కొంత నయం!

ABN , First Publish Date - 2021-05-14T04:33:42+05:30 IST

కరోనా బాధితులు కోలుకుంటున్నారు. జిల్లాలో ఆశాజనకంగా రికవరీ రేటు 82 శాతానికి పెరిగింది. పోలీసులు, వైద్య ఆరోగ్యశాఖ కల్పిస్తున్న అవగాహన బాధితుల్లో చైతన్యం నింపుతోంది. కరోనా బారిన పడి స్వల్ప మరణాలు సంభవిస్తున్నా, అధిక సంఖ్యలో బాధితులు డిశ్చార్జ్‌ అవుతున్నారు. గత ఏడాది నుంచి ఇప్పటివరకూ జిల్లావ్యాప్తంగా 90,515 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో 74,549 మంది కరోనాను జయించారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 15,966 మాత్రమే ఉన్నాయి.

కొంత నయం!

కోలుకుంటున్న కరోనా బాధితులు 

 13 రోజుల్లో 20,546 మంది డిశ్చార్జ్‌

 పాజిటివ్‌ కేసులు కూడా తగ్గుముఖం

(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి)

కరోనా బాధితులు కోలుకుంటున్నారు. జిల్లాలో ఆశాజనకంగా రికవరీ రేటు 82 శాతానికి పెరిగింది. పోలీసులు, వైద్య ఆరోగ్యశాఖ కల్పిస్తున్న అవగాహన బాధితుల్లో చైతన్యం నింపుతోంది. కరోనా బారిన పడి స్వల్ప మరణాలు సంభవిస్తున్నా, అధిక సంఖ్యలో బాధితులు డిశ్చార్జ్‌ అవుతున్నారు. గత ఏడాది నుంచి ఇప్పటివరకూ జిల్లావ్యాప్తంగా 90,515 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో 74 వేలమంది కరోనాను జయించారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 15,966 మాత్రమే ఉన్నాయి. గత నెల నుంచి పాజిటివ్‌ కేసులు ఒక్కసారిగా వేలల్లోకి పెరిగిపోవడంతో జిల్లావాసులు భయాందోళన చెందారు. ఈ నెల మొదటి వారంలో కూడా రోజుకు రెండువేలకు పైగా కేసులు నమోదు కావడంతో కలవరపడ్డారు. గత ఐదురోజుల నుంచి పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయి. ఈ నెలలో ఇప్పటివరకూ 20,546 మంది డిశ్చార్జి అయ్యారు. తాజాగా గురువారం 4,939 మంది నుంచి నమూనాలు సేకరించగా.. 824 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ ఆస్పత్రుల నుంచి 1,732 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనాతో పోరాడి ఏడుగురు మృతి చెందారు.  ప్రస్తుతం  హోం ఐసోలేషన్‌లో 13,174 మంది, కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో 931 మంది, కొవిడ్‌ ఆస్పత్రుల్లో 1,861 మంది చికిత్స పొందుతున్నారు. పిల్లలపై అంతగా ప్రభావం చూపలేదని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. గత సంవత్సరం  పూర్తి లాక్‌డౌన్‌  విధించడంతో చాలా తక్కువ మంది పిల్లలకు వైరస్‌ సోకింది. ఈ సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌  నెల సగం వరకు పాఠశాలలు నిర్వహించడంతో చిన్నారుల్లో బాధితులు పెరిగారు. అయినా.. దాదాపు అంతా కరోనాను జయించి కోలుకున్నారు. పాజిటివ్‌ కేసులు తగ్గి...  రికవరీ రేటు పెరగడంతో జిల్లావాసులు కాస్త   ఊపిరి పీల్చుకుంటున్నారు. 


 యువకులపై ప్రభావం 

రోజువారీ కార్యకలాపాలు, ఉద్యోగాలు తదితర పనుల్లో నిమగ్నమవుతున్న నడివయసువారు, యువకులు కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. వీరి నుంచి కుటుంబ సభ్యులు, ఇంట్లోని పెద్దలకు వైరస్‌ వ్యాపిస్తోంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బయటకు వచ్చేవారు చాలా జాగ్రత్తగా ఉండాలని.. మాస్క్‌లు ధరించాలని.. కొవిడ్‌ నిబంధనలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. కరోనా బారినపడిన వారు త్వరితగతిన తెలుసుకుని తగిన వైద్యసేవలు పొందాలని చెబుతున్నారు. మహమ్మారి బారిన పడవద్దని... అనుకోని పరిస్థితుల్లో సోకినా మంచి చికిత్స తీసుకుంటూ ధైర్యంగా పోరాడాలని సూచిస్తున్నారు. మరోవైపు పోలీసులు పకడ్బందీగా కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. దీంతో కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఇదే సమయంలో మరింత అప్రమత్తంగా ఉంటే వైరస్‌ నిర్మూలన సాధ్యమని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 


 ‘రెమ్‌డెసివర్‌’పై ఆరా!

వివరాలు సేకరిస్తున్న అధికారులు

‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన

శ్రీకాకుళం, మే 13 (ఆంధ్రజ్యోతి): ఆక్సిజన్‌ బెడ్‌పై ఉన్న కరోనా బాధితులకు అవసరమైన రెమ్‌డెసివర్‌ ఇంజెక్షన్‌ల కృత్రిమ కొరతపై అధికారులు ఆరా తీశారు. గురువారం ‘రెమ్‌డెసివర్‌ ఎక్కడ’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. ప్రైవేటు ఆసుపత్రులకు రెమ్‌డెసివర్‌ ఇంజెక్షన్లు ఎలా వెళుతున్నాయనే దానిపై వివరాలు సేకరించినట్లు సమాచారం. అనుమతి లేకపోయినా కరోనా వైద్యం చేస్తున్న ఆసుపత్రుల వివరాలను సేకరించారు. వారిపై చర్యలకు సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్‌ కేవలం అధికారులు మాత్రమే కేటాయిస్తుండగా, బ్లాక్‌ మార్కెట్‌లో ప్రైవేటు ఆసుపత్రుల యజమానులు ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నారనే దానిపై ఇంటెలిజెన్స్‌ పోలీసు విభాగం వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల కుటుంబ సభ్యులతో అఽధికారులు చర్చించి వివరాలు సేకరించినట్టు సమాచారం. 

Updated Date - 2021-05-14T04:33:42+05:30 IST