అదే అసలైన ఆనందం

ABN , First Publish Date - 2022-01-21T05:30:00+05:30 IST

మనకు రెండు రకాల సంతోషాలు ఉంటాయి. ఒకటి ప్రాపంచికమైన సంతోషం. రెండోది ఆంతరంగికమైన సంతోషం. రెండూ సమాంతరంగా కొనసాగితే ఆ వ్యక్తి మరింత సంతోషంగా ఉంటాడనేది ఒక భావన..

అదే అసలైన ఆనందం

మనకు రెండు రకాల సంతోషాలు ఉంటాయి. ఒకటి ప్రాపంచికమైన సంతోషం. రెండోది ఆంతరంగికమైన సంతోషం. రెండూ సమాంతరంగా కొనసాగితే ఆ వ్యక్తి మరింత సంతోషంగా ఉంటాడనేది ఒక భావన. ఒక అవస్థ నుంచి మరొక అవస్థకు.. సాధారణ భౌతికమైన దశ నుంచి ఆధ్యాత్మికమైన దశకు వెళ్ళడం కోసం అందరూ ఎదురు చూస్తారు. ఈ క్రమాన్ని రమణ మహర్షి ఎలా నిర్వచించారు?


ఆనందం తనకు బాహ్యంగా ఉన్న కారణాలవల్ల, తన విషయ సంపదల వల్ల అని ఎవరైనా అనుకుంటే... దానికి అనుగుణంగా అవి పెరిగినప్పుడు ఆనందం పెరగడం, అవి తగ్గినప్పుడు ఆనందం తగ్గడం జరగాలి. అలాగే వస్తు సంపదలు, ఆస్తిపాస్తులు లేనప్పుడు ఆ ఆనందం శూన్యమైపోవాలి. కానీ మనిషి నిజమైన అనుభవం ఏమిటి? అది ఈ దృక్పథానికి అనుగుణంగా ఉందా?


ఇక్కడ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే... సంతోషం ఎన్నటికీ బహిర్గతమైన అంశం కాదు. సంతోషం, ఆనందం విషయంలో ఆలోచించడం మన నిజమైన స్వభావం కాదు. గాఢ నిద్రలో, అంటే సుషుప్తిలో సుఖంగా, హాయిగా, మనకు ఏదీ తెలియని స్థితి ఉంటుంది. బిచ్చగాడికైనా, సంపన్నుడికైనా ఆ హాయి ఒకటే. గాఢనిద్రలో మనిషికి ఆస్తి మొదలైన విషయ సంపదే కాదు, శరీరం కూడా లేదు. అప్పుడు ఆ మనిషి దుఃఖించడానికి బదులుగా చాలా ఆనందంగా ఉన్నాడు. ప్రతి వ్యక్తి గాఢ నిద్రను కోరుకుంటాడు. నిద్రలో ఆ నిరంతరాయమైన ఆనందం ఎందుకు ఉందంటే... అక్కడ ఆలోచన లేదు. అంటే... ‘ఎక్కడైతే ఆలోచన అనేది లేదో అక్కడ సుఖం ఉంది’ అనేది మన నిద్రానుభవం. లేచిన తరువాత మనస్సు  ఆ హృదయం నుంచి బయటికి వచ్చి, ఆలోచించడం మొదలుపెట్టిన తరువాత ... ‘నిద్రలో ఏదైతే నేను ఆనందించానో, అనుభవించానో ఆ సుఖం నాకు మళ్ళీ కావాలి’ అనుకుంటుంది.


