కృష్ణా జలాలపై తెలుగు రాష్ట్రాల సయోధ్య

ABN , First Publish Date - 2022-05-07T08:24:43+05:30 IST

కృష్ణా జలాలకు సంబంధించి పలు కీలక అంశాలపై తెలుగు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదిరింది. మిగులు జలాలు, జలవిద్యుత్తుకు మార్గదర్శకా లు

కృష్ణా జలాలపై తెలుగు రాష్ట్రాల సయోధ్య

ఆర్డీఎస్‌పై అధ్యయనానికీ తెలంగాణ, ఏపీ ఓకే..

నీటి వాటాపై ఎవరి వాదన వారిదే.. 50:50కి తెలంగాణ పట్టు


హైదరాబాద్‌, మే 6(ఆంధ్రజ్యోతి): కృష్ణా జలాలకు సంబంధించి పలు కీలక అంశాలపై తెలుగు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదిరింది. మిగులు జలాలు, జలవిద్యుత్తుకు మార్గదర్శకా లు రూపకల్పనతోపాటు ఆర్డీఎ్‌సపై శాస్త్రీయ అధ్యయనానికి ఏపీ, తెలంగాణ అంగీకరించా యి. ఏపీ ఆధీనంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు మ రమ్మతులకు తన వంతు ఆర్థికసాయం అందించడానికి తెలంగాణ ముందుకు వచ్చింది. హైదరాబాద్‌లోని జలసౌధలో శుక్రవారం జరిగిన కృష్ణానదీ యాజమాన్య బోర్డు 16వ సమావేశం లో ఈ మేరకు పలు అంశాలపై అంగీకారం కుదిరింది. బోర్డు చైర్మన్‌ ఎంపీ సింగ్‌ అధ్యక్షత న జరిగిన సమావేశానికి తెలంగాణ నుంచి నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌, ఈఎన్‌సీ సి.మురళీధర్‌రావు, ఏపీ నుంచి జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌, ఈఎన్‌సీ నారాయణరెడ్డితోపాటు తుంగభద్ర బోర్డు అధికారులు హాజరయ్యారు. ఎజెండాలోఉన్న 16 అంశాలపై చర్చించారు. అయితే, నీటి వాటా విషయంలో రెండు రాష్ట్రాలు తమ వాదనకే కట్టుబడ్డాయి.


కృష్ణా జలాలను 50:50 నిష్పత్తిలో పంచాల్సిందేనని, తెలంగాణ స్పష్టం చేయగా.. 66:34 నిష్పత్తికే కట్టుబడాలని ఏపీ డిమాండ్‌ చేసింది. వర్కింగ్‌ అరేంజ్‌మెంట్‌ కింద 66:34 నిష్పత్తితో జలాల పంపిణీకే కేఆర్‌ఎంబీ మొగ్గు చూపగా.. దీనిపై కేంద్రానికి సోమవారం లేఖ రాస్తామని తెలంగాణ వెల్లడించింది.


సయోధ్య కుదిరిన అంశాలివే..

  • రాజోలిబండ మళ్లింపు పథకం(ఆర్డీఎ్‌స)పై పూణేకు చెందిన సీడబ్ల్యూపీఆర్‌ఎ్‌సతో అధ్యయనం చేయించాలి. ఇందుకయ్యే ఖర్చును చెరి సగం భరించాలి.  
  • కేంద్ర గెజిట్‌ ప్రకారం కృష్ణా జలాలపై తెలంగాణలో 13, ఏపీలో 10 అనుమతి లే ని ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో అత్యధికం మిగులు జలాలపై కట్టినవే. ఆ ప్రా జెక్టుల డీపీఆర్‌లు సమర్పించే బదులు తా జా పరిస్థితిపై వాస్తవ నివేదికలను కృష్ణా బోర్డుకు అందించాలి. 
  • శ్రీశైలం, సాగర్‌, పులిచింతల రూల్‌కర్వ్‌పై నెలలోగా ఆరుగురు సభ్యుల కమిటీ ద్వారా  చర్చించి, బచావత్‌ ట్రైబ్యునల్‌ అవార్డుకు లోబడి రూల్‌కర్వ్‌ రూపొందించాలి. 
  • శ్రీశైలం, సాగర్‌, పులిచింతలలో పరస్పర అంగీకారంతో జలవిద్యుదుత్పత్తి చేపట్టాలి. మార్గదర్శకాల రూపకల్పనకు తాజా కమిటీకే బాధ్యతలు అప్పగించి... 15 రోజుల్లోగా నివేదిక ఇచ్చేలా చూడాలి.
  • మిగులు జలాల వినియోగంపైనా ఇదే కమిటీతో అధ్యయనం చేయించి, మార్గదర్శకాలు రూపొందించాలి. అలాగే, మిగులు జలాల వినియోగాన్ని లెక్కించరాదని ఇరు రాష్ట్రాలు కేఆర్‌ఎంబీకి సూచించాయి.
  • గెజిట్‌ అమలులో భాగంగా సీడ్‌ మనీ కింద బోర్డులకు నిధులు విడుదల చేసేందుకు అంగీకరించాయి. అయితే, ఖర్చులపై ప్రతిపాదనలు పంపాలని స్పష్టం చేశాయి.
  • నాగార్జునసాగర్‌ స్పిల్‌వే మరమ్మతులకు రూ.20కోట్లు విడుదల చేసినట్లు తెలంగాణ తెలిపింది. శ్రీశైలం మరమ్మతులకు నిధులు ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేసింది. అలాగే, పులిచింతల మరమ్మతులు చేపట్టడానికి ఏపీ సంసిద్ధత వ్యక్తం చేసింది. 


50: 50 నిష్పత్తిలో పంచాల్సిందే

2014లో తాత్కాలి ఒప్పందం ప్రకారం 66:34 నిష్పత్తిలో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు పంచారు. తాత్కాలిక ఒప్పందాలు కాస్తా శాశ్వతంగా మారే అవకాశం ఉన్నందున తెలంగాణకు 50:50 నిష్పత్తిలో 405 టీఎంసీలు కేటాయించాలి. దీనికోసం కేంద్రానికి లేఖ రాస్తాం. తెలంగాణలో 225 టీఎంసీలు వివిధ ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాల్సి ఉంది. ఇవి కాక మరో 120 టీఎంసీలు పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలకు అవసరం. 

 డాక్టర్‌ రజత్‌కుమార్‌, తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి


మిగులు జలాలను లెక్కించొద్దు

జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతల ప్రాజెక్టులు నిండి... సముద్రంలో కలిసే నీటిని తెలుగు రాష్ట్రాలు స్వేచ్ఛగా వినియోగించుకోవడానికి అవకాశం ఇవ్వాలి. మిగులు జలాలపై దిగువ రాష్ట్రాలకు బచావత్‌ ట్రైబ్యునల్‌ అధికారం ఇచ్చింది. ఆ అధికారం ఆధారంగా మిగులు జలాలను లెక్కించొద్దు. ఆర్డీఎ్‌సపై సాంకేతిక, శాస్త్రీయ అధ్యయనం చేయించి, తుది నిర్ణయం తీసుకుంటాం.

శశిభూషణ్‌కుమార్‌, ఏపీ జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి

Read more