ఆర్థిక మంత్రిగా రికార్డు

Dec 5 2021 @ 03:34AM

  • పొదుపు మంత్రమే ఆయన ప్రత్యేకత
  • అప్పులు, ఓవర్‌ డ్రాఫ్ట్‌లకు బద్ధ వ్యతిరేకి


(అమరావతి - ఆంధ్రజ్యోతి) 

‘ఇంటి నిర్వహణ విషయంలో ఎంత పొదుపుగా ఉంటానో... ఆర్థిక మంత్రిగా ప్రజాధనం ఖర్చు విషయంలోనూ అంతే పొదుపుగా ఉంటాను’... ఇది రోశయ్య చెప్పిన మాట! రోశయ్య పేరు వినగానే గుర్తుకొచ్చేది ఆర్థిక శాఖే! అనేక శాఖలను సమర్థంగా నిర్వహించిన ఆయన... ఆర్థిక శాఖపై మాత్రం ప్రత్యేక ముద్ర వేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరున్నా.. ఆర్థిక మంత్రి మాత్రం రోశయ్యే. ఒక్క అంజయ్య హయాంలో మినహా.. వరుసగా మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన రెడ్డి, కోట్ల విజయభాస్కర రెడ్డి, వైఎస్‌ రాజశేఖర రెడ్డి హయాంలలో రోశయ్య ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా గాడిలో పెట్టగల నేర్పరితనం రోశయ్యలో ఉందని కాంగ్రెస్‌ అధిష్ఠానం బలంగా నమ్మేది. ఆ రోజుల్లో మంత్రులూ.. వారి శాఖలనూ కాంగ్రెస్‌ అధిష్ఠానమే ఖరారు చేసేది. రోశయ్య మొత్తం 15సార్లు రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అందులోనూ... చివరి ఏడుసార్లు వరుసగా బడ్జెట్‌ సమర్పించారు. ఇదో రికార్డు! మంత్రిగా ఉన్న ఆయన అసెంబ్లీ వేదికపై ముఖ్యమంత్రులకే సలహాలు ఇచ్చేవారు. ‘‘మీరు పర్యటనలకు వెళ్లినప్పుడు శ్రుతిమించి హామీలు ఇస్తున్నారు. అవన్నీ నాకు భారంగా మారుతున్నాయి. కాస్త చూసుకుని వెళ్లండి’’ అని వినయపూర్వకంగానే హెచ్చరించేవారు.


ఆర్థిక క్రమశిక్షణకు పెట్టింది పేరు...

ఆర్థిక మంత్రిగా రోశయ్య పూర్తిస్థాయిలో ఆర్థిక క్రమశిక్షణ పాటించేవారు. ఇప్పుడు జగన్‌ హయాంలో ఎడాపెడా ఓవర్‌ డ్రాఫ్ట్‌కు వెళ్తున్నారు కానీ... ఒకప్పుడు ఓడీకి వెళ్లడమంటే అదో అవమానం! అంతకుముందు  తెలుగుదేశం ప్రభుత్వం విపరీతంగా ఓడీకి వెళ్లిందని... వైఎస్‌ హయాంలో ఆర్థిక మంత్రిగా ఉన్న రోశయ్య వ్యాఖ్యానించారు. ‘‘ఓవర్‌ డ్రాఫ్ట్‌ చేసుకునేందుకు అవకాశం ఉంది కాబట్టి ఉపయోగించుకున్నాం’’ అని మాజీ మంత్రి యనమల బదులిచ్చారు. ‘‘అంటే .. ఇంట్లో కూరగాయల కత్తి ఉందని మెడ కోసుకుంటామా? ’’ అని హెచ్చరించారు. పథకాల పేరిట మితిమీరి అప్పులు చేయడాన్ని వ్యతిరేకించారు. రాష్ట్ర బడ్జెట్‌ను ఇంటి ఖర్చులతో సరిపోల్చేవారు. ‘‘ ఇంటికి బంధువులు వస్తే ఇంటావిడ..  కాఫీ ఇచ్చేందుకు పాలు, కాఫీ పౌడరు, పంచదార ఉన్నాయో లేదో చూస్తుంది. అన్నీ ఉంటే కాఫీ చేస్తుంది. లేదంటే.. నిమ్మకాయలు అందుబాటులో ఉంటే నిమ్మరసం ఇస్తుంది. అదీకాకుంటే... మజ్జిగో, నీళ్లో ఇస్తుంది. అంతేతప్ప... పక్కింటికి అప్పుకు వెళ్లదు. వచ్చిన అతిథులకు ఎలా మర్యాద చేశామన్నదే ముఖ్యం! ఏం ఇచ్చాం అనేది కాదు’’ అని వివరించారు.


15 సార్లు బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన రోశయ్య 

నాలుగు దశాబ్దాలకుపైగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీలో ఆయనది ప్రత్యేక స్థానం. టంగుటూరి అంజయ్య నుంచి వైఎస్‌ రాజశేఖర రెడ్డి వరకూ కాంగ్రెస్‌ పార్టీలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా.. మంత్రివర్గంలో ఆయన ఉండాల్సిందే. ఎన్జీ రంగా శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చిన కొణిజేటి రోశయ్య అంచెలంచెలుగా ఎదిగారు. ఎన్నో ఉన్నత పదవులు చేపట్టారు. ఆర్థిక మంత్రిగా 15 సార్లు బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన ఘనత ఆయన సొంతం. పీసీసీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్‌గా సేవలు అందించారు. సుదీర్ఘ కాలం కీలకమైన పదవులు చేపట్టినా ఎప్పుడు అవినీతి ఆరోపణలు రాలేదు. వివాద రహితుడిగా, సౌమ్యుడిగా, అజాత శత్రువుగా రోశయ్య తనదైన ముద్ర వేశారు.


ఎప్పుడు.. ఏయే పదవులు.. 

1968: తొలిసారిగా శాసనమండలికి ఎన్నిక

1968, 1974, 1980, 2009: ఎమ్మెల్సీగా ఎన్నిక

1979: టంగుటూరి అంజయ్య ప్రభుత్వంలో రవాణా, గృహ నిర్మాణం, వాణిజ్య పన్నుల శాఖల మంత్రిగా బాధ్యతలు 

1982: కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వంలో హోం శాఖ మంత్రిగా బాధ్యతలు 

1989: మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, రవాణా, విద్యుత్‌ శాఖల మంత్రిగా బాధ్యతలు 

1991: నేదురుమల్లి జనార్దనరెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్‌ శాఖల మంత్రిగా బాధ్యతలు 

1992: కోట్ల విజయభాస్కర రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్యుత్‌ శాఖల మంత్రిగా బాధ్యతలు 

1995-97: ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు 

1989, 2004: ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యేగా ఎన్నిక

1994: అసెంబ్లీ ఎన్నికల్లో చీరాలలో ఓటమి

1998: నరసరావుపేట నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నిక

2004, 2009: వైఎస్‌ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు 

15 సార్లు బడ్జెట్‌: ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘకాలం పాటు ఆర్థిక మంత్రిగా పనిచేసి, మొత్తం 15 సార్లు బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన రికార్డు రోశయ్యదే. 2004 నుంచి ఏడుసార్లు వరుసగా బడ్జెట్‌ ప్రవేశ పెట్టారు

2009-2010: దాదాపు 14 నెలలు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు

2011-2016: తమిళనాడు గవర్నర్‌గా సేవలు (2 నెలలు కర్ణాటక ఇన్‌చార్జి గవర్నర్‌గా  బాధ్యతలు)

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.