‘రియల్‌’ జోరు

ABN , First Publish Date - 2021-07-21T05:57:30+05:30 IST

‘వరంగల్‌ జిల్లా’ ఏర్పాటుకు ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ కావడంతో వరంగల్‌ పట్టణ ప్రాంతంలో రియల్‌ బూమ్‌ కనిపిస్తోంది. వరంగల్‌ రూరల్‌ జిల్లా పరిధిలోని 16 మండలాల నుంచి మూడింటిని హన్మకొండ జిల్లాలో చేర్చి, వరంగల్‌, ఖిలావరంగల్‌ మండలాలను కలుపుతూ ‘వరంగల్‌ జిల్లా’ ఏర్పాటు చేస్తున్న విషయం విదితమే.

‘రియల్‌’ జోరు

‘వరంగల్‌ జిల్లా’ ఏర్పాటుతో భూముల ధరలకు రెక్కలు
‘తూర్పు’ నియోజకవర్గ పరిధిలో ఇళ్ల స్థలాలకు డిమాండ్‌
నూతన కలెక్టరేట్‌ కేంద్రంగా చుట్టూరా విస్తరించనున్న కాలనీలు
సమగ్ర అభివృద్ధిపై ఆశలు


వరంగల్‌ టౌన్‌,  జూలై 20 :  ‘వరంగల్‌ జిల్లా’ ఏర్పాటుకు ప్రాథమిక నోటిఫికేషన్‌  జారీ కావడంతో వరంగల్‌ పట్టణ ప్రాంతంలో రియల్‌ బూమ్‌ కనిపిస్తోంది. వరంగల్‌ రూరల్‌ జిల్లా పరిధిలోని 16 మండలాల నుంచి మూడింటిని హన్మకొండ జిల్లాలో చేర్చి, వరంగల్‌, ఖిలావరంగల్‌ మండలాలను కలుపుతూ ‘వరంగల్‌ జిల్లా’ ఏర్పాటు చేస్తున్న విషయం విదితమే. ఈ పరిణామంతో వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో భూముల ఽధరలు రెక్కలు వచ్చాయి. ఆజంజాహి మిల్లు గ్రౌండ్స్‌లో వరంగల్‌ కలెక్టరేట్‌ను ఏర్పాటు చేయడం దాదాపుగా ఖాయం కావడంతో ఓసీటీ, రాంఖీ ఎన్‌క్లేవ్‌, కాశిబుగ్గ, ఏనుమాముల, లేబర్‌కాలనీ, దేశాయిపేట, పోచమ్మమైదాన్‌, ఏనుమాముల మార్కెట్‌, మొగిలిచర్ల, గొర్రెకుంట, ధర్మారం, కొత్తపేట ప్రాంతాలలో ప్లాట్లకు డిమాండ్‌ పెరిగింది. గతంలో ఓసీటీలో గజం రూ. 48 వేల వరకు పలుకగా, ఇప్పుడు గజం రూ.60 నుంచి రూ.70 వేలకుపైగా ధర పలికే అవకాశం ఉందని రియల్టర్లు చెబుతున్నారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో ఇప్పటికే గజం రూ.30 వేల వరకు ధర పలుకుతోంది.  

నగర పరిధిలో వరంగల్‌, హన్మకొండ, కాజీపేట పట్టణాలు కొలువుదీరగా, వీటిలో వరంగల్‌, కాజీపేట కంటే హన్మకొండలో ప్లాట్ల ధరలు హైరేంజ్‌లో ఉండేవి. సంపన్నవర్గాలు, ఆధునిక సౌకర్యాలు ఎక్కువగా ఉండటంతో హన్మకొండలో ప్లాట్లకు ఎప్పుడూ మంచి డిమాండ్‌ ఉంటుంది. పాత బస్తీగా, వ్యాపార కేంద్రంగా పేరు ఉన్న వరంగల్‌ పట్టణంలో మాత్రం ఆ తరహా పరిస్థితి కనిపించేది కాదు. ఈ క్రమంలో నూతన ‘వరంగల్‌ జిల్లా’ ఏర్పాటు అంశం.. వరంగల్‌, ఖిలావరంగల్‌ మండలాలకు వరంగా మారింది. పట్టణ పరిధే కాకుండా, శివారు ప్రాంతాల్లోని ప్లాట్లకు కూడా ఇప్పుడు డిమాండ్‌ పెరిగింది. వివిధ వర్గాల ప్రజలు వరంగల్‌ తూర్పు పరిధిలో ఇళ్ల స్థలాల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. జిల్లా కేంద్రం ఏర్పాటు వలన అభివృద్ధితో పాటు, అన్ని సౌకర్యాలు సమకూరనుండటంతో హన్మకొండకు సమానంగా రియల్‌ వ్యాపారం విస్తరించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఖమ్మం రోడ్డు, నర్సంపేట రోడ్డులో అనేక రియల్‌ వెంచర్లు తెరపైకి వచ్చాయి.

