అసలైన విద్య

ABN , First Publish Date - 2022-07-29T07:45:32+05:30 IST

చైనాలో ఎందరికో విలువిద్యను నేర్పిన గురువు వైఫీ. ఆయన శిష్యుల్లో ఒకరు చి ఛాంగ్‌.

అసలైన విద్య

చైనాలో ఎందరికో విలువిద్యను నేర్పిన గురువు వైఫీ. ఆయన శిష్యుల్లో ఒకరు చి ఛాంగ్‌. అతను గురువు దగ్గర విలువిద్యలో అన్ని మెళకువలనూ నేర్చుకున్నాడు. దేశంలోనే అత్యుత్తమ విలుకానిగా గుర్తింపు పొందాలన్నది అతని ఆశయం. కానీ గురువు జీవించి ఉన్నంతవరకూ తన ఆశయం నెరవేరదనుకున్నాడు. గురువును చంపాలనుకున్నాడు. 


ఒక రోజు చేలలో దూరంగా నడిచి వస్తున్న గురువు మీదకు చి ఛాంగ్‌ బాణం ఎక్కుపెట్టి వదిలాడు. అతని ఉద్దేశాన్ని కనిపెట్టిన గురువు... పొదలోని ఒక కాడను తుంచి, తనవైపు దూసుకొస్తున్న బాణం మీదకు విసిరాడు. బాణం నేలకొరిగింది.

అవమానభారంతో తలదించుకున్న చి ఛాంగ్‌ దగ్గరకు గురువు వెళ్ళి, భుజం తట్టి, ‘‘నీకు తెలిసిన విలువిద్య ఇంకా పైపైదే. అందులోని లోతులకు వెళ్ళాలంటే... అదిగో ఆ కొండమీద గుహలో క్యానింగ్‌ అనే ఆయన ఉంటాడు. ఆయనను ఆశ్రయించు’’ అని చెప్పాడు.


మరొక్క మాట మాట్లాడకుండా ఆ కొండవైపు నడక సాగించాడు ఛి ఛాంగ్‌. అతను గుహను సమీపిస్తూండగా... క్యానింగ్‌ బయటకు వచ్చాడు.

‘‘గురువర్యా! విలువిద్యలో నేను నేర్చుకున్నదాన్ని చూడండి’’ అంటూ, ఒకే ఒక బాణంతో... ఆకాశంలో ఎగురుతున్న అయిదు పక్షులను పడగొట్టాడు చి ఛాంగ్‌.


అత్యంత వృద్ధుడైన క్యానింగ్‌ అతణ్ణి చూసి నవ్వి, ‘‘ఈ మాత్రం దానికి విల్లు, అమ్ము కావాలా? అదిగో... పైకి చూడు. పక్షి ఎంత ఎత్తులో ఎగురుతోందో గమనించు’’ అన్నాడు.

అటువైపు చూసిన చి ఛాంగ్‌కు ఎంతో ఎత్తులో ఎగురుతున్న ఒక పక్షి చిన్నగా కనబడింది. 

క్యానింగ్‌ కొద్ది క్షణాలు కళ్ళు మూసుకొని, తెరిచి, ఆ పక్షిని తీవ్రంగా చూశాడు. తీక్షణమైన ఆ చూపే పదునైన బాణమై ఆ పక్షికి తగిలింది. అంతే! అది ఒక్కసారిగా వాళ్ళ ముందు కూలిపోయింది.


క్యానింగ్‌ నెమ్మదిగా తన గుహ వైపు నడిచి వెళ్ళాడు. చి ఛాంగ్‌ మౌనంగా ఆయనను అనుసరించాడు. తొమ్మిది సంవత్సరాలు ఆ గుహలోనే క్యానింగ్‌కు శుశ్రూష చేస్తూ గడిపాడు. ఆయన ఏమి బోధించాడో కానీ, పదో సంవత్సరంలో ఆ గుహలోంచి బయటకు వచ్చిన చి ఛాంగ్‌లో ఊహించలేని మార్పు స్పష్టంగా కనిపించింది. పూర్వపు అహంకారం మటుమాయమైంది. అంతకుముందు అతనికి ఉన్న ఆశలు, ఆశయాలు అదృశ్యమయ్యాయి. తనతో తెచ్చుకున్న విల్లమ్ముల జాడే లేదు. 


ప్రశాంతంగా నడిచి వెళుతున్న చి ఛాంగ్‌ను మధ్యలో అతని పాత గురువు వైఫీ కలిశాడు. దివ్య తేజస్సుతో వెలుగుతున్న చి ఛాంగ్‌తో ‘‘నీవు విలువిద్యలో సాటిలేని వీరుడవని ఇప్పుడు నేను గ్రహిస్తున్నాను. నీ కాళ్ళకు మొక్కే అర్హత కూడా నాకు లేదు’’ అన్నాడు.


ఆ ప్రశంసను చి ఛాంగ్‌ ఏమాత్రం పట్టించుకోకుండా తన సొంత నగరానికి వెళ్ళాడు. ఆ నగరవాసులు అతణ్ణి ఘనంగా ఆహ్వానించారు. విలువిద్యలో ప్రావీణ్యాన్ని ప్రదర్శించవలసిందిగా కోరుతూ, అతని ముందు ధనుస్సును, బాణాలను ఉంచారు. 


అయితే వారు ఉహించినట్టు అతను విలువిద్యలో తన ప్రతిభను ప్రదర్శించడం మాట అటుంచి, ధనుర్బాణాలను చూసి, ‘‘మిత్రులారా! వీటిని ఎప్పుడో చూసినట్టుంది. వీటిని ఏమని పిలుస్తారు? ఎందుకు వినియోగిస్తారు?’’ అని ప్రశ్నించి, అందరినీ తీవ్ర ఆశ్చర్యానికి గురిచేశాడు. 


చి ఛాంగ్‌లో ఉన్న ఏకాగ్రతనూ, దృఢ సంకల్పాన్నీ గమనించినన క్యానింగ్‌... బయటి లక్ష్యాన్ని గురి చూసి కొట్టే విలువిద్య కన్నా శ్రేష్టమైన, విలువైన విద్యను... అంతరంగంలోని అహంకారం, వ్యామోహం లాంటి శత్రువుల్ని ఛేదించే విద్య నేర్పాడు. అతనిలో ఆ మౌనానికీ, శాంతానికీ, వర్చస్సుకూ ఆ విద్యే కారణం.. ఎవరైనా నైపుణ్యం సాధించవలసింది ఆ విద్యలోనే! అదే అసలైన విద్య.

రాచమడుగు శ్రీనివాసులు


Updated Date - 2022-07-29T07:45:32+05:30 IST