ఇష్టారాజ్యంగా బిల్లుల రికార్డు

ABN , First Publish Date - 2022-05-28T05:54:16+05:30 IST

నగరంలోని 60 డివిజన్లలో దాదాపుగా ఏదో ఒక అభివృద్ధి పని జరుగుతోంది. ఆ పనులను నాణ్యతా ప్రమాణాలతో చేస్తున్నారా లేదా... నిబంధనల్లో పేర్కొన్న విధంగా చేశారా లేదా అని నగరపాలక సంస్థ ఇంజనీరింగ్‌ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి బిల్లులను రికార్డు చేయాల్సి ఉంటుంది.

ఇష్టారాజ్యంగా బిల్లుల రికార్డు

- కాంట్రాక్టర్లతో అధికారుల కుమ్మక్కు

- నాణ్యతకు, నిబంధనలకు తిలోదకాలు

కరీంనగర్‌ టౌన్‌, మే 27: నగరంలోని 60 డివిజన్లలో దాదాపుగా ఏదో ఒక అభివృద్ధి పని జరుగుతోంది. ఆ పనులను నాణ్యతా ప్రమాణాలతో చేస్తున్నారా లేదా... నిబంధనల్లో పేర్కొన్న విధంగా చేశారా లేదా అని నగరపాలక సంస్థ ఇంజనీరింగ్‌ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి బిల్లులను రికార్డు చేయాల్సి ఉంటుంది. ఇందుకు విరుద్ధంగా  వారికి నచ్చిన కాంట్రాక్టర్లతో కుమ్మక్కై నాణ్యతను పరిశీలించకుండానే, నిబంధనల మేరకు పనిచేయకున్నా, చేసిన పనికన్నా ఎక్కువ రికార్డు చేసి బిల్లులను ఇప్పిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

  చేయని పనులకు బిల్లులు

వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఆవరణలో దాదాపు 5.8 కోట్లతో నిర్మిస్తున్న సమీకృత మార్కెట్‌ పనుల్లో  చేయని పనులకు బిల్లులను రికార్డు చేసి దాదాపు 40 లక్షల మేరకు కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించారని విమర్శలు వినిపిస్తున్నాయి. సమీకృత మార్కెట్‌ను నిర్మించేందుకు గ్రౌండ్‌ లెవలింగ్‌ చేసినట్లు, స్టోన్‌ కట్టింగ్‌ చేసినట్లుగా చూపించి 40 లక్షల బిల్లును కాంట్రాక్టర్‌కు ఇప్పించారు.  మార్కెట్‌లో గ్రౌండ్‌ లెవల్‌గానే ఉన్నప్పటికీ లెవలింగ్‌, స్టోన్‌ కటింగ్‌ పేరుతో 40 లక్షలు చెల్లించడంలో ఆంతర్యమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎల్‌ఎండీ సమీపంలో ఇటీవల చేపట్టిన పైపులైను మరమ్మతుల పనుల్లో కూడా దాదాపు 10 లక్షల రూపాయల బిల్లులను అదనంగా డ్రా చేసేందుకు తప్పుడు రికార్డులు చేశారని తెలిసింది. వాస్తవంగా అక్కడ లక్ష నుంచి రెండు లక్షల మొరం పోసి 10 లక్షల మొరం పోసినట్లు రికార్డు చేసుకున్నారని, ఈ బిల్లు కూడా చెల్లించేందుకు సిద్ధం చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. బుట్టిరాజారాం కాలనీ పార్కుతోపాటు అనేక చోట్ల జరుగుతున్న సివిల్‌ పనుల్లో కూడా కొంత మంది కాంట్రాక్టర్లతో ఒకరిద్దరు ఇంజనీరింగ్‌ అధికారులు కుమ్మక్కై చేసిన పనుల కంటే ఎక్కువ బిల్లులను ఇప్పిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఒకే పనికి రెండు సార్లు రికార్డుచేసి బిల్లులు డ్రా చేస్తున్నారని, నిబంధనల మేరకు పనులు చేయకున్నా బిల్లులను ఇస్తున్నారని, నాణ్యతను పాటించక పోయినా కనీసం ఆ పనులవైపు కన్నెత్తి చూడకుండానే బిల్లులు చెల్లిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రెండు, మూడేళ్లుగా వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగగా వాటిలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, ఒకరిద్దరు కాంట్రాక్టర్లు, ఇంజనీరింగ్‌ అధికారులు  బల్దియాకు భారీగా నష్టం కలిగించారనే ఆరోపణలు వస్తున్నాయి. 

  కాంట్రాక్టర్ల వద్దనే ఎంబీ రికార్డులు

అభివృద్ధి పనులకు సంబంధించిన రికార్డులన్నీ కార్యాలయంలోని సంబంధిత అధికారులు, ఉద్యోగుల వద్దనే ఉండాలని మంత్రి గంగుల కమలాకర్‌, మేయర్‌ సునీల్‌రావు పలు సందర్భాల్లో ఆదేశించారు. కాని కాంట్రాక్టర్ల వద్దనే ఎంబీ రికార్డులు ఉండడమే కాకుండా వారి వద్దకు వెళ్లి కొందరు ఇంజనీరింగ్‌ అధికారులు బిల్లులు వారు చెప్పినట్లుగానే రికార్డు చేస్తున్నారని తెలిసింది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాలని నగరవాసులు కోరుతున్నారు. 

Updated Date - 2022-05-28T05:54:16+05:30 IST