Advertisement

రియల్‌రంగం కుదేలు

Nov 28 2020 @ 23:48PM
మేడ్చల్‌లోని ప్లాట్లు

  • ఆగిన రిజిస్ట్రేషన్లతో అయోమయంలో వ్యాపారులు 
  • ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూపులు


మేడ్చల్‌: రియల్‌ఎస్టేట్‌ రంగం పరిస్థితి ‘‘అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని’’ అన్నట్లుగా తయారైంది. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా సమయంలోనూ ఒడిదొడుకులు లేకుండా తట్టుకున్న రియల్‌ వ్యాపారులు ప్రభుత్వ నిర్ణయంతో ఒక్కసారిగా డీలాపడిపోయారు. రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో రియల్‌ రంగం కుదేలైంది. రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వరుసగా 2, 3 రోజులు సెలవులు వస్తేనే విలవిలలాడే వ్యాపారులు దాదాపు మూడు నెలలుగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోవడంతో దిక్కుతోచని స్థితిలో అల్లాడిపోతున్నారు. కరోనా కారణంగా మార్చి నుంచి మే నెల వరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌, ఆ తర్వాత క్రమంగా లాక్‌డౌన్‌ సడలించిన తర్వాత రియల్‌ రంగం తిరిగి తేరుకుంది. మెల్లిమెల్లిగా తిరిగి పుంజుకునే సమయంలో ప్రభుత్వ నిర్ణయం ఒక్కసారిగా వ్యాపారులపై పిడుగుపడట్లయింది. మేడ్చల్‌ ప్రాంతం నగరశివారులో విస్తరించి ఉండటంతో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవడానికి అనువైన ప్రాంతం కావడంతో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వారు ఇక్కడ నివాస గృహాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. మేడ్చల్‌ ప్రాంతంలో ఎక్కువగా గ్రామపంచాయతీ అనుమతి లేఔట్లే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే హెచ్‌ఎండీఏ లేఅవుట్లు వెలుస్తున్నాయి. ప్రభుత్వం ల్యాండ్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం(ఎల్‌ఆర్‌ఎ్‌స)ను ప్రకటించడంతో రియల్‌ఎస్టేట్‌ రంగానికి బ్రేక్‌ పడింది. ఎల్‌ఆర్‌ఎ్‌సపై కొందరు హైకోర్టుకెక్కడంతో అది ఎటూ తేలక ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల ప్రక్రియను తిరిగి ప్రారంభించలేదు. దీంతో రియల్‌ వ్యాపారులు తలలు పట్టుకుంటున్నారు. ఈనెల 23న ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్‌ మొదట ప్రకటించారు. ఆ తరువాత కోర్టుతీర్పు వెలువడిన తరువాత 25న ప్రారంభిస్తామని ప్రకటించినా ఇంకా పెండింగ్‌లోనే ఉండిపోయింది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియక ఇటు రియల్‌ వ్యాపారులు అటు అవసరానికి భూములు, ఇళ్లు అమ్ముకునే వారు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కార్తీకమాసం కావడంతో వివాహాది శుభకార్యాలు, ఇతర అవసరాల కోసం భూములు, ఇళ్లు అమ్ముకునే వీలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సెప్టెంబర్‌ నెలకు ముందు విక్రయాలు జరిపి అగ్రిమెంట్లు చేసుకున్న వారి పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ప్రభుత్వ నిర్ణయంతో రియల్‌కు సంబంధించిన అన్ని రంగాలపై ప్రభావం పడింది. ముఖ్యంగా నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మేడ్చల్‌లో బిల్డర్లు నిర్మించిన ఇళ్లు కొనేవారు లేక నిలిచిపోయాయి. నిర్మాణ రంగంపై ఆధారపడిన వారు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మధ్యవర్తులుగా వ్యవహరించి కమీషన్లు తీసుకుని జీవనం గడిపేవారి పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. కుటుంబపోషణ కూడా భారంగా మారడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా ఎంత కాలం ఈ పరిస్థితి ఉంటుందో తెలియడం లేదు. ఇంకొంత కాలం పరిస్థితి ఇలాగే కొనసాగితే ఎంతో మంది రోడ్డునపడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఎల్‌ఆర్‌ఎ్‌సపై ఆంక్షలు సడలించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ తిరిగి ప్రారంభించాలని కోరుతున్నారు. 


రిజిస్ర్టేషన్లను వెంటనే ప్రారంభించాలి: బాల్‌రెడ్డి, రియల్‌ వ్యాపారి, మేడ్చల్‌

ప్రభుత్వం నిలిపివేసిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలి. ఎల్‌ఆర్‌ఎస్‌ ఉన్న(హెచ్‌ఎండీఏ వెంచర్‌లో) ప్లాట్లకైనా రిజిస్ట్రేషన్లు జరుపాలి. ఎల్‌ఆర్‌ఎస్‌లో దరఖాస్తు చేసుకున్న ప్లాట్లపై కూడా త్వరగా నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వ నిర్ణయం కొనసాగింపుతో రియల్‌ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఇప్పటికైనా వెంటనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ప్రారంభించే విధ ంగా చర్యలు చేపట్టాలి. 


Follow Us on:
Advertisement