ltrScrptTheme3

పది సెకన్లు ఆపకుండా గాలి పీల్చగలిగితే కరోనా లేనట్టేనా..?

Mar 26 2020 @ 09:39AM

ఆన్‌లైన్‌ నిర్ధారణలు అశాస్త్రీయం

ఆంధ్రజ్యోతి (26-03-2020): కరోనావైరస్‌ వ్యాప్తి, ప్రభావం గురించి ప్రజల్లో అనేక రకాల అపోహలు విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. వీటిలో నిజానిజాలపై అవగాహన కల్పించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రత్యేకంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా కరోనాపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించడానికి  అధీకృత సమాచారాన్ని ఎప్పటికప్పుడు విడుదల చేస్తోంది.


అపోహలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరణ


వేడి ప్రాంతాల్లో కరోనా రాదు

ఉష్టోగ్రతలు ఎక్కువగా ఉండే భారత్‌లాంటి దేశాల్లో కరోనా ప్రభావం పెద్దగా ఉండదని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా మనదేశంలో వచ్చే రెండు నెలలు ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కరోనా గురించి ఆందోళన అవసరం లేదని కొందరు భావిస్తున్నారు. ఇది అపోహ మాత్రమే. సింగపూర్‌, ఆస్ట్రేలియా లాంటి వేడి ప్రాంతాల్లో కూడా కరోనా వ్యాపించింది. చైనాలోని అన్ని రకాల వాతావరణ ప్రాంతాల్లో వైరస్‌ సోకినందున వేడి వాతావరణంలో కరోనా రాదనుకోవడానికి శాస్త్రీయ ఆధారాలు లేవని హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌ వెల్లడించింది. సార్స్‌, ఇతర వైరస్‌లతో కరోనాను పోల్చకూడదని పేర్కొంది. అయితే ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే దశలో ఉపరితల ఉష్ణోగ్రత ప్రభావం కరోనా సజీవంగా ఉండే వ్యవధిపై ఎంతోకొంత ప్రభావం ఉండొచ్చనే అభిప్రాయం కూడా ఉంది. ఆమేరకు మనదేశంలోని అధిక ఉష్ణోగ్రతలు కరోనా వ్యాప్తిని తగ్గించడంలో కొంత ప్రయోజనకరంగా మారొచ్చు. 


పిల్లలకు కరోనా రాదు 

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వయోజనుల్లోనే కరోనా బాధితులు ఎక్కువగా ఉన్నారు. దీంతో పిల్లలకు కరోనా రాదనే అపోహ చాలామందిలో ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం వయసుతో నిమిత్తం లేకుండా ఎవరికైనా కరోనావైరస్‌ సోకే అవకాశం ఉంది.


థర్మల్‌ స్కానర్‌లో మామూలు ఉష్ణోగ్రత వస్తే కరోనా లేనట్టే 

సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతను గుర్తించడానికి ప్రాథమిక దశలో థర్మల్‌ స్కానర్‌ ఉపయోగపడుతుంది. విమానాశ్రయాల్లో, రైల్వే స్టేషన్లలో వీటిని ఎక్కువగా వాడుతున్నారు. కానీ కరోనా సోకినవారికి వ్యాధి లక్షణాలు వెంటనే బయటపడకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో థర్మల్‌ స్కానర్‌లో సాధారణ ఉష్ణోగ్రతే నమోదయ్యే అవకాశం ఉంటుందని, కానీ వ్యాధి సోకి ఉంటే ఆ తర్వాత 2 నుంచి 10 రోజుల్లో ఎప్పుడైనా కరోనా నిర్థారణ కావచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.


పది సెకన్లు ఆపకుండా గాలి పీల్చగలిగితే కరోనా లేనట్టే

కరోనా గురించి ఇది మరో పెద్ద అపోహ. ఆన్‌లైన్‌లో ఇలాంటి టెస్ట్‌లు ప్రచారంలో ఉన్నాయి. కరోనా / కోవిడ్‌ చెకర్‌ల పేరుతో వెబ్‌సైట్లలో వీటిని పెడుతున్నారు. ఊపిరితిత్తుల సమస్య వల్ల తీవ్రంగా   ఇబ్బందిపడేవారిని గుర్తించడానికి ఇలాంటివి కొంతవరకు ఉపయోగపడొచ్చు. కానీ కరోనా ఇతర వైరస్‌లకంటే భిన్నమైనది. వ్యాధి సోకినా కొన్ని రోజుల వరకు ఎలాంటి ఇబ్బందులు బయటపడని కరోనావైరస్‌ లాంటి వాటిని గుర్తించడానికి ఎలాంటి ఆన్‌లైన్‌ పరీక్షలు ఉపయోగపడవు. ఊపిరి తీసుకోవడం ఇబ్బంది అనిపిస్తే వైద్యులను సంప్రదించాల్సిందే.


మరిన్ని నీళ్లు తాగితే కరోనా రాదు

ప్రతి 15 నిమిషాలకోసారి నీళ్లు తాగితే   వైరస్‌ గొంతులో నుంచి కడుపులోకి పోతుందని,  తర్వాత కడుపులో యాసిడ్‌ల వల్ల అది చనిపోతుందని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది.  ఇది  అపోహ మాత్రమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఊపిరితిత్తులకు సోకే వైరస్‌ ఇలా చనిపోతుందనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు  లేవని పేర్కొంది. అయితే ఎక్కువగా నీళ్లు తాగుతూ  డీహైడ్రేషన్‌ రాకుండా చూసుకుంటే ఆరోగ్యానికి మంచిదే.

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.