
ఒకవైపు ఆస్కార్, మరోవైపు నోబెల్.. ఈ రెండింటినీ దక్కించుకున్నవారు ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు ఉన్నారు. వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా మరోసారి ఆస్కార్ అవార్డుల సందడి మొదలయ్యింది. 94వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం(మార్చి 27, 2022)న ప్రారంభం కానుంది. లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్లో అవార్డుల వేడుకను నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం 5.30 నుండి భారతదేశంలో వీక్షించే అవకాశం కలుగుతుంది. ఈ వేడుకలో మళ్లీ కొత్త రికార్డులు తెరమీదకు వస్తాయి. అయితే చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసిన ఒక రికార్డు ఉంది. ప్రపంచంలో ఆస్కార్ అవార్డు, నోబెల్ ప్రైజ్ పొందిన రికార్డు కేవలం ఇద్దరికే దక్కింది. వారి పేర్లు జార్జ్ బెర్నార్డ్ షా, బాబ్ డైలాన్.
ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారం నోబెల్. సాహిత్యం, శాంతి, ఆర్థిక శాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్యం రంగాలలో విశేషమైన సేవలు అందించిన వారికి ఈ అవార్డు ఇస్తారు. ఇక సినిమా రంగంలో విశేష కృషి చేసినందుకు ఆస్కార్ అవార్డును ప్రదానం చేస్తారు. ఇది సినిమాకి సంబంధించిన వివిధ రంగాలలోని వారికి అందజేస్తారు. కాగా జార్జ్ బెర్నార్డ్ షా, బాబ్ డైలాన్లు నటన, గానం, రచన, దర్శకత్వం తదితర రంగాల్లో ప్రతిభ చూపారు. జార్జ్ బెర్నార్డ్ షా.. ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో 26 జూలై 1856న జన్మించారు.. జార్జ్ బెర్నార్డ్ షా విమర్శకుడు, రాజకీయ కార్యకర్త, నాటక రచయిత. సినిమాలకు కూడా రచనలు సాగించారు.
1925లో సాహిత్య రంగంలో ఆయన చేసిన అసాధారణ కృషికి నోబెల్ బహుమతిని అందుకున్నారు. సరిగ్గా 13 ఏళ్ల తర్వాత 'పిగ్మాలియన్' చిత్రానికి స్క్రీన్ ప్లే రాసినందుకు ఆస్కార్ అవార్డు అందుకున్నారు. 1941లో అమెరికాలో జన్మించిన బాబ్ డైలాన్ వృత్తిరీత్యా పాటల రచయిత, గాయకుడు. 2000 సంవత్సరంలో 'వండర్ బాయ్స్' చిత్రంలోని 'థింగ్స్ హావ్ చేంజ్డ్' పాట ఆస్కార్స్‌లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఎంపికై అవార్డును అందుకుంది. 2016లో బాబ్ డైలాన్ సాహిత్య రంగంలో చేసిన కృషికి గాను నోబెల్ బహుమతిని అందుకున్నారు.