Hyderabad శివారులో రియల్ దూకుడు.. నాడు కొనుగోలు చేయని ప్లాట్లకే నేడు కోట్ల ధర..

ABN , First Publish Date - 2021-12-03T16:11:00+05:30 IST

హైదరాబాద్‌ మహా నగర శివారు రియల్‌ రంగంలో జెట్‌ స్పీడ్‌తో దూసుకెళ్తోంది...

Hyderabad శివారులో రియల్ దూకుడు.. నాడు కొనుగోలు చేయని ప్లాట్లకే నేడు కోట్ల ధర..

  • చదరపు గజం లక్షల్లోనే..
  • ఈ-వేలంతో పెరిగిన హైదరాబాద్‌ ఇమేజ్‌

హైదరాబాద్‌ మహా నగర శివారు రియల్‌ రంగంలో జెట్‌ స్పీడ్‌తో దూసుకెళ్తోంది. ఉప్పల్‌ భగాయత్‌ ఈ-వేలంలో పలికిన భూముల ధరలు అధికారులను, రియాల్టీ నిపుణులను, డెవలపర్లను ఆశ్చర్యపరుస్తున్నాయి. కొవిడ్‌-19 పరిస్థితుల్లో కూడా నగరంలో రియల్‌ ఎస్టేట్‌ ఏ మాత్రం తగ్గకపోగా.. చదరపు గజం ధర లక్షల్లో పలుకుతుండడం గమనార్హం.


హైదరాబాద్‌ సిటీ : ఉప్పల్‌ భగాయత్‌లో గురువారం నిర్వహించిన ఈ వేలంలో 222చ.గజాల రెసిడెన్షియల్‌ ప్లాట్‌ను చ.గజానికి లక్షా వెయ్యి రూపాయల చొప్పున రూ.2.24 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ ఒక్క ప్లాట్‌నే కాదు.. మరో 368 చదరపు గజాల మరో ప్లాట్‌ను కూడా అదే ధరకు రూ.3.71కోట్లకు దక్కించుకోవడం విశేషం. ఈ వేలంలో చిన్నప్లాట్లను కొనుగోలు చేయడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపారు. అధిక ధరకైనా సరే కొనుగోలు చేసేందుకు పోటీపడ్డారు. అయితే గురువారం ఈ-వేలం వేసిన రెసిడెన్షియల్‌ ప్లాట్లు అన్నీ రెండేళ్ల క్రితం డిసెంబర్‌లో ఎవ్వరూ కొనుగోలు చేయకపోగా, అవే ప్లాట్లకు ప్రస్తుతం కోట్లు పలకడం గమనార్హం.


నాడు మాదాపూర్‌లో.. నేడు ఉప్పల్‌ భగాయత్‌లో..

నాలుగేళ్ల క్రితం హైదరాబాద్‌లో వివిధ ప్రాంతాల్లోని లేఅవుట్లలో మిగిలిన ప్లాట్లను హెచ్‌ఎండీఏ వేలం వేస్తే మాదాపూర్‌లో చదరపు గజం రూ.1.54లక్షలు పలికింది. ఆ సమయంలో అదే రికార్డు. నగర శివారు ప్రాంతాల్లో అయితే చదరపు గజం సగటున 50వేల అటు, ఇటు ఉండగా, కొవిడ్‌-19 తర్వాత పరిస్థితులు మారాయి. కొవిడ్‌-19 సొంతింటి అవసరాన్ని పెంచడంతో విపరీతంగా ఫ్లాట్లు, ఓపెన్‌ ప్లాట్లకు  డిమాండ్‌ పెరిగింది. ఉప్పల్‌ భగాయత్‌లో తాజా వేలంలో చ.గజం ధర రూ.1.01లక్షలు పలికింది.


నేడు మరో 21 ప్లాట్లకు..

ఉప్పల్‌ భగాయత్‌లో ప్లాట్లను ఇప్పటి వరకు రెండుసార్లు ఈ-వేలం వేశారు. మొదటిసారి 2019 ఏప్రిల్‌లో 67ప్లాట్లను వేలం వేస్తే రూ.677కోట్ల వరకు ఆదాయం రాగా, ఆ తర్వాత అదే ఏడాది డిసెంబర్‌లో 124ప్లాట్లను వేలం వేస్తే అందులో కేవలం 103ప్లాట్లు అమ్ముడుపోయాయి. 21ప్లాట్లు మిగిలాయి. నాడు ఈ ప్లాట్లను కొనుగోలు చేసేందుకు ఒక్కరే ముందుకు రావడం, ఇతరులెవ్వరూ బిడ్‌ చేయకపోవడంతో నిలిపివేశారు. ఫేజ్‌-1, ఫేజ్‌-2 లేఅవుట్లలో మిగిలిన ప్లాట్లను, ఫేజ్‌-3 లేఅవుట్‌లో గల ప్లాట్లను వేలం వేయడానికి ఇటీవల హెచ్‌ఎండీఏ నోటిఫికేషన్‌ వేసి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించింది. 21 రెసిడెన్షియల్‌ ప్లాట్లు 16,719చదరపు గజాలు కాగా, ఇందులో గతంలో అమ్ముడుపోని ప్లాట్లే చదరపు గజం రూ.73వేలకు పైగా పలికాయి. అయితే శుక్రవారం మల్టీపర్పస్‌, కమర్షియల్‌ జోన్లలోని 21ప్లాట్లను రెండు విడతల్లో ఈ-వేలం వేయనున్నారు.

Updated Date - 2021-12-03T16:11:00+05:30 IST