గతంలో చేసిన వెంచర్లలోని ప్లాట్ల క్రయవిక్రయాలు ఊపందుకున్నాయి. ఒకప్పటి అండర్‌ రైల్వేగేటుకు అవతల ఉన్న ప్రాంతాల్లోనూ రియల్‌ వ్యాపారం జోరుగా సాగుతోంది. వరంగల్‌ తూర్పు పరిధిలో ఇప్పుడు గజానికి కనీస ధర రూ.10వేలు పలుకుతుండటం గమనార్హం.  

ఎకరం రూ.2 కోట్లు..

వరంగల్‌ జిల్లా ఏర్పాటుతో నగర శివార్లలోని వ్యవసాయ భూములకూ రెక్కలు వచ్చాయి. ఆరెపల్లి, ఓఆర్‌ఆర్‌, కొత్తపేట, మొగిలిచర్ల, ఏనుమాముల, దేశాయిపేట, పైడిపెల్లి, రెడ్డిపాలెం, గొర్రెకుంట, ధర్మారం, స్తభంపల్లి, బొల్లికుంట ప్రధాన రోడ్లకు ఆనుకుని ఉన్న భూములకు ఎకరం రూ.2 కోట్ల వరకు ధర పలుకుతోంది. మరోపక్క ఔటర్‌ రింగ్‌రోడ్డు, టెక్స్‌టైల్‌ పార్క్‌ పనులు చురుకుగా సాగుతుండడంతో సంపన్నవర్గాలు, వ్యాపారవర్గాలు, రియల్టర్లు ముందస్తుగా భూములు కొనుగోలు చేస్తున్నారు.  నగర శివారు ప్రాంతాల్లో వందగజాల ఇంటి స్థలానికి రూ.10 లక్షలు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ జోరుతో వ్యవసాయ భూములను కొనుగోలు చేసి రియల్టర్లు అధికారికంగా, అనధికారికంగా పాట్లు చేసి అమ్ముతున్నారు. వరంగల్‌ నుంచి సుమారు 30 కిలో మీటర్ల వరకు ప్రధాన రహదారులకు ఆనుకుని ఉన్న వ్యవసాయ భూములకు ఎకరానికి రూ.కోటి ధర పలుకుతోంది.

ఫుల్‌ జోష్‌లో రియల్టర్లు..
వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో ఉన్నప్పుడు వరంగల్‌ ప్రాంతంలో భూములు కొనుగోలు చేసిన సంపన్నులు, వ్యాపారులు, రియల్టరు ఇప్పుడు ఫుల్‌జో్‌షలో ఉన్నారు. ప్లాట్ల ధరలు విపరీతంగా పెరుగుతుండడంతో గతంలో రూ.10 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన ప్లాటుకు ఇప్పుడు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ధర పలుకుతున్నాయి.

అభివృద్ధిపై ఆశలు

వరంగల్‌ జిల్లా ఏర్పాటుతో అభివృద్ధి  ఊపందుకుంటుందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సుమారు రూ. 2వేల కోట్లతో సెంట్రల్‌ జైలు స్థలంలో 33 అంతస్తులతో ఏర్పాటు చేయనున్న మెడికల్‌ హబ్‌, కాకతీయ మెడికల్‌ కళాశాల, కాళోజీ యూనివర్సిటీ, రైల్వేస్టేషన్‌, బస్‌స్టేషన్‌, త్వరలో మామునూరులో ఏర్పాటు చేయనున్న సెంట్రల్‌జైలు, టెక్స్‌టైల్‌ పార్క్‌, ఖిలా వరంగల్‌, నిరుద్యోగుల కోసం ఏర్పాటు చేయనున్న స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌, ఎంజీఎం, భద్రకాళి టెంపుల్‌, ఆరెపల్లి దగ్గర ఓఆర్‌ఆర్‌, ప్రైవేటు ఆస్పత్రులు, ఏనుమాముల మార్కెట్‌తో వరంగల్‌ జిల్లా తనదైన అస్తిత్వాన్ని చాటబోతోంది.

Updated Date - 2021-07-21T05:57:30+05:30 IST