కూల్చిన చోటే దర్గా పునఃనిర్మాణం

ABN , First Publish Date - 2022-06-29T06:15:01+05:30 IST

కూల్చిన చోటే దర్గా పునఃనిర్మాణ పనులను ముస్లిం మైనారిటీలు చేపట్టారు. మంగళవారం ఉదయం మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆయిల్‌మిల్‌ ఖాజా దర్గా నిర్మాణ పనులను గవిని సర్కిల్లో ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ మున్సిపల్‌ కమిషనర్‌ రమణయ్య, డీఎస్పీ ప్రసాద్‌ రావు, కాంట్రాక్టర్‌ ఓబులరెడ్డి కలిసి దర్గాను కూల్చి ముస్లిం మైనార్టీల మనోభావాలను దెబ్బతీశారన్నారు.

కూల్చిన చోటే దర్గా పునఃనిర్మాణం
దర్గా పునఃనిర్మాణ పనులు ప్రారంభిస్తున్న వై్‌స చైర్మన్‌ ఖాజా తదితరులు

పనులు ప్రారంభించిన వైసీపీ మైనారీటీ కౌన్సిల్లర్లు 

ప్రొద్దుటూరు (అర్బన్‌/ క్రైం), జూన్‌ 28:  కూల్చిన చోటే దర్గా పునఃనిర్మాణ పనులను ముస్లిం మైనారిటీలు చేపట్టారు. మంగళవారం ఉదయం మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆయిల్‌మిల్‌ ఖాజా దర్గా నిర్మాణ పనులను గవిని సర్కిల్లో ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ మున్సిపల్‌ కమిషనర్‌ రమణయ్య, డీఎస్పీ ప్రసాద్‌ రావు, కాంట్రాక్టర్‌ ఓబులరెడ్డి కలిసి దర్గాను కూల్చి ముస్లిం మైనార్టీల మనోభావాలను దెబ్బతీశారన్నారు. వైసీపీ ముస్లిం మైనార్టీ కౌన్సిల్లందరూ ఈ విషయంలో ఏకతాటిపై కలిసికట్టుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీస్‌ స్టేషన్‌ వేదికగా పోరాడామన్నారు. తమ మనోభావాలను పరిగణలోకి తీసుకుని తిరిగి అదే ప్రదేశంలో దర్గా తిరిగి నిర్మించేందుకు సహకరించిన నేతలం దరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిల్లర్లు వైఎస్‌ మహమ్మద్‌ గౌస్‌, మునీర్‌, కంకర గౌస్‌. మాజీ కౌన్సిలర్‌ రఫీక్‌, మైనారిటీ నేత పరీద్‌ మున్నా పాల్గొన్నారు.

ఎమ్మెల్యేపై కేసు పెట్టాలి : లింగారెడ్డి

దర్గాచెట్టు గోడ కూల్చివేతతో ముస్లిం మనోభావాలను దెబ్బతీసి, పట్టణంలో శాంతిభద్రతలకు విఘాతం కల్గించినందుకు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డిపై క్రిమినల్‌ కేసు పెట్టాలని టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళవారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్యే స్వలాభం కోసం ఆర్‌అండ్‌బీ రోడ్డులో మున్సిపల్‌ నిధులతో రోడ్డు విస్తరణ పనులు మొదలు పెట్టారని ధ్వజమెత్తారు. ఈ క్రమంలోనే దర్గాచెట్టు గోడను అధికారులతో కూల్చివేయించి, వివాదానికి తెరలేపారన్నారు. సమావేశంలో టీడీపీ నేతలు విజయభాస్కర్‌రెడ్డి, సిద్దయ్య, సుంకర వేణుగోపాల్‌, సుబ్బరాజు, టప్పా మహబూబ్‌బాష పాల్గొన్నారు.

రాచమల్లు అరాచక పాలనకు తెరదించాలి

ప్రొద్దుటూరు టీడీపీ ఇన్‌చార్జ్‌ ప్రవీణ్‌ రెడ్డి

ఎమ్మెల్యే రాచమల్లు, ఆయన బావమరిది బంగారురెడ్డి అరాచక పాలనకు తెరదించాలని టీడీపీ ఇన్‌చార్జ్‌ ప్రవీణ్‌రెడ్డి కోరారు. పట్టణంలో నిన్న మార్కెట్‌,నేడు దర్గాను కూల్చారని, రేపు ప్రజల ఆస్తుల వద్దకు రారని గ్యారెంటీ లేదని ఆందోళన వ్యక్తం చేశారు. దర్గాచెట్టు గోడ కూల్చివేతను వ్యతిరేకిస్తూ సోమవారం టీడీపీ నేతలు చేపట్టిన నిరసన ర్యాలీని పోలీసులు ఆదిలోనే భగ్నంచేశారు. ప్రవీణ్‌రెడ్డిని ఆయన ఇంటి వద్ద త్రీటౌన్‌ సీఐ ఆనందరావు అడ్డగించారు. ముక్తియార్‌ ఇంటి వద్ద ఉదయం నుంచే వన్‌టౌన్‌ సీఐ రాజారెడ్డి బ్యారికేడ్లతో కట్టడి చేశారు. ర్యాలీ చేయమని కేవలం కమిషనర్‌కు వినతిపత్రం ఇస్తామని టీడీపీ నేతలు మున్సిపల్‌ కార్యాలయానికి చేరుకున్నారు. కమిషనర్‌ రమణయ్యను కలిసి వినతిపత్రం ఇచ్చారు. కేవలం మసీదు ఆస్తుల వైపు మాత్రమే రోడ్డు విస్తరణ పనులు చేపట్టారని మైనార్టీల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా దర్గా చెట్టు గోడను ఎందుకు కూల్చారని ప్రశ్నించారు. ఇందుకు కమిషనర్‌ రమణయ్య నిబంధనల ప్రకారం రోడ్డు విస్తరణలో భాగంగానే కూల్చామే తప్ప మరో అభిప్రాయానికి తావులేదని తెలిపారు. అనంతరం మున్సిపల్‌ కార్యాలయం వద్ద ప్రవీణ్‌ రెడ్డి మాట్లాడుతూ దర్గాను కూల్చడంలో సంబంధం లేదంటే అల్లాసాక్షిగా ఎమ్మెల్యే ప్రమాణం చేయాలని సవాల్‌ విసిరారు. టీడీపీ నేతలు కనీసం నిరసన ప్రదర్శన చేసేందుకు కూడా పోలీసులు అనుమతులు ఇవ్వకుండా అడ్డుకోవడం దారుణమన్నారు.


ఇదేందీ సారూ...!

దర్గా చెట్టు గోడ కూల్చివేత పసిడిపురిలో పెద్ద దుమారమే రేపింది. దీంతో మంగళవారం టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ వీఎస్‌ ముక్తియార్‌ తన అనుయాయులతో దర్గా చెట్టు గోడ కూల్చిన ప్రాంతానికి వెళ్లనీయకుండా పోలీసులు ఆయన నివసించే ఇస్లాంపురం వీధిలో ఇరువైపులా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పోలీసు చర్యలను చూసి అక్కడి ప్రజలు ‘ఇదేందీ సారూ.. మేమెప్పుడూ చూడలే’ అంటూ ముక్కున వేలేసుకున్నారు. 

Updated Date - 2022-06-29T06:15:01+05:30 IST