ముఖం మీదే కాకుండా భుజాల మీద మొటిమలు ఎందుకు వస్తాయో తెలుసా..

Nov 2 2021 @ 13:16PM

ఆంధ్రజ్యోతి(02-11-2021)

మొటిమలు ముఖం మీదే కాదు, కొందరికి భుజాలు, ఛాతీ, వీపు... ఇలా ఇతర శరరీ ప్రదేశాల్లో కూడా తలెత్తుతాయి. అయితే వీటికి మూల కారణాన్ని వెతికి, శాశ్వతంగా దూరం చేసుకునే వీలుంది.


చర్మ రంధ్రాల్లో మురికి, జిడ్డు పేరుకుపోవడం మూలంగా మొటిమలు తలెత్తడం సహజం. శరీరం మీద తలెత్తే మొటిమలకు, ముఖం మీద పుట్టుకొచ్చే మొటిమలు దాదాపు ఒకే కోవకు చెంది ఉంటాయి. అయితే శరీరం మీద మందపాటి చర్మంతో పోలిస్తే, ముఖ చర్మం సున్నితమైనది కాబట్టి మొటిమల చికిత్స క్లిష్టమవుతుంది. అయితే మొటిమలు ఎక్కడ మొదలైనా అందుకు మూల కారణాన్ని కనిపెట్టడం ఎంతో ముఖ్యం.


హార్మోన్లు: హార్మోన్లలో ఏ కొద్ది అవకతవకలు ఏర్పడినా ఆ ప్రభావం చర్మం మీద కనిపిస్తుంది. కౌమారం, నెలసరి, గర్భధారణ సమయాల్లో మొటిమల తీవ్రత ఎక్కువ. ఈ మూడు దశల్లో కొందరికి చేతులు, మెన్నులోని హైపర్‌ యాక్టివ్‌ చర్మం రంథ్రాల నుంచి స్వేదం ద్వారా చిక్కని, నూనె వెలువడి మొటిమలు ఏర్పడతాయి.


వాతావరణం: కాలుష్యంతో కూడిన తేమ కలిసిన వాతావరణం వల్ల శరీరం మీద మొటిమలు ఏర్పడతాయి. దుమ్ము, ధూళి, జిడ్డు, చర్మపు మృత కణాలతో చర్మ రంధ్రాలు పూడుకుపోయి మొటిమలు ఏర్పడవచ్చు.


దుస్తులు: బిగుతైన దుస్తులు, చమటతో కూడిన జిమ్‌ దుస్తులు చర్మంలోని నూనె, మురికిని బయటకు రానివ్వకుండా అడ్డుకుని ఒరిపిడికి గురి చేస్తాయి. దాంతో చర్మపు సహజసిద్ధ రక్షణ వ్యవస్థ దెబ్బతిని, బ్యాక్టీరియా చొరబాటుకు వీలు చిక్కి, ఇన్‌ఫ్లమేషన్‌, తద్వారా మొటిమలు మొదలవుతాయి.


శరీర శుభ్రత: చమట శరీరం మీదే ఇంకిపోకుండా చూసుకోవాలి. ఆఫీసు లేదా జిమ్‌ నుంచి ఇల్లు చేరిన వెంటనే శుభ్రంగా స్నానం చేయాలి.


చుండ్రు: వెంట్రుకల కుదుళ్లలో తయారయ్యే నూనెలను మీద ఆధారపడి బ్రతికే సూక్ష్మక్రిములు ఓలిక్‌ యాసిడ్‌ను విడుదల చేస్తాయి. ఈ యాసిడ్‌ చర్మపు మృత కణాలతో కలిసి, పొట్టులా మారి వీపు, నుదురు మీద పరుచుకుంటూ ఉంటుంది. 


పరిష్కారాలు: వెంట్రుకలను, చర్మాన్నీ శుభ్రంగా ఉంచుకోవాలి. కాలుష్యానికి సాధ్యమైనంత దూరంగా ఉండాలి. చర్మానికి ఒరిపిడి కలిగించని దుస్తులను, చమట పీల్చే వీలున్న దుస్తులను ధరించాలి.

Follow Us on:

అందమే ఆనందంమరిన్ని...

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.