Turkey: టర్కీకి పొటెత్తిన భారత పర్యాటకులు.. ఒక్క జూన్ నెలలోనే ఎంతమంది సందర్శించారంటే..

ABN , First Publish Date - 2022-08-02T15:42:53+05:30 IST

మహమ్మారి కరోనా (Covid -19) కారణంగా దాదాపు రెండేళ్లు అన్ని రంగాల మాదిరిగానే పర్యాటకరంగం (Tourism) కూడా తీవ్ర నష్టాలు చవిచూసింది.

Turkey: టర్కీకి పొటెత్తిన భారత పర్యాటకులు.. ఒక్క జూన్ నెలలోనే ఎంతమంది సందర్శించారంటే..

అంకారా: మహమ్మారి కరోనా (Covid -19) కారణంగా దాదాపు రెండేళ్లు అన్ని రంగాల మాదిరిగానే పర్యాటకరంగం (Tourism) కూడా తీవ్ర నష్టాలు చవిచూసింది. అయితే, గత ఆరేడు నెలల నుంచి పరిస్థితులు అదుపులోకి రావడంతో ప్రపంచ దేశాలు ఒక్కొక్కటి ఆంక్షలను తొలగించాయి. ఇప్పుడు దాదాపు అన్ని దేశాల్లో మునుపటిలా సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో విదేశీ పర్యాటకులు ఇంతకుముందులానే సందర్శనలకు వెళ్తున్నారు. ఇలా జూన్ నెలలో భారత పర్యాటకులు టర్కీ (Turkey)కి క్యూకట్టారు. ఈ ఒకే నెలలో రికార్డు స్థాయిలో 27,300 మంది భారత పర్యాటకులు (Indian Tourists) టర్కీని సందర్శించినట్లు తాజాగా ఆ దేశ టూరిజం విభాగం వెల్లడించింది. 


ఇది కోవిడ్ కంటే ముందు 2019లో ఇదే నెలలో సందర్శించిన పర్యాటకుల సంఖ్య 23,800 కంటే ఎక్కువ. సాధారణంగా భారతీయులు (Indians) మే, అక్టోబర్ మాసాల్లో అధిక సంఖ్యలో తమ దేశానికి వస్తుంటారని, కానీ ఈసారి జూన్ (June) నెల దానికి వేదికైందని టర్కీ టూరిజం (Tourism) అధికారులు పేర్కొన్నారు. మునుముందు కూడా ఇదే కొనసాగాలని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, టర్కీష్ ఎయిర్‌లైన్ (Turkish Airlines), ఇండిగో (Indigo) విమాన సంస్థలు ఇరు దేశాల మధ్య డైరెక్ట్ విమాన సర్వీసులు నడపడం కూడా ఇలా పర్యాటకుల సంఖ్య ఒక్కసారిగా పెరగడానికి కారణమైందని టూరిజం విభాగం వెల్లడించింది. ఇక 2019 ఏడాది మొత్తంలో 5.2 కోట్ల మంది పర్యాటకులు టర్కీని సందర్శించగా.. పర్యాటక రంగానికి 34.5 బిలియన్ డాలర్లు (రూ.27,20,62,86,00,000) ఆదాయం వచ్చింది. 2019లో ఆ దేశాన్ని సందర్శించిన 5.2కోట్ల మంది పర్యాటకుల్లో అత్యధికంగా 2.3లక్షల మంది భారతీయులే ఉండడం గమనార్హం. 

Updated Date - 2022-08-02T15:42:53+05:30 IST