దాని కోసం జాగద్రావస్థ మొత్తం వెతుకుతూ ఉంటుంది. ప్రపంచంలో కనిపించే ప్రతి వస్తువులో, ప్రతి విషయంలో, ప్రతి స్థలంలో, అది వెతుకుతూనే ఉంటుంది. ఉదాహరణకు బయట ఒక విషయంలో మనకు ఆనందం కలుగుతుంది. అది ఎక్కడ నుంచి వచ్చిందంటే... ఈ మనస్సు దాని జన్మస్థలమైన హృదయం దగ్గరకు వెళ్ళి, కాసేపు ఉండి, ఆ ఆనందం పొంది, మళ్ళీ బయటకు వచ్చింది. ఇక్కడ ఆనందం, సుఖం అనేవి మనస్సు ఇవ్వదు. హృదయం అంటే ఆనందం, హృదయం అంటే సుఖం. మనం ఎవరం? మనం ఆ హృదయమే. ఏదైతే కేంద్ర బిందువో అదే హృదయం. అది పరిణామ రహితం, అరూపం, ఏకం, అచలం. ఈ గుణాలు కలిగి ఉన్న దాన్ని ‘హృదయం’ అంటారు. ‘కేంద్ర స్థానం’ అంటారు. అక్కడి నుంచి ఒక వెలుగు రేఖ (దీన్నే భగవాన్‌ రమణులు ‘రశ్మి’ అంటారు) ఎప్పుడైతే బయటకు వచ్చిందో, వెంటనే అక్కడ నాలుగు విషయాలు జరుగుతాయి.


హృదయం అనేది సహజకాంతి అయితే బయటికి వచ్చే ఆ రశ్మిని ‘అభాసకాంతి’ అంటారు. ఆ కాంతి మనోఫలకం మీద పడుతుంది. అప్పడు ‘నాకు ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉంది’ అనే అనుభూతి, అనుభవం రెండూ మనకు కలుగుతాయి. మనోఫలకం మీద ఆ అభాసకాంతి పడినప్పుడు అహంకారం పుడుతుంది. ‘నేను’ అనే ఆలోచనను మొట్టమొదటిసారి ప్రవేశపెడుతుంది. ‘నేను హృదయంగానే ఉన్నాను. అంతటా నేనే ఉన్నాను. నేను ప్రత్యేకంగా కూడా ఉన్నాను’’ అనే భావన అది. అంటే ఒక పరిధి, పరిమితి మొదలవుతుంది. ఎప్పుడైతే ఆ పరిధి, పరిమితి వచ్చాయో, ఈ దేహాత్మ బుద్ధి కలుగుతుంది. అంటే ‘నేను దేహంలో మాత్రమే ఉన్నాను’ అనే భావన. వాస్తవానికి మనం హృదయంగా ఉన్నాం, అంతటా నిండి, నిబిడీకృతమై ఉన్నాం. అయినప్పటికీ వివిధత్వం, లేదా నానాతత్వం అనే భావన మనలో కలిగి, ‘నేను’ ప్రత్యేకంగా ఉన్నాననే అనుభూతి కలుగుతుంది. దాన్నే ‘నేను’ అనే ఆలోచన అంటాం. హృదయ కేంద్రం నుంచి రశ్మి బయటకు వచ్చి, మనో ఫలకం మీద పడి, ‘నేను ఉన్నాను’ అనే ఆలోచన ఎప్పుడు ఆరంభమయిందో, ఒక్కసారిగా ‘దేహాత్మ బుద్ధి’ కలుగుతుంది, కల్పిత జగద్దృష్టి కూడా కలుగుతుంది. అహంకారరూప జీవబోధ  (ఫాల్సీ నాలెడ్జ్‌) అనేది కూడా మొదలవుతుంది.


