వెన్ను నొప్పికి ప్రధాన కారణాలేంటో తెలుసా?

ABN , First Publish Date - 2022-02-22T19:39:35+05:30 IST

వెన్ను నొప్పి వ్యాధి కాదు. ఆసరా లోపం, ఎక్కువ సమయాల పాటు ఒకే భంగిమకు పరిమితమైపోవడం, శరీర భంగిమల్లో లోపాలు వెన్ను నొప్పికి ప్రధాన కారణాలు. అయితే ఈ సమస్యకు కారణాలను వెతికి, వాటిని సరిదిద్దుకునే చర్యలను చేపట్టి, వెన్ను నొప్పిని అదుపులోకి తెచ్చుకోవచ్చు.

వెన్ను నొప్పికి ప్రధాన కారణాలేంటో తెలుసా?

ఆంధ్రజ్యోతి(22-02-2022)

వెన్ను నొప్పి వ్యాధి కాదు. ఆసరా లోపం, ఎక్కువ సమయాల పాటు ఒకే భంగిమకు పరిమితమైపోవడం, శరీర భంగిమల్లో లోపాలు వెన్ను నొప్పికి ప్రధాన కారణాలు. అయితే ఈ సమస్యకు కారణాలను వెతికి, వాటిని సరిదిద్దుకునే చర్యలను చేపట్టి, వెన్ను నొప్పిని అదుపులోకి తెచ్చుకోవచ్చు.


కొవిడ్‌ పాండమిక్‌ మూలంగా వర్క్‌ ఫ్రం హోమ్‌కు పరిమితమైనవాళ్లను వెన్ను నొప్పి ఎక్కువగా వేధిస్తోంది. ఇలాంటివాళ్లు కంప్యూటర్‌ ముందు కూర్చుని పని చేసే భంగిమలను సరిచూసుకోవాలి. ఎర్గానమిక్‌ తరహా ఫర్నిచర్‌ను ఎంచుకోవాలి. బరువులను ఎత్తేటప్పుడు మోకాళ్లను వంచి లేవడం అలవాటు చేసుకోవాలి. 


మహిళల్లో...

పురుషులతో పోలిస్తే మహిళల్లోనే వెన్ను నొప్పి ఎక్కువ. మెనోపాజ్‌కు చేరుకున్న మహిళల్లో డిస్క్‌ డీజనరేషన్‌ వేగమవుతుంది. అలాగే ఈస్ట్రోజన్‌ ఉత్పత్తి తగ్గడం మూలంగా కూడా వెన్ను నొప్పి వేధిస్తుంది. ఎక్కువ సమయాల పాటు విశ్రాంతిగా గడపడం వల్ల వెన్నుకు ఆసరాగా ఉండే కండరాలు బలహీనపడి, చిన్నపాటి పనికే కండరాలు గాయపడుతూ ఉంటాయి.

 

వెన్ను నొప్పికి ప్రధాన కారణాలు 

అతిగా కండర వినియోగం 

డిస్క్‌ అరిగిపోవడం  

ఆస్టియొపోరోసిస్‌ 

విటమిన్‌ డి లోపం  

ఆర్థ్రయిటిస్‌


లక్షణాలు ఇవే!

ఎడతెగని జ్వరంతో పాటు, నొప్పి తగ్గుతూ, పెరుగుతూ ఉంటుంది. కాళ్లు బలహీనమవుతాయి. విసర్జక అవయవాల పనితీరు మందగిస్తుంది. 


చికిత్సలు ఇలా... 

ఎలాంటి వెన్ను నొప్పి అయినా ఒకటి నుంచి రెండు వారాల్లో అదుపులోకి వస్తుంది. అలా కాకుండా మూడు నెలలకు మించి వేధిస్తే, తప్పక వైద్యులను సంప్రతించి పరీక్షలు చేయించుకోవాలి. అలాగే నొప్పికి కారకాలను గుర్తించి, వాటిని సరిదిద్దుకోవాలి. వెన్నును దీర్ఘకాలం పాటు దృఢంగా ఉంచుకోవడం కోసం వ్యాయామాలు చేయాలి. మెనోపాజ్‌కు చేరుకున్న మహిళలు విటమిన్‌ డి, క్యాల్షియం సప్లిమెంట్లను అవసరం మేరకు తీసుకోవాలి. 


వెన్ను నొప్పి - కొవిడ్‌

కొవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాత తీవ్రమైన నడుము నొప్పి మొదలైతే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రతించాలి. కొవిడ్‌ తదనంతరం వెన్నులో ఇన్‌ఫెక్షన్‌ తలెత్తే అవకాశాలుంటాయి. కాబట్టి వెన్ను నొప్పిని నిర్లక్ష్యం చేయకూడదు. 


డాక్టర్‌ వంశీకృష్ణ వర్మ పెన్మెత్స

సీనియర్‌ స్పైన్‌ సర్జన్‌,

యశోద హాస్పిటల్స్‌,

సికింద్రాబాద్‌.

Updated Date - 2022-02-22T19:39:35+05:30 IST