నిస్వార్థ సేవతోనే గుర్తింపు

ABN , First Publish Date - 2021-07-23T05:27:01+05:30 IST

ప్రజలకు నిస్వార్థంగా సేవలందించే సర్పంచ్‌లుగా వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని కలెక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్‌ సూచించారు. జేఎన్‌టీయూలో ఏర్పాటు చేసిన విజయనగరం డివిజన్‌ సర్పంచ్‌ల శిక్షణ శిబిరాన్ని ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా పాలకులు సేవలందించాలన్నారు.

నిస్వార్థ సేవతోనే గుర్తింపు
శిక్షణ శిబిరంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌

సర్పంచ్‌ల శిక్షణ శిబిరంలో కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌

విజయనగరం(ఆంధ్రజ్యోతి)/ గరుగుబిల్లి, జూలై 22 : ప్రజలకు నిస్వార్థంగా సేవలందించే సర్పంచ్‌లుగా వారి గుండెల్లో  చిరస్థాయిగా నిలిచిపోవాలని కలెక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్‌ సూచించారు. జేఎన్‌టీయూలో ఏర్పాటు చేసిన విజయనగరం డివిజన్‌ సర్పంచ్‌ల శిక్షణ శిబిరాన్ని ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా పాలకులు సేవలందించాలన్నారు. సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ పారదర్శకంగా అందించి మనమీదున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని చెప్పారు. గ్రామాల్లో ప్రతిఒక్కరూ కరోనా నిబంధనలు పాటించేలా చూడాలని, అందరూ వ్యాక్సిన్‌ వేసుకునేలా సర్పంచ్‌లు బాధ్యత తీసుకోవాలని కోరారు. అంతకుముందు పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి వర్చువల్‌గా అమరావతి నుంచి మాట్లాడారు. మొదటి రోజు గజపతినగరం నియోజవర్గంలోని బొండపల్లి, గంట్యాడ, గజపతినగరం మండలాల సర్పంచ్‌లకు శిక్షణ ఇచ్చారు. ఎమ్మెల్యేలు బొత్స అప్పలనర్సయ్య, కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్సీలు పాకలపాటి రఘవర్మ, పెనుమత్స సురేష్‌బాబు హాజరయ్యారు. శిక్షణ తరగతుల కోసం 86 మందికి పిలుపునివ్వగా 82 మంది హాజరయ్యారు. కార్యక్రమంలో జేసీ కిశోర్‌కుమార్‌, ఆర్డీవో భవానీశంకర్‌, డీపీవో సుభాషిణి, డిప్యూటీ సీఈవో రామచంద్రరావు, తహసీల్డార్‌ ప్రభాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు. 

వసతులు కరువు

శిక్షణ తరగతులకు వచ్చిన వారి రాత్రి బసకు జేఎన్‌టీయూ బాలురు హాస్టల్‌ భవనంలో 50 గదులను కేటాయించారు. వసతులు సరిగా లేవు. గతంలో ఇక్కడ కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ నిర్వహించారు. ఆ తర్వాత పూర్తిస్థాయిలో శుభ్రపరచలేదని కొందరు సర్పంచులు తెలిపారు. ఎక్కడికక్కడే దుర్గంధం వెదజల్లుతోంది. చాలా మంది మహిళా సర్పంచ్‌లు బస చేసేందుకు ఇష్టపడలేదు. 

ఉల్లిభద్రలో.. 

గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర ఉద్యాన కళాశాలలో పార్వతీపురం డివిజన్‌ సర్పంచులకు ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరాన్ని గురువారం పార్వతీపురం, బొబ్బిలి శాసనసభ్యులు అలజంగి జోగారావు, శంబంగి వెంకట చినప్పలనాయుడులు ప్రారంభించారు. మొదటి బ్యాచ్‌ శిక్షణకు పార్వతీపురం, సీతానగరం, కొమరాడ మండలాలకు చెందిన 96 మంది సర్పంచ్‌లకు గాను 86 మంది హాజరయ్యారు. ఐదుగురు సర్పంచ్‌లు సామర్లకోటలో నిర్వహించే శిక్షణకు వెళ్లారు. కార్యక్రమానికి పార్వతీపురం డివిజనల్‌ అభివృద్ధి అధికారి కె.రాజ్‌కుమార్‌ అధ్యక్షత వహించారు. జిల్లా పరిషత్‌ సీఈవో టి.వెంకటేశ్వరరావు, ఎంపీడీవోలు ఎంవీ గోపాలకృష్ణ, కె.కృష్ణారావు, తహసీల్దార్లు వీవీఎస్‌ శర్మ, ఎన్‌వీ రమణ, ఈవోపీఆర్‌డీ ఎల్‌.గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-07-23T05:27:01+05:30 IST