
ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉండేవాడు. అతడు ఒకరోజు తన కుమారుడిని తనతో పాటు దేశ పర్యటనకు తీసుకెళ్లాడు. పేదవాళ్లు ఎలా జీవిస్తారు, తాము ఎలా జీవిస్తున్నాం, సంపద ఉన్నందుకు తాము ఎంత అదృష్టవంతులమో కుమారుడికి తెలియజేయాలనేది అతడి ఉద్దేశం. వాళ్లు పేద కుటుంబానికి చెందిన ఇంటిలో రెండు రోజులు ఉన్నారు. మరునాడు తిరిగి ఇంటికి పయనమయ్యారు. మార్గమధ్యంలో ధనవంతుడు ‘పర్యటన ఎలా ఉంది?’ అని కుమారుడిని అడుగుతాడు. ‘చాలా గొప్పగా ఉంది నాన్నా’ అంటాడు కొడుకు.
‘ఈ పర్యటనలో నువ్వు ఏం తెలుసుకున్నావు?’ అని అడుగుతాడు. అందుకు కుమారుడు ‘మన దగ్గర ఒక కుక్క ఉంది. వాళ్ల దగ్గర నాలుగు కుక్కలు ఉన్నాయి. మన ఈతకొలను మన తోట వరకే ఉంటుంది. కానీ వీళ్ల ఇళ్ల దగ్గరి కాలువ చాలా పొడవు ఉంది. మనం కొంత స్థలం మీదే బతుకుతున్నాం. వాళ్ల పొలాలు చూశారా! కనుచూపు మేర ఉన్నాయి.
మన ఇంట్లో పనివాళ్లు ఉంటారు. వాళ్లేమో వేరొకరికి సేవలు చేస్తారు. సంపదను కాపాడుకోవడానికి మనం చుట్టూ గోడలు కట్టుకున్నాం. వాళ్లకు ప్రాణమిచ్చే స్నేహితులు ఉన్నారు. మనం ఎంత పేదవాళ్లమో తెలియజేసినందుకు ధన్యవాదాలు నాన్నా’’ అని కుమారుడు అనగానే ఆ ధనవంతుడికి నోట మాట రాలేదు. నిజమైన సంపద ఏమిటో అతడికి అప్పుడు అర్థమైంది.