కాబట్టి అభాస కాంతి ద్వారా ‘నేను’ అనే ఆలోచన మొదలై, దేహాత్మ బుద్ధి కలిగి... నాకు అన్యంగా ప్రపంచం ఉందనే భావన కలిగితే... దాన్ని ‘కల్పిత జగద్దృష్టి’ అంటాం.  ఇవన్నీ హృదయం మీదే జరుగుతున్నాయి. ‘‘హృదయం అంటే ఆనందం... హృదయం అంటే నిర్నిరోధమైన పరమానందం. కానీ, దానిలోనే ‘నేను ప్రత్యేకంగా ఉన్నాను’ అనే అనుభవం, అనుభూతి కలుగుతాయి. ‘నేను ఎవరు?’ అనే పుస్తకంలో భగవాన్‌ రమణులు ఇలా అంటారు... ‘‘సకల జీవరాశులు దుఃఖం లేకుండా ఎల్లప్పుడూ సుఖంగా ఉండాలని కోరుకోవడం వల్లా,  ప్రతి వ్యక్తికీ తనయందే పరమప్రీతి ఉండడడం వల్లా, ఆ ప్రీతికి సౌఖ్యమే కారణం కావడం వల్లా... నిద్రలో ప్రతిరోజూ అనుభవించేది కావాలని మనసు కోరుతుంది. నీ స్వభావమైన ఆ సుఖాన్ని పొందాలంటే నువ్వు ఎవరో  తెలుసుకోవడం ఆవశ్యకం. దానికి ‘నేను ఎవరు?’ అనే ఆత్మ విచారణే ముఖ్య సాధనం అని. ప్రతి మనిషి లేచిన దగ్గర నుంచి ఒకటే కోరుకుంటాడు... ‘నేను సుఖంగా ఉండాలి, నేను ఆనందంగా ఉండాలి’ అని. ఎవరూ ‘నేను సుఖంగా ఉండకూడదు, దుఃఖంలో ఉండాల’ని కోరుకోరు. ఎందుకంటే, అది మన స్వభావం, అది మన సహజగుణం. ఆలోచన ఉన్నంతవరకూ, ఈ ప్రత్యేకమైన ‘దేహాత్మబుద్ధి’ ఉన్నంతవరకూ, అంటే మనస్సు ఉన్నంతవరకూ, అహంకారం ఉన్నంతవరకూ సుఖం పొందుతున్నామనే భ్రమలో ఉంటారు కానీ ఒక్కసారి కూడా పొందలేరు. ఒకవేళ పొందినా, ఈ మనసు కొన్ని ఆలోచనలు పుట్టిస్తుంది. దేహం కర్మ చేస్తూ ఉంటుంది. మనస్సు నుంచి వచ్చిన ఆలోచన దేహం చేసే కర్మతో ఏకీభవిస్తే, ఫలితాలు సంభవిస్తాయి. అప్పుడు మనస్సు ఒక్కసారిగా ప్రపంచం నుంచి, వెనక్కి వచ్చి, హృదయం దగ్గరకి వెళ్ళి, కాసేపు ఉండి... అంటే ఆనందం పొంది, మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. ఉదయం నుంచి రాత్రి నిద్రపోయేవరకూ ఈ మనస్సు  బయటికి వెళ్తూ ఉంటుంది, లోపలికి వస్తూ ఉంటుంది.


ఎవరైతే ఎప్పుడూ హృదయంగానే ఉన్నానని అనుకొని, అక్కడే ఉండడానికి ప్రయత్నిస్తారో... అదే శాశ్వతమైన అవరోధాలు లేని పరమానందం. మనకు సుఖం అనేది హృదయం నుంచే దొరుకుతోంది. అది ప్రపంచంలో వస్తువుల్లోనూ, మరి దేనిలోనూ లేదు. మనసు జాగద్రవస్థలో ఆనందం పొందాలంటే... మన దేహం చేసిన కర్మతో మన ఆలోచనలు ఏకీభవించాలి. అయితే... ఆ ఆనందాన్ని మనం పరిగణనలోకి తీసుకోకూడదు. మనం పరిగణించాల్సిన ఆనందం... మౌనంలో ఉండడం ఎలా? అనేది. ‘నేను’ అనే ఆలోచన ఎక్కడ పుడుతుందో, ఆ మౌనం దగ్గరకు వెళ్ళగలిగితే, అక్కడ ఉండేదే శాశ్వతమైన ఆనందం. ఎందుకంటే అహంకారానికి ఆస్కారం ఉండదు. వ్యక్తి తన ఆత్మ సాక్షాత్కారాన్ని తప్పక పొందాలి. అది కలుషితం కాని పరమానంద భాండాగారాన్ని తెరుస్తుంది.


 హృదయం అంటే ఆనందం, హృదయం అంటే సుఖం. మనం ఎవరం? మనం ఆ హృదయమే. ఏదైతే కేంద్ర బిందువో అదే హృదయం. అది పరిణామ రహితం, అరూపం, ఏకం, అచలం. ఈ గుణాలు కలిగి ఉన్న దాన్ని ‘హృదయం’ అంటారు. ‘కేంద్ర స్థానం’ అంటారు. 


సూర్య ప్రకాశ్‌


Updated Date - 2022-01-21T05:30:00+05:30 IST