుండానే ఇష్టం వచ్చినట్లు వెంచర్లు వేస్తున్నారు. వీరికి రాజకీయ అండ ఉండటంతో అధికారులు అటువైపు కన్నెత్తి చూడటంలేదు. ఈ వెంచర్లకు నిబంధనల ప్రకారం అనుమతులు తీసుకుంటే వాటి పరిధిలోని మున్సిపాలిటీ లేదంటే పంచాయతీకి భారీగా ఆదాయం సమకూరుతుంది. అయితే వినుకొండ ప్రాంతంలోని వెంచర్లకు అలాంటి అనుమతులు లేక పోవడంతో స్థానిక సంస్థల ఆదాయానికి భారీగా గండిపడుతుంది. వినుకొండ పట్టణం, శివారుల్లో వేసిన వెంచర్లల్లో అధిక శాతం అనుమతులు లేకపోవడం వల్ల కొనుగోలు దారులు ఇళ్ల నిర్మాణ అనుమతులకు ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్‌, పంచాయతీల నుంచి అనుమతులు రావడంలేదు. దీంతో తాము మోసపోయామని కొనుగోలుదారులు లబోదిబోమంటున్నారు.

 

Updated Date - 2022-05-17T05:14:50+05:30 IST