‘మూడు రాజధానుల’తో అంతా తలకిందులు.. ఒకనాడు గజం 40 వేలుపైమాటే.. ఇప్పుడదే..

ABN , First Publish Date - 2020-12-17T06:10:37+05:30 IST

రాష్ట్రంలో అధికార మార్పిడి.. అమరావతి నిర్మాణ పను ల నిలిపివేత.. రాజధాని తరలింపు.. వంటి పరిణా మాలతో భూముల విలువ గణనీయంగా పడిపోయింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు గజం రూ.50 వేలు, రూ.లక్ష వంతున పలికిన భూ ములు నేడు మార్కెట్‌ లేక సగం ధరలకు కూడా కొరగాకుండా ఉన్నాయి.

‘మూడు రాజధానుల’తో అంతా తలకిందులు.. ఒకనాడు గజం 40 వేలుపైమాటే.. ఇప్పుడదే..

రియల్‌పై.. మూడు రాజధానుల దెబ్బ

అధికార మార్పిడితో కుదుపు

రాజధానుల ప్రకటనతో కుదేలు

ఒకనాడు గజం 40 వేలుపైమాటే

ఇప్పుడదే గజం ధర రూ.10 వేలు


అమరావతి ప్రాంతంలో గజం స్థలం గరిష్ఠంగా రూ.40వేలు ఉంటే, కనిష్ఠంగా రూ 15వేలు. మూడు రాజధానుల ప్రకటనతో అంతా తలకిందులైంది. రాజధాని పనులు ఆగిపో యాయి. తరలింపునకు ప్రభుత్వం తొందర పడుతుండ టంతో నాటి కనిష్ఠం కన్నా పతనమై రూ.14 వేలకు చేరింది. అయినా ఏడాదిన్నరగా బేరాలే లేవు. భూములను అడిగేవారుగానీ, కొనేవారుగానీ లేరని చరాస్థి వ్యాపారులు వాపోతున్నారు. రాజధాని అమరావతి ప్రాంత భూములకు మార్కెట్‌ లేకుండా చేయాలన్న లక్ష్యాన్ని పాలక ప్రభుత్వం విజయవంతంగా సాధించింది. దీంతో రాజధానినే నమ్ముకొన్న ఎన్నో జీవితాలు తల్లకిందులైపోగా, మరెన్నో కుటుంబాలు ఆర్థికంగా కూలిపోయాయి.


(మంగళగిరి): రాష్ట్రంలో అధికార మార్పిడి.. అమరావతి నిర్మాణ పను ల నిలిపివేత.. రాజధాని తరలింపు.. వంటి పరిణా మాలతో భూముల విలువ గణనీయంగా పడిపోయింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు గజం రూ.50 వేలు, రూ.లక్ష వంతున పలికిన భూ ములు నేడు మార్కెట్‌ లేక సగం ధరలకు కూడా కొరగాకుండా ఉన్నాయి. రాజధానిని నమ్ముకుని భారీ ఎత్తున అపార్టుమెంట్‌ల నిర్మాణాన్ని చేపట్టిన బిల్డర్లు నిండా మునిగిపోయారు. రాజధాని రాకతో ఇక్కడి భూములకు విపరీతమైన డిమాండ్‌ వచ్చింది. అమ్మకాలు...కొనుగోళ్లతో మంగళగిరి, తాడికొండ సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయాలు రద్దీగా నడుస్తుండేవి. రిజిస్ట్రేషన్ల ఒత్తిడిని తట్టుకునేందుకు అప్పటి ప్రభుత్వం అదనంగా తుళ్లూరు, మందడం, అనంతవరం, ఉండవల్లి ప్రాంతాల్లో కూడా కొత్తగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలను ఏర్పాటు చేసి, అమరావతికి ప్రత్యేకంగా ఓ డిస్ట్రిక్ట్‌ రిజిస్ట్రార్‌ను సైతం నియమించింది. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చీ రావడంతోనే అమరావతి భూ ములే తొలి టార్గెట్‌ అయ్యాయి. ఈ భూముల మార్కెట్‌ను రాజధాని మా ర్పు పేరుతో కుప్పకూల్చివేసింది. అమరావతిలో అలా కూలిన భూముల మా ర్కెట్‌ మళ్లీ ఇంతవరకూ కోలుకోనేలేదు. కొత్తగా పెట్టిన సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలను ఎత్తివేయాల్సి వచ్చిందంటే ఆ పతనం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతానికి రాజధాని అమరావతి ఏరియాలో భూముల ధర లను చూస్తే గజం గరిష్ఠంగా రూ.14 వేలు, కనిష్ఠంగా రూ.6వేలు ఉన్నాయి.


భూమ్‌.. భూమ్‌..

రాజధాని ప్రకటన తరువాత విజయవాడ-గుంటూరు నగరాల మధ్య, పాత అమరావతి- తెనాలి పట్టణాల మధ్య ప్రాంతంలో రియల్‌ ఎస్టేట్‌ బాగా ఊపందుకుంది. భూముల అమ్మకాలు, కొనుగోళ్లు అత్యధికశాతం రాజధాని గ్రామాలలోనే జరిగినా.. తెనాలి వరకు కూడా భూముల ధరలు మునుపెన్నడూ లేనంత గరిష్ఠస్థాయికి చేరాయి. దుగ్గిరాల పరిసర ప్రాంతాలలో నవ్యాంధ్ర ఏర్పాటుకు ముందు ఎకరం రూ.10 లక్షలు చేసిన భూములు రూ.35 లక్షలను దాటిపోయాయి. కనకదుర్గ వారధి నుంచి నాగార్జున యూనివర్సిటీ వరకు హైవే వెంబడి భూముల ధరలు రూ.కోట్లు పలికాయి. వారధి నుంచి కుంచనపల్లి వరకు హైవే వెంబడి వున్న భూములు.. ఎకరం ఏకంగా రూ.15 కోట్ల వరకు వెళ్లాయి. మంగళగిరి పట్టణంలో గజం రూ.పదివేలు పలికిన భూములు రాజధాని పనులతో రూ.30 వేలును మించిపోయాయి. ప్రస్తుతం ఈ రేట్లన్నీ కుప్పకూలిపోయాయి. ఈ ప్రాంతాలలో విక్రయదారు రేట్లను తగ్గించేందుకు ఇష్టపడకపోతుండడంతో క్రయవిక్రయాలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఆడపిల్లల పెళ్లిళ్లో...పిల్లల చదువులకో డబ్బు అవసరమైనవారు మాత్రం తక్కువ ధరలపై అమ్ముకొంటున్నారు. రాజధానితో పాటు ఎదగాలనుకొన్న కొందరు నాడు తమ ఆస్తులమ్మి భారీ భవంతులు నిర్మించి అద్దెలకు ఇచ్చారు. ప్రస్తుతం చాలావరకు టూ-లెట్‌ బోర్డులతో ఆ నివాసాలన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు రూ.15 వేలు ఇచ్చిన ఇంటిపై ఇప్పుడు రూ.7 వేలు కూడా అద్దె రావడం లేదని యజమానులు వాపోతున్నారు. 

Updated Date - 2020-12-17T06:10:37+05:30 IST