పట్టుబడ్డ ‘రెబల్‌’ చీరలు

ABN , First Publish Date - 2021-03-09T07:50:11+05:30 IST

పట్టణంలోని బాలాజీ థియేటర్‌ సమీపంలో సోమవారం ఓ ఆటోలో ఉన్న చీరల బండిల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పట్టుబడ్డ ‘రెబల్‌’ చీరలు
ఆటోలోని చీరలను టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తున్న పోలీసులు

పోలీసులకు సమాచారం 

అందించిన వైసీపీ కార్యకర్తలు

బిల్లులు లేకపోవడంతో స్వాధీనం

టూటౌన్‌ స్టేషన్‌కు తరలింపు

చీరాల, మార్చి 8 : పట్టణంలోని బాలాజీ థియేటర్‌ సమీపంలో సోమవారం ఓ ఆటోలో ఉన్న చీరల బండిల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చీరాలలో మున్సిపల్‌ ఎన్నికల వేళ భారీగా చీరలు ఆటో ఉండటాన్ని వైసీపీ కార్యకర్తలు గుర్తించారు. వైసీపీ అభ్యర్థిని ఓడించేందుకు రెబల్‌ అభ్యర్థి ఆ చీరలు పంచడానికి తెచ్చారని వారు అనుమానించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సరైన బిల్లులు లేకపోవటంతో పోలీసులు చీరలతో ఉన్న ఆటోను టూటౌన్‌కు తరలించారు. సదరు సరకుకు సంబంధించి పూర్తి ఆధారాలు ఉంటే విడుదల చేస్తామని, లేదంటే కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.


ఫ్లయింగ్‌ స్క్వాడ్‌కు పట్టుబడ్డ రూ.11.70లక్షలు

మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో విధి నిర్వహణలో ఉన్న ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందం చీరాలలో ముగ్గురు వ్యక్తుల వద్ద రూ.11.68లక్షలు పట్టుకుంది. అవ్వారు శ్రీనివాసరావు అనే వ్యక్తి వద్ద రూ.11.57,340 పోలుదాసు అంజిబాబు మరో ఇద్దరు నుంచి రూ.12,900 సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ఆ నగదుకు సంబంధించి వారి వద్ద సరైన ధ్రువీకరణపత్రాలు ఉన్నాయో లేదో పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటారని డీఎస్పీ శ్రీకాంత్‌ తెలిపారు.


Updated Date - 2021-03-09T07:50:11+05:30 IST